Arunachal Pradesh : లోయలో పడ్డ ట్రక్కు.. 22 మంది కార్మికులు మృతి
ABN , Publish Date - Dec 11 , 2025 | 05:10 PM
ఈ మధ్య కాలంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎవరో చేసిన పాపానికి మరెవరో బలైనట్లు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల అమాయకు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
దేశంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతి వేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అనుభవం లేకుండా క్లీనర్లు వాహనాలు నడపడం ఇలా ఎన్నో కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇండో - చైనా సరిహద్దు వెంబడి ఉన్న హుయులియాంగ్ - చగ్లగామ్ రహదారిపై ఈ ఘటన జరిగింది. అస్సోంలోని టిన్సుకియా జిల్లాకు చెందిన రోజు వారి కూలీలను తీసుకువెళ్తున్న ఓ ట్రక్కు మార్గమధ్యలో ఈ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ట్రక్కులో ఉన్న 22 మంది కూలీలు చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు.
వాస్తవానికి ఈ ఘటన సోమవారం అంటే మూడు రోజుల క్రితం జరిగింది. ఈ ప్రమాదం నుంచి ఓ కార్మికుడు గాయాలతో బయటపడి పట్టణానికి చేరుకున్నాడు. అతడు ఇచ్చిన సమాచారం వల్లనే ఈ విషాద ఘటన గురించి పోలీసులకు తెలిసింది. గాయపడ్డ ఆ కార్మికుడి మెరుగైన చికిత్స కోసం అస్సాంకు తరలించారు. ప్రమాద ఘటన గురించి అంజావ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ మిల్లో కొజిన్ ధృవీకరించారు.
ఈ ప్రమాదంపై మాట్లాడుతూ.. ఈ ఘటన అంతర్జాతీయ సరిహద్దుకు 45 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి దాదాపు 10 వేల అడుగుల ఎత్తులో ఉందన్నారు. ఇప్పటి వరకు 17 మృతదేహాలను వెలికి తీసినట్లు తెలిపారు. రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మిలో కొజిన్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అఖండ - 2 మేకర్స్‌కి మరో ఎదురు దెబ్బ.. హైకోర్టులో కేసు..
Read Latest National News and National News