Manipur: పారామిలటరీ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
ABN , Publish Date - Sep 19 , 2025 | 08:48 PM
భద్రతాదళాలపై జరిగిన దాడిని మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు వీర జవాన్లు మృతి చెందారని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇంఫాల్: మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో కొందరు గుర్తుతెలియని సాయుధులు పారామిలటరీ వాహనంపై శుక్రవారం నాడు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సాయంత్రం 6 గంటల సమయంలో నింబోల్ సబల్ లైకై ప్రాంతంలో ఈ ఘాతుకం జరిగింది. ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్‌కు అసోం రైఫిల్స్ సిబ్బంది ప్రయాణిస్తుండగా వారి వాహనంపై కొందరు సాయుధులు దాడి చేసినట్టు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు.
గవర్నర్ ఖండన

భద్రతాదళాలపై జరిగిన దాడిని మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు వీర జవాన్లు మృతి చెందారని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జవాన్ల అంకితభావం, త్యాగాలను జాతి మరిచిపోదని అన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరలో కోలుకావాలని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు. హింసను ఎంతమాత్రం సహించేది లేదని, ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత పరిరక్షించేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని స్పష్టం చేశారు.
మాజీ సీఎం దిగ్భ్రాంతి
మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ఈ దాడిని ఖండించారు. 33 అసోం రైఫిల్స్ సిబ్బందిపై జరిగిన దాడి తనను కలిచివేసిందని చెప్పారు. జవాన్ల మృతి తీరని లోటని, వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారికి తీవ్ర శిక్ష తప్పదని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయభేరి
హఫీజ్‌ను కలిసినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు.. అఫిడవిట్‌లో యాసిన్ మాలిక్ వెల్లడి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి