Kejriwal: కేజ్రీ.. హ్యాట్రిక్ కలలు కల్లలు
ABN , Publish Date - Feb 09 , 2025 | 04:12 AM
ఇప్పుడు... మాత్రం ‘ఆప్’నే ఢిల్లీ ఓటర్లు గెలుపు బరి నుంచి ఊడ్చేశారు. ఢిల్లీలో ముచ్చటగా మూడోసారి కూడా అధికారం దక్కించుకుంటామని, ఎన్ని అవరోధాలు వచ్చినా గెలుపు గుర్రం తమదేనని లెక్కలు కట్టిన సామాన్యుడి పార్టీ.. ఆమ్ ఆద్మీ ఘోర పరాజయం చవిచూసింది.
ఆమ్ ఆద్మీ అపజయానికి అనేక కారణాలు
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం
అవినీతిపై యుద్ధం ప్రకటించి అదే అవినీతి ఆరోపణల్లో చిక్కి...మద్యం కుంభకోణంతో విలవిల..
ఢిల్లీ కాలుష్యం.. ట్రాఫిక్ కష్టాలు.. కేజ్రీ పాలనపై సామాన్యుడి కన్నెర్ర.. ఫలించని యమునా నది సెంటిమెంట్
(న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి)
సామాన్యుడి పేరుతో పార్టీ పెట్టారు. అవినీతిని ఊడ్చేస్తాం అంటూ ‘చీపురు’ గుర్తు ఎంచుకున్నారు. అన్నట్లుగానే... వరుసగా రెండుసార్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ‘స్వీప్’ చేశారు. ఇప్పుడు... మాత్రం ‘ఆప్’నే ఢిల్లీ ఓటర్లు గెలుపు బరి నుంచి ఊడ్చేశారు. ఢిల్లీలో ముచ్చటగా మూడోసారి కూడా అధికారం దక్కించుకుంటామని, ఎన్ని అవరోధాలు వచ్చినా గెలుపు గుర్రం తమదేనని లెక్కలు కట్టిన సామాన్యుడి పార్టీ.. ఆమ్ ఆద్మీ ఘోర పరాజయం చవిచూసింది. గత ప్రాభవాన్ని కుప్పకూల్చుకుంది. ఈ ఓటమికి కారణాలేంటి? ఎందుకిలా జరిగింది? పార్టీ అధినేత కేజ్రీవాల్ అంచనాలు ఎందుకు తప్పాయి? ఢిల్లీ ప్రజల ఆలోచనా విధానం ఏంటి?
అవినీతిపై పోరాడి...
ఆమ్ ఆద్మీ పార్టీ.. కేవలం రాజకీయాల కోసమే పుట్టిన పార్టీ కాదు. అవినీతికి వ్యతిరేకంగా సామాన్యుల పక్షాన నిలబడి న్యాయం చేసేందుకు జన్మించిన పార్టీ. కానీ, అలాంటి పార్టీ.. రాను రాను అదే అవినీతి ఆరోపణల పరిష్వంగంలో చిక్కి శల్యమవుతూ వచ్చింది. ఈసారి అభ్యర్థుల ఎంపికలో తెలిసి తెలిసి తప్పులు చేసింది. అవినీతి ఆరోపణలు, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారికి భారీ సంఖ్యలో టికెట్లు ఇచ్చింది. దీనిని ప్రజలు జీర్ణించుకోలేక పోయారు. మొత్తం 70 స్థానాల్లో 44 మంది ఆప్ అభ్యర్థులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నవారే కావడం గమనార్హం. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి బీజేపీ శిబిరానికి ఈ పరిణామం వజ్రాయుధంగా మారింది.
‘కిక్కు’లో చిత్తు...
ఎన్నికల సమయంలోనే ఆప్ ప్రభుత్వ అవినీతికి సంబంధించి కాగ్ సంచలన నివేదిక విడుదల చేసింది. మద్యం విధానం ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.2,026 కోట్ల నష్టం వాటిల్లిందని గణాంకాలతో సహా వెల్లడించింది. ఇది కూడా బీజేపీ కలిసి వచ్చి.. ఆప్ అవినీతిపై మరింత ప్రచారం చేసింది. ప్రధాని మోదీ సహా అగ్రనేతలు కాగ్ నివేదికను తమ ప్రచారంలో భాగం చేసుకున్నారు.
పూర్వాంచల్ ఫట్!
ఆప్ విజయంలో పూర్వాంచల్ ఓటర్ల పాత్ర అత్యంత కీలకం. అయితే.. ఈ దఫా ఇక్కడి మధ్యతరగతిని బీజేపీ గణనీయంగా ఆకర్షించింది. 2015, 2020 ఎన్నికల్లో ఆప్‌కు బలమైన మద్దతుగా ఉన్న ఇక్కడి ఓటర్లు.. తాజా ఎన్నికల్లో బీజేపీకి మొగ్గు చూపారు. నగర ఓటర్లలో 30 శాతం పూర్వాంచల్‌లోనే ఉన్నారు. వీరిని ఆకట్టుకునేందుకు జేడీయూ, ఎల్‌జీపీలకు బీజేపీ టికెట్‌లు ఇచ్చింది. ఇది కమల నాథులకు కలిసి వ చ్చింది. ఈ విషయాన్ని గ్రహించిన కేజ్రీవాల్ యమునా నదిలో విషం కలిపారంటూ.. ప్రచారం చేయడం ద్వారా.. పూర్వాంచల్‌లో పట్టు నిలుపుకొనే ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.

మధ్యతరగతి మారింది ఇందుకేనా?
కేజ్రీవాల్ పార్టీకి వెన్నెముకగా ఉన్న మధ్యతరగతి ప్రజలు దూ రం కావడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు సహా ఢిల్లీలో ట్రాఫిక్ కష్టాలు వారిని వేధించాయి.
ఢిల్లీ నగర పౌరులు వాయు కాలుష్యంలో చిక్కి ఊపిరాడక విలవిలలాడుతున్నా... కేజ్రీ సర్కారు బలమైన చర్యలు తీసుకోలేకపోయింది. ట్రాఫిక్ నియంత్రణ, వాయు కాలుష్యం తగ్గించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
మధ్యతరగతి ప్రజల కష్టాలు తీరుస్తామంటూ.. 2023లో మిడిల్ క్లాస్ మేనిఫెస్టోను తీసుకువచ్చినా.. దీనిని అమలు చేయడంలో ఆప్ విఫలమైంది.
ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ ఆరోపణలపై 2024 మార్చిలో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. భారత్‌లో ఒక సిటింగ్ సీఎంను అరెస్టు చేయడం అదే మొదటిసారి. దాదాపు ఆరు నెలల నిర్బంధం అనంతరం 2024 సెప్టెంబరులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే తన ఇమేజ్‌ను కాపాడుకోవడానికి ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ వివాదం ఆయన చిత్తశుద్ధిపై ప్రజల్లో సందేహాలను లేవనెత్తింది.
ఇవి కూడా చదవండి
Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..
Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..
Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ
For More National News and Telugu News..