Amit Shah: ఆయుధాలు వీడితే ఒక్క పోలీసు బుల్లెట్ కూడా పేల్చం
ABN , Publish Date - Sep 28 , 2025 | 09:59 PM
మావోయిస్టుల కాల్పుల విరమణ ఆఫర్‌ను స్వాగతిస్తున్న వారిపై అమిత్‌షా మండిపడ్డారు. వామపక్ష తీవ్రవాదంపై చేపట్టిన 'ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్'ను ఆపేయాలని ఇటీవల వామపక్షాలు ముఖ్యంగా సీపీఐ, సీపీఐ-ఎంలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయని చెప్పారు.
న్యూఢిల్లీ: మావోయిస్టులతో (Maoists) కాల్పుల విరమణ (Ceasefire) ప్రసక్తే లేదని, ఆయుధాలు వీడాల్సిందేనని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) స్పష్టం చేశారు. ఆయుధాలు వీడితే ఒక్క పోలీసు బుల్లెట్‌ను కూడా పేల్చమని చెప్పారు. ఢిల్లీలో ఆదివారంనాడు 'నక్సల్ ముక్త్ భారత్'పై సెమినార్ ముగింపు సమావేశంలో అమిత్‌షా మాట్లాడుతూ, మావోయిస్టులు లొంగిపోతే స్వాగతిస్తామని, వారికి పునరావాసం కల్పిస్తామని అన్నారు.
'ఇటీవల కొంత గందరగోళం సృష్టించేందుకు ఒక లేఖ రాశారు. ఇంతవరకూ జరిగిందంతా పొరపాటని, లొంగిపోవాలని తాము అనుకుంటున్నందున కాల్పుల విరమణ ప్రకటించాలని అందులో కోరారు. దానికి నేను చెప్పే సమాధానం ఒకటే. కాల్పుల విరమణ ప్రసక్తే లేదు. లొంగిపోవాలని అనుకుంటున్నప్పుడు కాల్పుల విరమణ అవసరం ఏముంది? మీరు ఆయుధాలు వదిలి రండి. పోలీసులు ఒక్క బుల్లెట్ కూడా పేల్చరు' అని అమిత్‌షా స్పష్టం చేశారు.
మావోయిస్టుల కాల్పుల విరమణ ఆఫర్‌ను స్వాగతిస్తున్న వారిపై అమిత్‌షా మండిపడ్డారు. వామపక్ష తీవ్రవాదంపై చేపట్టిన 'ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్'ను ఆపేయాలని ఇటీవల వామపక్షాలు ముఖ్యంగా సీపీఐ, సీపీఐ-ఎంలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయని చెప్పారు. 'మావోయిస్టులను ఎందుకు రక్షించాలని వాళ్లు అనుకుంటున్నారు? గిరిజన బాధితుల మానవ హక్కుల పరిరక్షణకు ఎన్జీవోలు ఎందుకు ముందుకు రావడం లేదు? ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖ రాసిన వాళ్లు ఎప్పుడైనా గిరిజన బాధితులపై ఒక ఆర్టికల్ రాయడం కానీ, ప్రభుత్వానికి సలహా కానీ ఇచ్చారా?' అని ప్రశ్నించారు.
2026 మార్చి 31 కల్లా..
వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా దేశాన్ని నక్సల్స్ బెడద నుంచి విముక్తి కల్పిస్తామని అమిత్‌షా పునరుద్ఘాటించారు. అయితే నక్సలిజంతో ప్రమేయమున్న వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చేంత వరకూ నక్సలిజంపై పోరాటం కొనసాగుతుందని చెప్పారు. నక్సలైట్లను అరెస్టు చేసేందుకు, లొంగిపోయేలా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తాము తీసుకున్నామని, ఒక అవకాశం కూడా ఇచ్చామని చెప్పారు. లొంగిపోతే పునరావసం కల్పించే పాలసీని కూడా తెచ్చామని చెప్పారు. అయినప్పటికీ ఆయుధాలు తీసుకుని అమాయక ప్రజల ప్రాణాలు తీస్తామంటే భద్రతా దళాలకు వారిని మట్టుబెట్టడం మినహా మరో మార్గం ఉండదన్నారు. బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే సమాధానం ఇస్తామని స్పష్టంచేశారు.
ఇవి కూడా చదవండి..
కరూర్ విషాదంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టుకు టీవీకే
కరూర్ విషాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. ఎంతంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి