Akshay Kumar: సైబర్ నేరాలు.. తన కూతురి షాకింగ్ అనుభవాన్ని పంచుకున్న అక్షయ్ కుమార్
ABN , Publish Date - Oct 03 , 2025 | 05:37 PM
సైబర్ నేరాల గురించి చిన్నారుల్లో అవగాహన పెంచాలని బాలీవుడ్ నటుడు సూచించారు. స్కూల్ విద్యార్థులకు ఈ అంశంపై ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని అన్నారు. తన కూతురు ఎదుర్కొన్న దారుణ అనుభవాన్ని కూడా ఈ సందర్భంగా పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నేటి తరంలో చిన్నారులు సైబర్ ముప్పును ఎదుర్కొంటున్నారని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమారు ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు స్కూళ్లల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సైబర్ భద్రతపై అవగాహన కోసం ముంబైలోని పోలీసు డిపార్ట్‌మెంట్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. సైబర్ ఎవేర్‌నెస్ మంత్ పేరిట ఈ కార్యక్రమాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ మాట్లాడారు (Akshay Kumar daughter online game).
‘కొన్ని నెలల క్రితం నా కూతురికి ఎదురైన అనుభవం గురించి చెప్పదలుచుకున్నాను. ఆమెకు 13 ఏళ్లు. ఇటీవల ఓ రోజు ఆమె ఆన్‌లైన్‌లో వీడియో గేమ్ ఆడుతుండగా ఇది జరిగింది. ఆన్‌లైన్‌లో ఎవరితోనైనా ఆడే విధంగా కొన్ని గేమ్స్ ప్రస్తుతం ఉన్నాయి. ముక్కూమొహం తెలియని వ్యక్తులతో కూడా ఆడే అవకాశం ఉంది. ఇలా ఆమె గేమ్‌లో లీనమై ఉండగా ఓ మెసేజ్ వచ్చింది. నువ్వు అమ్మాయా లేక అబ్బాయా అని అవతలి వ్యక్తి ప్రశ్నించారు. తాను అమ్మాయినని నా కూతురు చెప్పింది. వెంటనే అవతలి వ్యక్తి ఆమె నగ్న ఫొటోలు పంపించమని అడిగాడు’
’దీంతో, నా కూతురు భయపడిపోయి వెంటనే వచ్చి వాళ్లమ్మకు విషయం చెప్పింది. చిన్న పిల్లలు ఇలాగే సైబర్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇవన్నీ సైబర్ నేరాలే. కాబట్టి, ఈ విషయంపై చిన్నారుల్లో అవగాహన పెంచేందుకు ప్రతి వారం ఏడు నుంచి తరగతుల విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నాను. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పీరియడ్‌ను కేటాయించాలి’ అని అన్నారు (child safety online India).
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, రాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లా, ఐపీఎస్ అధికారి ఇక్బాల్ సింగ్ ఛహల్, బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
లంచం కోసం కస్టమ్స్ అధికారుల వేధిస్తున్నారన్న లాజిస్టిక్స్ సంస్థ.. కార్యకలాపాల నిలిపివేత
కుదిరిన అంగీకారం.. భారత్, చైనా మధ్య ఈ నెలాఖరు నుంచీ..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి