Fitness Tips: ముచ్చటగా ఈ 3 నియమాలు పాటిస్తే.. ఫిట్‌నెస్ మీ సొంతమైనట్లే..
ABN , Publish Date - Oct 12 , 2025 | 12:03 PM
3x3 రూల్’ పాటించడం అంత కష్టమేమి కాదు. చాలా సింపుల్. ఇందుకోసం మధ్యాహ్నం లోపు మూడు టాస్క్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి... 3 వేల అడుగులు నడవాలి. రెండోది... రోజు మొత్తం తాగే నీటిలో మూడింట ఒక వంతు పూర్తి చేయాలి. మూడోది... 30 గ్రాముల ప్రొటీన్ తీసుకోవాలి.
జిమ్‌కు వెళ్లాల్సిన పనిలేదు... వెయిట్‌లిఫ్టింగ్ వంటి కఠిన వ్యాయామాలు చేయనక్కర్లేదు... ఫిట్‌నెస్ కోసం గంటల తరబడి చెమటలు కక్కాల్సిన పనిలేదు. ఎక్కడున్నా సరే... కేవలం మూడే మూడు నియమాలు చక్కగా పాటిస్తే చాలు. అదే నయా ఫిట్‌నెస్ ట్రెండ్... ‘3ణ3 రూల్’. ఇంతకీ ఆ రూల్స్ ఏమిటంటే...
మూడే టాస్క్‌లు...
‘3x3 రూల్’ పాటించడం అంత కష్టమేమి కాదు. చాలా సింపుల్. ఇందుకోసం మధ్యాహ్నం లోపు మూడు టాస్క్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి... 3 వేల అడుగులు నడవాలి. రెండోది... రోజు మొత్తం తాగే నీటిలో మూడింట ఒక వంతు పూర్తి చేయాలి. మూడోది... 30 గ్రాముల ప్రొటీన్ తీసుకోవాలి.

ఉదయమే ఉత్తమం
ఈ టాస్కులను పొద్దున్నే పూర్తి చేయడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ మోతాదులను నియంత్రించొచ్చు. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. క్యాలరీలు బర్న్ అవ్వడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. ఉదయపు నడక వల్ల చెమట ద్వారా రక్తంలోని మలినాలు బయటకు పోతాయి. శరీరం ఒకవిధంగా డిటాక్స్ అవుతుంది. ఈ చర్యల వల్ల మానసిక కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. శారీరక సామర్థ్యం పుంజుకుంటుంది. అన్నింటికన్నా మించి మానసిక ఉల్లాసం లభిస్తుంది.
3 వేల అడుగులు...
ఉదయపు నడక (మార్నింగ్ వాక్) శరీరాన్ని మేల్కొలిపి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. రోజువారి లక్ష్యం 10 వేల అడుగులు కాబట్టి, మధ్యాహ్నానికే 3 వేల అడుగులు పూర్తి చేయడం వల్ల టార్గెట్ రీచ్ అవ్వడం సులభమవుతుంది. షాపునకు నడుచుకుంటూ వెళ్లడం, లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కడం, కాల్ మాట్లాడుతూ అటూ ఇటూ అడుగులు వేయడం వంటివి చేయాలి.
మూడింట ఒక వంతు..
నిద్ర లేవగానే 1-2 గ్లాసుల నీటితో దినచర్య ప్రారంభించాలి. ఇది చిన్న అలవాటే కానీ, ఆరోగ్యం విషయంలో గొప్పది. దీనివల్ల శరీరంలోని మలినాలు తొలిగిపోతాయి. శరీరంలో పేరుకున్న వ్యర్థాలు లేదా ఫ్రీరాడికల్స్ బయటకు పోయి శరీరం అంతర్గతంగా శుభ్రపడుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.

30 గ్రాముల ప్రొటీన్
ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. అంతేగాకుండా ఈ పోషకాలు గుండె ఆరోగ్యాన్ని, రోగ నిరోధకశక్తిని పెంపొందించేందుకు దోహదం చేస్తాయి. ప్రొటీన్లు శరీర కండర వ్యవస్థను దృఢంగా మారుస్తాయి. ఫలితంగా అలసట దూరమై, మెటబాలిజం మెరుగవుతుంది.
రోజువారీ షెడ్యూల్
- ఉదయం 6గం. నుంచి 9గం. వరకు.. నిద్రలేవగానే 1 నుంచి 2 గ్లాసుల నీరు తాగాలి.
- ఉ. 7 గంటలకి- తేలికపాటి నడక/ మెట్లు ఎక్కి దిగడం చేయాలి.
ఫ ఉ. 8 గంటలకి- అల్పాహారంలో భాగంగా ప్రొటీన్ ఫుడ్ (గుడ్లు, గ్రీక్ యోగర్ట్, పెరుగు, పనీర్, మొలకలు) తీసుకోవాలి.
- ఉ. 8.30గం. నుంచి 9 గం. మధ్య- కనీసం 15 నిమిషాలు నడక. (1500- 2000 అడుగులు పూర్తవుతాయి)
- ఉదయం 9గం. నుంచి మధ్యాహ్నం 1గం. వరకు.. తరచుగా నీరు తాగుతూ ఉండాలి
- మ. 12.30 గంటలకి- మధ్యాహ్న భోజనంలో ప్రొటీన్ ఫుడ్ (అన్నం+పప్పు, చికెన్, పెరుగు మొదలైనవి) తీసుకోవాలి.
- భోజనం తర్వాత 10 నిమిషాల చిన్న నడక. (దీంతో మిగిలిన 1000- 1500 అడుగులు పూర్తవుతాయి)
అలా మధ్యాహ్నం లోపు 3000 అడుగులు+ 1/3 వంతు నీరు+ 30 గ్రా. ప్రొటీన్ పూర్తవుతుంది.
గుర్తించుకోవాల్సినవి...
- మూత్రపిండాలు, గుండె, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముందుగా డాక్టర్‌ని సంప్రదించి
ఈ రూల్‌ని ఫాలో అవ్వాలి.
- ప్రారంభంలో తక్కువ దూరంతో నడక మొదలు పెట్టి, క్రమక్రమంగా... రోజురోజుకూ దూరం పెంచుకుంటూ పోవాలి.
- ఒకేసారి అధిక మోతాదులో ప్రొటీన్ తీసుకోవడం కష్టంగా అనిపిస్తే, కొద్దికొద్దిగా శరీరానికి అలవాటు చేయాలి.
- ఇది స్ట్రెంత్ ట్రైనింగ్, స్ట్రెచింగ్, బ్యాలెన్స్‌డ్ డైట్‌ని రీప్లేస్ చేయదు.
ఈ నయా నియమాల వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. పనిపై ఫోకస్ పెరుగుతుంది. 3 అలవాట్లు 3 సార్లు కాబట్టి ఈ రూల్‌ను గుర్తించుకోవడం ఎవరికైనా సులభమే.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరలకు రెక్కలు.. నేటి ధరలు చూస్తే..
విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు
Read Latest Telangana News and National News