8th Pay Commission: ఎట్టెట్టా.. డీఏ పెంపు వారికి వర్తించదా? అసలు నిజం ఇదే..!
ABN , Publish Date - Dec 16 , 2025 | 06:42 PM
8వ వేతన సంఘం సిఫారసుల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో కొందరు కేటుగాళ్లు.. తప్పుడు ప్రచారానికి తెర లేపారు. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు డీఏ పెంపు సహా ఇతర ప్రయోజనాలు అందవని ప్రచారం చేస్తున్నారు. మరి ఈ ప్రచారంలో ఎంత నిజముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
8th Pay Commission: ఆర్థిక బిల్లు 2025(ఫైనాన్స్ యాక్ట్) ప్రకారం.. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు డీఏ పెంపు, వేతన సంఘం ప్రయోజనాలు అందవని, కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో నకిలీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత కాదని.. ఫైనాన్స్ యాక్ట్ 2025లో ఈ విషయం స్పష్టంగా పేర్కొనడం జరిగిందంటూ సదరు ఫేక్ న్యూస్‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారికి పే కమిషన్ ప్రయోజనాలు సహా డీఏ పెంపు వర్తించదని ప్రచారం చేస్తున్నారు.
అసలు నిజం ఏంటంటే..
ఈ తప్పుడు ప్రచారంపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. అసలు నిజం ఏంటో వెల్లడించింది. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత లభించే ప్రయోజనాలలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. సీసీఎస్(పెన్షన్) నిబంధనలు 2021లోని రూల్ 37 ప్రకారం.. ప్రభుత్వం చర్యలు తీసుకోబడిన ఉద్యోగి మాత్రమే పదవీ విరమణ ప్రయోజనాలను కోల్పోతారని స్పష్టం చేసింది.
సీసీఎస్(పెన్షన్) నిబంధనల్లోని నియమం 37 ఏం చెబుతోందంటే..
సీసీఎస్ నిబంధనల్లోని నియమం 37 ప్రకారం.. ‘ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తన దుష్ప్రవర్తన కారణంగా, తప్పుల కారణంగా ఉద్యోగం నుంచి తొలగించబడినట్లయితే.. అలాంటి వ్యక్తులు ప్రభుత్వం అందించే పదవీ విరమణ ప్రయోజనాలు సహా అనేక రకాల ప్రయోజనాలు కోల్పోతారు. డీఏ హైక్స్, పే కమిషన్ ప్రయోజనాలు, పదవీ విరమణకు సంబంధించి ప్రయోజనాలను పొందేందుకు ఏమాత్రం అర్హులు కారు.’
డీఏ విషయంలో క్లారిటీ..
ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన 3 శాతం డీఏతో ఇప్పటి వరకు ఉన్న 53 శాతం డీఏని కలిపితే 58 శాతనికి పెరుగుతుంది. 8వ వేతన సంఘం సిఫారసు చేసే బేసిక్ శాలరీలో విలీనం చేయాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. బేసిక్ శాలరీతో.. డీఏ(డియర్ నెస్ అలవెన్స్) విలీనానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇదే అంశంపై లోక్‌సభలో ప్రశ్నలు ఉత్పన్నమవగా.. ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు.
కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానంలో.. ‘ప్రస్తుత డియర్‌నెస్ అలవెన్స్‌ను బేసిక్ పే లో విలీనం చేసే ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో లేదు’ అని స్పష్టం చేశారు. ‘జీవన వ్యయాన్ని సర్దుబాటు చేయడానికి, ద్రవ్యోల్బణం కారణంగా వాస్తవ విలువలో క్షీణత నుంచి బేసిక్ పే, పెన్షన్‌ను రక్షించడానికి.. లేబర్ బ్యూరో, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆల్ ఇండియన్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్(AlCPl-lW) ఆధారంగ ప్రతి 6 నెలకు ఒకసారి DA, DR రేట్లు సవరించబడతాయి.’ అని కేంద్ర మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు.
కాగా, ఈ సంవత్సరం అక్టోబర్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, డీఆర్‌ను 3 శాతం ప్రకటించింది కేంద్రం. దీంతో డీఏ, డీఆర్ అలవెన్స్ 58 శాతానికి పెరిగింది. ఇది 1 జులై, 2025 నుంచి వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read:
ఢిల్లీలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం.. వాహనదారుడిపై ఎలా దాడి చేస్తున్నాడో చూడండి..
ఫుల్‌టైమ్ గర్ల్ ఫ్రెండ్ జాబ్.. ఎంత మంది అప్లై చేశారంటే..