Bihar Assembly Elections: 100 సీట్లలో ఏఐఎంఐఎం పోటీ
ABN , Publish Date - Oct 11 , 2025 | 04:57 PM
పొత్తుల కోసం లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్‌కు తాము లేఖ రాశామని, అయితే ఎలాంటి స్పందన రాలేదని అఖ్తరుల్ తెలిపారు. దీంతో తమ పార్టీ ఉనికికి మరింత విస్తరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) పొత్తుకు 'ఇండియా' కూటమి ఎటూతేల్చిచెప్పకపోవడంతో అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఏఐఎంఎంఐ (AIMIM) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో బిహార్‌లో 20 సీట్లలోపే పోటీ చేస్తూ వచ్చిన ఆ పార్టీ ఇప్పుడు 100 సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. బిజేపీ సారథ్యంలోని ఎన్డీయే, కాంగ్రెస్-ఆర్జేడీ కూటములకు ప్రత్యామ్నాయంగా తృతీయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు తాము సిద్ధమవుతున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమామ్ తెలిపారు.
పొత్తుల కోసం లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ అధ్యక్షుడు), తేజస్వి యాదవ్‌కు తాము లేఖ రాశామని, అయితే ఎలాంటి స్పందన రాలేదని అఖ్తరుల్ తెలిపారు. దీంతో తమ పార్టీ ఉనికికి మరింత విస్తరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, భావసారూప్యత కలిగిన పార్టీలతో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని, మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు.
ఎఐఎంఐఎం 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయవతి బీఎస్‌పీ, ప్రస్తుతం రద్దయిన లోక్ సమతా పార్టీ (ఉపేంద్ర కుష్వాహ)తో పొత్తు పెట్టుకుంది. ఎఐఎంఐఎం 5 సీట్లు గెలుచుకుంది. పలుచోట్ల ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష కూటమి విజయావకాశాలను దెబ్బతీసింది. అయితే 2022లో నలుగురు ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు.
బిహార్‌లోని పరీవాహక ప్రాంతంలో 17 శాతం ముస్లిం జనాభా ఉండటంతో ఆ ప్రాంతంపై ఏఐఎంఐఎం కన్నేసిందని, ఇందుకోసమే ఒవైసీ గత నెలలో సీమాంచల్ ప్రాంతంలో నాలుగు రోజుల పాటు పర్యాటించారని విశ్లేషకులు చెబుతున్నారు. కిషన్ గంజ్, అరియాలో, కతిహార్, పూర్ణియాలో గణనీయంగా ముస్లిం జనాభా ఉండటంతో ఒవైసీ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కాగా, ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ అవకాశాలకు ఏఐఎంఐఎం గండికొడుతోందని, బీజేపీకి బీ టీమ్‌గా వ్యవహరిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఈసారి 100 సీట్లలో పోటీకి సన్నాహాలు చేయనుండటం ప్రాధాన్యత సంతరించుంటోంది. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీకి రెండు విడతలుగా నవంబర్ 6,11 తేదీల్లో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
రైతుల శ్రేయస్సు కోసం లెక్కలేనన్ని సంస్కరణలు తెచ్చాం.. ప్రధాని మోదీ
రైతుల కోసం మోదీ ప్రభుత్వం కొత్త పథకం.. నేటి నుంచి షురూ!
Read Latest Telangana News and National News