Share News

Liquor Scam: లిక్కర్‌ స్కామ్‌.. 11 కోట్ల డంప్‌

ABN , Publish Date - Jul 31 , 2025 | 04:42 AM

దేశంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి. కానీ మొట్టమొదట సారిగా స్కామ్‌కు సంబంధించిన నగదు పెద్ద

Liquor Scam: లిక్కర్‌ స్కామ్‌.. 11 కోట్ల డంప్‌

  • ఇంత భారీ నగదు పట్టుబడటం దేశ చరిత్రలోనే తొలిసారి

  • హైదరాబాద్‌ సమీపంలోని ఫాంహౌ్‌సలో సిట్‌ స్వాధీనం

  • దుబాయ్‌ నుంచి వస్తుండగా శంషాబాద్‌లో వరుణ్‌ అరెస్ట్‌

  • అతడిచ్చిన సమాచారంతో సోదాలు.. ఫాంహౌస్‌ యజమాని లిక్కర్‌ కేసు నిందితుడు రాజ్‌ కసిరెడ్డి మిత్రుడే

  • బెజవాడకు నగదు, వరుణ్‌ తరలింపు

  • 12 అట్ట పెట్టెల్లో నోట్ల కట్టలు

  • ఫామ్‌హౌస్‌ యజమాని కసిరెడ్డి మిత్రుడే

  • విజయవాడకు నగదు, వరుణ్‌ తరలింపు

  • ఏసీబీ కోర్టుకు సిట్‌ సమాచారం

అమరావతి/రంగారెడ్డిజిల్లా ప్రతినిధి/శంషాబాద్‌ రూరల్‌, జూలై 30(ఆంధ్రజ్యోతి): దేశంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి. కానీ మొట్టమొదట సారిగా స్కామ్‌కు సంబంధించిన నగదు పెద్ద మొత్తంలో దర్యాప్తు అధికారులకు దొరికిపోయింది. కేసులో నిందితుడు ఇచ్చిన సమాచారంతో జరిపిన సోదాల్లో నోట్ల కట్టలు వెలుగు చూశాయి. జగన్‌ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో ముడుపులు వసూలు చేసి దాచిన రూ.11 కోట్ల నగదు డంప్‌ బయటపడింది. హైదరాబాద్‌ శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఏడాది కాలంగా దాచిన ఈ నగదును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లిక్కర్‌ కేసులో నిందితుడైన వరుణ్‌ పురుషోత్తం(ఏ-40) ఇచ్చిన సమాచారం ఆధారంగా బుధవారం వేకువజామున సిట్‌ అధికారులు అధికారులు సోదాలు చేశారు. రాజ్‌ కసిరెడ్డి సూచన మేరకు ఫామ్‌హౌ్‌సలో 12 బాక్సుల్లో జాగ్రత్తగా భద్రపరిచిన 11 కోట్ల రూపాయల నగదును సీజ్‌ చేశారు. లిక్కర్‌ స్కామ్‌లో కసిరెడ్డి దాచి ఉంచిన ముడుపులేనని సిట్‌ ఆధారాలతో బయటపెట్టింది. నాడు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్‌పై 11 కేసులు నమోదు చేసిన సీబీఐ, ఆరు కేసులు పెట్టిన ఈడీ కూడా ఇన్ని కోట్ల రూపాయల నగదు సీజ్‌ చేయలేదు. దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి.

అరెస్ట్‌ చేసిన గంటల వ్యవధిలోనే...

