Medical Student Incident: దారుణం.. MBBS విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
ABN , Publish Date - Oct 11 , 2025 | 06:43 PM
ఒడిశా రాష్ట్రం జలేశ్వర్ కు చెందిన యువతి శుక్రవారం రాత్రి పానీపురి తినేందుకు తన స్నేహితుడితో కలిసి కాలేజీ నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో బయటకు వెళ్లారు. ఎవరూ లేని సమయంలో అమ్మాయి.. ఒక అబ్బాయితో మాత్రమే ఉండటాన్ని గమనించి రాకాసిమూకలు దుర్మార్గానికి ఒడిగట్టారు.
పశ్చిమ బెంగాల్, అక్టోబర్ 11: దేశంలో ఎక్కడో ఒకచోట ప్రతి రోజూ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు తెచ్చినప్పటికీ నిందితులకు ఎలాంటి భయం లేకుండా పోతుంది. మనుషుల్లా కాకుండా మానవ మృగాల్లాగా దారుణానికి పాల్పడుతున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరో గ్యాంగ్ రేప్ (Gang rape) ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ సమీపంలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. సదరు విద్యార్థిని ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చి పశ్చిమ బెంగాల్‌లో ఎంబీబీఎస్ చదువుతోంది.
ఒడిషా రాష్ట్రం జలేశ్వర్ కు చెందిన యువతి శుక్రవారం రాత్రి పానీపురి తినేందుకు తన స్నేహితుడితో కలిసి కాలేజీ నుంచి రాత్రి 8:30 గంటల సమయంలో బయటకు వెళ్లింది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో గమనించిన రాకాసిమూకలు దుర్మార్గానికి ఒడిగట్టారు. అమ్మాయితో ఉన్న అబ్బాయిని పక్కకు నెట్టేసి గట్టిగా కొట్టారు. ఆ అమ్మాయిని దుర్మార్గులు కాలేజీ వెనకాల ఉన్న అడవిలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి ఫోన్ లాక్కుని దూరంగా పడేసి అక్కడి నుంచి పారిపోయారు. విద్యార్థిని స్నేహితుడు జరిగిన విషయమంతా తన హాస్టల్ లోని విద్యార్థులకు చెప్పగా అందరు కలిసి బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
బాధితురాలి పేరెంట్స్‌కు జరిగిన విషయం తెలియజేయగా.. ఒడిషాలోని జలేశ్వర్ నుంచి బయల్దేరి పశ్చిమ బెంగాల్ కు చేరుకున్నాయి. తమ కూతురికి జరిగిన ఘటనపై గుండెలవిశేలా రోధించారు. తక్షణమే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాలేజీలో సరైన భద్రతా చర్యలు లేవని యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోవైపు ఈ ఘటనపై దుర్గాపుర్ న్యూ టౌన్‌షిప్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
పశ్చిమ బెంగాల్ మహిళా& శిశు అభివృద్ధి శాఖ మంత్రి షశి పంజా మాట్లాడుతూ.. విద్యార్థిని చికిత్స పొందుతోందని, వైద్యులు అప్రమత్తంగా ఉండి చికిత్స అందిస్తున్నారని చెప్పారు. యువతిపై సామూహిక అత్యాచారం చేయడం దారుణమని పేర్కొన్నారు. పోలీసుల విచారణపై తల్లిదండ్రులు నమ్మకంతో ఉన్నారన్నారు. ఇలాంటి నేరాలను రాజకీయం చేయవద్దని కోరారు. మరోవైపు కాలేజీ నుంచి రాష్ట్ర ఆరోగ్య శాఖ నివేదికను కోరింది. మహిళా జాతీయ కమిషన్ (NCW) ఒక బృందం దుర్గాపుర్‌కు వెళ్లి బాధితురాలు, ఆమె తల్లిదండ్రులను కలవడం కోసం సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి:
Wife Eliminated Husband: ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య
Chennai News: దేవుడా.. ఈ పిల్లోడు చేసిన తప్పేంటయ్యా.. ఏం జరిగిందో తెలిస్తే..