Share News

Amit Shah: ఇంగ్లిష్‌ మాట్లాడేవారు సిగ్గుపడే రోజొస్తుంది

ABN , Publish Date - Jun 20 , 2025 | 05:15 AM

ఆంగ్ల భాష మాట్లాడేవారు సిగ్గుపడే రోజు వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. ఆ భాష వలసవాద బానిసత్వానికి చిహ్నమని తెలిపారు...

Amit Shah: ఇంగ్లిష్‌ మాట్లాడేవారు సిగ్గుపడే రోజొస్తుంది

  • స్థానిక భాషలతోనే భారతీయ సంస్కృతికి గుర్తింపు

  • ఆంగ్లం.. వలసవాద బానిసత్వానికి చిహ్నం

  • కొన్నాళ్లకు ప్రజలే తిరస్కరిస్తారు: అమిత్‌షా

న్యూఢిల్లీ, జూన్‌ 19: ఆంగ్ల భాష మాట్లాడేవారు సిగ్గుపడే రోజు వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. ఆ భాష వలసవాద బానిసత్వానికి చిహ్నమని తెలిపారు. కొన్నాళ్లకు ప్రజలే దానిని తిరస్కరిస్తారని కూడా వ్యాఖ్యానించారు. స్థానిక భాషలతోనే భారతీయ సంస్కృతి, వారసత్వాలకు గుర్తింపు అని.. విదేశీ భాషల స్థానాన్ని అవి ఆక్రమించాలని ఆకాంక్షించారు. హిందీని బలవంతంగా రుద్దడాన్ని, నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో త్రిభాషా సూత్రాన్ని (స్థానిక భాష, ఆంగ్లం, హిందీ) తమిళనాడులోని డీఎంకే సహా కొన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.


ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. గురువారం ఢిల్లీలో ఐఏఎస్‌ అధికారి అశుతోష్‌ అగ్నిహోత్రి రచించిన ‘మై బూంద్‌ హూ.. ఖుద్‌ సాగర్‌ హూ(నేను నీటి బిందువునే కాదు.. సముద్రాన్ని కూడా)’ అనే పుస్తకాన్ని అమిత్‌షా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక భారతీయ భాషలు దేశం గుర్తింపునకు కీలకమన్నారు. ఆంగ్లం మాట్లాడేవారు త్వరలోనే సిగ్గుపడే పరిస్థితి వస్తుందని.. అలాంటి సమాజం రావడం ఎంతో దూరంలో లేదని తెలిపారు. ఆంగ్లం వలసవాద బానిసత్వానికి చిహ్నమని ప్రపంచవ్యాప్తంగా అందరూ భావించి దానిని తిరస్కరిస్తారని జోస్యం చెప్పారు. మన దేశాన్ని, సంస్కృతిని, చరిత్రను, మతాన్ని అర్థం చేసుకోవడానికి ఏ విదేశీ భాషా చాలదన్నారు. అసమగ్ర విదేశీ భాషలతో ‘సంపూర్ణ భారతం’ అనే భావనను ఊహించలేమని ఆయన చెప్పారు.

Updated Date - Jun 20 , 2025 | 08:57 AM