Share News

Ahmedabad: ఐడీ చూపించమన్న మహిళ.. చెంప చెల్లుమనిపించిన ట్రాఫిక్ పోలీస్..వీడియో వైరల్

ABN , Publish Date - Dec 21 , 2025 | 07:22 AM

అహ్మదాబా‌లోని ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మహిళపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. పోలీస్ ని ఆ మహిళ ఐడీ కార్డు చూపించమని కోరగా కోపంతో రెచ్చిపోయిన ట్రాఫిక్ పోలీస్ ఆమెను దుర్భాషలాడుతూ.. చెంప చెల్లుమనిపించాడు.

Ahmedabad: ఐడీ చూపించమన్న మహిళ.. చెంప చెల్లుమనిపించిన ట్రాఫిక్ పోలీస్..వీడియో వైరల్
Traffic Police Assault Woman

గుజరాత్,అహ్మదాబాద్‌లో ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అంజలి క్రాస్‌రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో స్కూటీపై ఓ మహిళ వెళ్తుంది. ఆమెను ఆపిన పోలీస్ కానిస్టేబుల్ డ్రైవింగ్ లైసెన్స్ చూపించమన్నాడు. ఆమె లైసెన్స్ తన పర్స్‌లో నుంచి తీయడానికి ఆలస్యం అయ్యింది. కానిస్టేబుల్ ఆమెను తొందరపెట్టడంతో మీ ఐడీ కార్డు చూపించమని కోరింది. అప్పటికే తన లైసెస్స్ బయటకు తీయగా అది కాస్త చేతి నుంచి జారి కిందపడింది. దీంతో ఆగ్రహానికి గురైన కానిస్టేబుల్ ఆ మహిళ చెంపపై కొట్టాడు. అంతేకాదు బండబూతులు తిట్టాడు. అక్కడే ఉన్న మరో ట్రాఫిక్ కానిస్టేబుల్ అతన్ని పక్కకు లాగినప్పటికీ లాఠి తీసుకొని ఆమెపై దాడికి యత్నించాడు.


కానిస్టేబుల్ దాడిలో మహిళకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ ఘటన అనంతరం మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు యత్నించగా, ఆమె ఫిర్యాదు స్వీకరించలేదని ఆరోపణలు వస్తున్నాయి. రివర్స్‌లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినట్లు ఆమెపైనే ఎఫ్ఐఆర్ నమోదైనట్లు సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై ప్రజలు, నాయకులు సీరియస్ అవుతున్నారు.


ఇదిలా ఉంటే ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. సదరు మహిళ రాంగ్ సైడ్ రావడం వల్ల తనిఖీ చేశారని, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నెం. 568/2025 గా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. మరోవైపు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ట్రాఫిక్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) ఆ ట్రాఫిక్ సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. పూర్తి దర్యాప్తు తర్వాత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.


ఇవీ చదవండి:

ఉపాధి హామీ పథకంపై బుల్డోజర్.. సోనియాగాంధీ ఫైర్

మేమిద్దరం వెళ్తాం.. ఢిల్లీ పర్యటనపై డీకే

Updated Date - Dec 21 , 2025 | 07:48 AM