మద్యం కుంభకోణంలో దాదాపు రూ.3,500 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు సిట్‌ ప్రాథమికంగా నిర్ధారించిన విషయం తెలిసిందే. మద్యం కుంభకోణం బయటకు రాగానే ఇందులో కీలకంగా ఉన్న కొందరిని పెద్దలు విదేశాలకు పంపించేశారు. వీరిలో కొందరికి దుబాయ్‌లో గోల్డ్‌ కార్డు కూడా ఇప్పించినట్లు తెలుస్తోంది. ఇలా విదేశాలకు పరారైన వారిలో ఏ-40 వరుణ్‌ పురుషోత్తంపై ఇప్పటికే లుకౌట్‌ నోటీసులు జారీ అయ్యాయి. అలాగే విజయవాడ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న నిందితులను బయటకు రప్పించే యత్నాలను అధికారులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా వరుణ్‌ పురుషోత్తం మంగళవారం రాత్రి దుబాయ్‌ నుంచి వస్తున్నట్లు తెలుసుకున్న అధికారులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అతడ్ని అరెస్ట్‌ చేశారు. వరుణ్‌ ఇచ్చిన సమాచారంతో బుధవారం తెల్లవారుజాము రెండు గంటల సమయంలో శంషాబాద్‌ మండలం కాచారంలోని ఫామ్‌హౌ్‌సలో దాడులు నిర్వహించారు. నగదును స్వాధీనం చేసుకుని విజయవాడకు తరలించారు. మరింత సమాచారం కోసం సిట్‌ అఽధికారులు వరుణ్‌ను విజయవాడ సిట్‌ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.


ఫైళ్లు, బియ్యం బస్తాల మాటున..

నగదు బయటపడ్డ ఫామ్‌ హౌస్‌ యజమాని కుటుంబానికీ, రాజ్‌ కసిరెడ్డి కుటుంబానికీ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ ఫామ్‌ హౌస్‌ వర్ధమాన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ యజమాని తీగల బాల్‌రెడ్డి కుటుంబానికి చెందినది. ఆయన భార్య పేరిటే ఈ ఫామ్‌ హౌస్‌ ఉంది. తీగల బాల్‌రెడ్డి, రాజ్‌ కసిరెడ్డి సతీమణి దివ్యా రెడ్డి... ఇద్దరూ ఆరేట్‌ ఆస్పత్రిలో భాగస్వాములు కావడం విశేషం. ఈ పరిచయంతోనే... లిక్కర్‌ స్కామ్‌ నగదు దాచేందుకు వీరి ఫామ్‌హౌ్‌సను వాడుకున్నట్లు తెలుస్తోంది. ఫామ్‌ హౌస్‌లోని స్టోర్‌ రూమ్‌లో ఫైళ్లు, బియ్యం బస్తాల మధ్య అట్టపెట్టెల్లో ఈ నగదును దాచి ఉంచారు. పక్కా సమాచారంతో వెళ్లిన సిట్‌ అధికారులు రూ.11 కోట్ల నగదు గుర్తించి జప్తు చేశారు. ఈ వివరాలను ఈడీకి సిట్‌ తెలియజేసింది.

కాఫీ షాపు నుంచి దుబాయి వరకు...

