Share News

Air India: ఢిల్లీ నుంచి పారిస్ వెళ్లాల్సిన విమాన సర్వీసు రద్దు

ABN , Publish Date - Jun 17 , 2025 | 04:25 PM

ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, సాధ్యమైనంత త్వరలో ప్రయాణికులను వారి గమ్యాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఏఐ ప్రతినిధి చెప్పారు.

Air India: ఢిల్లీ నుంచి పారిస్ వెళ్లాల్సిన విమాన సర్వీసు రద్దు
Air India Flight

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా (Air India) విమానాల్లో తలెత్తుతున్న సాంకేతిక లోపాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఢిల్లీ నుంచి పారిస్‌కు మంగళవారంనాడు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సర్వీసును రద్దు చేశారు. విమానం వెళ్లడానికి ముందు చేపట్టిన తనిఖీల్లో సాంకేతిక లోపం కనిపించడంతో ఫ్లైట్ సర్వీసును రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. ఏఐ-143 విమానంలో ప్రీ-ఫ్లైట్ చెకింగ్‌లో కనిపించిన సాంకేతిక లోపాన్ని సరిచేసే పనిలో సాంకేతిక నిపుణులు ఉన్నట్టు ఏఐ ప్రతినిధి తెలిపారు.


సమయాభావంతో పాటు పారిస్ చార్సెల్ డి గల్లె (CDG) అంతర్జాతీయ విమానశ్రయం వద్ద అర్ధరాత్రి వేళల్లో ఆంక్షలు ఉన్నందును విమాన సర్వీసును రద్దు చేయడం మినహా మరో మార్గం లేకపోయిందని అధికారులు చెప్పారు. దీంతో జూన్ 18న పారిస్ నుంచి ఢిల్లీకి రావాల్సిన రిటర్న్ ఫ్లయిట్ AI142 కూడా రద్దయిందని తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, సాధ్యమైనంత త్వరలో ప్రయాణికులను వారి గమ్యాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఏఐ ప్రతినిధి చెప్పారు. హోటల్ సదుపాయంతో పాటు టిక్కెట్ అమౌంట్ తిరిగి చెల్లించేందుకు, కోరుకుంటే ప్రయాణం రీషెడ్యూల్‌కు కూడా వెసులుబాటు కల్పిస్తున్నట్టు వివరించారు.


కాగా, దీనికిముందు అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన ఏఐ-159 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లోనూ సాంకేతిక లోపాలు తలెత్తాయి. షెడ్యూల్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 1.10 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, దీనికి ముందు తనిఖీలు చేపట్టారు. సాంకేతిక లోపం తలెత్తడంతో వెంటనే సర్వీసును నిలిపివేశారు.


ఇవి కూడా చదవండి..

ఇరాన్ నుంచి అర్మేనియా చేరుకున్న 100 మంది భారతీయ విద్యార్థులు

అర్ధాంతరంగా అమెరికాకు ట్రంప్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 17 , 2025 | 04:28 PM