కేసు విచారణలో కీలకంగా ఉన్న వరుణ్‌ బయటపెడుతున్న విషయాలతో మద్యం కేసు మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు వరుణ్‌ ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. సికింద్రాబాద్‌కు చెందిన వరుణ్‌ ఇంజనీరింగ్‌ చదివాడు. తరువాత హైదరాబాద్‌లోని ఓ కాఫీ షాపులో నెలకు రూ.32 వేల వేతనంతో పనిచేసేవాడు. తర్వాత రాజ్‌ కసిరెడ్డి డెన్‌లోకి ప్రవేశించిన వరుణ్‌ మద్యం ముడుపుల వసూళ్లలో కీలకంగా మారాడు. లిక్కర్‌ గ్యాంగ్‌లో కీలక సూత్రధారి రాజ్‌ కసిరెడ్డి.. ఎంపీ మిథున్‌ రెడ్డితో కలిసి ఆయన బినామీగా నడిపించిన ఆదాన్‌ డిస్టిలరీ్‌సతో పాటు పుదుచ్చేరికి చెందిన లీలా డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత వరుణ్‌ను మొత్తం వ్యాపారానికి ఇన్‌చార్జిగా నియమించారు. ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి లీలా డిస్టిలరీ్‌సకు భారీగా మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారు. లీలా డిస్టిలరీస్‌ ద్వారా రూ.453.97 కోట్ల వరకు మద్యం వ్యాపారం చేశారు. అందుకు ప్రతిఫలంగా 16 ఖాతాల్లోకి 52.78 కోట్ల వరకూ ముడుపులు జమ చేశారు. అందులో 11 కోట్ల సొమ్ము అందుకున్న పొట్లూరి అంజిరెడ్డి, పియూష్‌ గడోడియా అనే వ్యక్తులు నోట్ల కట్టలు అట్ట పెట్లెల్లో పెట్టి రాజ్‌ కసిరెడ్డికి అందజేశారు. అప్పటికే నమ్మకస్తుడిగా ఉన్న వరుణ్‌ ద్వారా తన ఎదురు విల్లాలో ఉండే తీగల విజయేందర్‌రెడ్డి, ఉపేందర్‌ రెడ్డికి చెందిన వర్ధమాన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో భద్ర పరిచారు. తర్వాత సులోచన వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకెళ్లారు. ఎవరికీ అనుమానం రాకుండా ఏ-4 సైజ్‌ పేపర్లంటూ లోపల దాచారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక డబ్బులు భద్రంగా దాచేసిన రాజ్‌ కసిరెడ్డి.. వరుణ్‌ పురుషోత్తంను దుబాయ్‌కి పంపించేశాడు. వీటికి సంబంధించిన ఆధారాలను సిట్‌ సంపాదించింది. కాగా, మద్యం కుంభకోణం సొమ్ము రూ. 11 కోట్లను కోర్టులో భద్ర పరచాలంటో విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్‌ అధికారులు బుధవారం మెమో దాఖలు చేశారు. మరోవైపు.. ఈ నగదుతో తనకు సంబంధంలేదంటూ రాజ్‌ కసిరెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


చాణక్యను నమ్మి మోసపోయా..

వరుణ్‌ పురుషోత్తం విచారణలో పలు విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. తాను ఉన్నత విద్యావంతుడినని, బూనేటి చాణక్యను నమ్మి అన్నివిధాలా జీవితాన్ని కోల్పోయానని కంటతడి పెట్టుకున్నట్లు సమాచారం. తనకు తెలియని లిక్కర్‌ బిజినె్‌సలో దింపి ప్రభుత్వం మారగానే దుబాయ్‌కు తీసుకెళ్లాడని, సీఐడీ కేసు నమోదు చేసినప్పటి(2024 సెప్టెంబరు) నుంచి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని వాపోయినట్లు తెలిసింది. తీగల సోదరులు కూడా చాణక్యతో తరచూ సమావేశం అయ్యేవారని, ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత దుబాయ్‌ వెళ్లేందుకు తమకు సహకరించారని వెల్లడించినట్లు సమాచారం. తమతో పాటు దుబాయ్‌ వచ్చిన బూనేటి చాణక్య సిట్‌ పిలుపుతో తిరిగొచ్చే సమయంలో.. ‘ఇది నిలబడే కేసు కాదు.. వెంటనే బెయిల్‌ తీసుకుని తిరిగొస్తా.. మీ పేర్లు చేర్చినా, 90 రోజులు దాటినా ముందస్తు బెయిల్‌ వచ్చేస్తుంది.. అని ఇక్కడికి వచ్చాడు. అరెస్టై విజయవాడ జైల్లో ఖైదీలకు వంట చేస్తున్నాడు. దీంతో మాకు భయం పట్టుకుంది. రెడ్‌ కార్నర్‌ నోటీసు అనగానే అందరూ దుబాయ్‌ నుంచి వెనక్కి వద్దామని అనుకున్నాం. మిగతా వాళ్లు కూడా వచ్చేస్తారు’ అని సిట్‌ అధికారులకు వివరించినట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్

ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..

For More International News And Telugu News

Updated Date - Jul 31 , 2025 | 04:42 AM