Workplace Mistakes: ఆఫీసులో ఉద్యోగులు ఎన్నడూ చేయకూడని తప్పులు!
ABN , Publish Date - Apr 17 , 2025 | 06:43 PM
ఆఫీసుల్లో ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని కొన్ని పొరపాట్లు ఉన్నాయి. కెరీర్‌కే ఎసరొచ్చే ప్రమాదం ఉన్న ఈ మిస్టేక్స్ ఏంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో ఉద్యోగ వ్యాపారాల్లో విజయం సాధించాలంటే.. కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. అయితే, కొందరు ఉద్యోగులు పని ప్రదేశాల్లో తెలియక చేసే తప్పులు వారి కెరీర్‌కే ఎసరు తెస్తుంటాయి. మరి ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడని పొరపాట్లు ఏమిటో ఈ కథనంలో సవివరంగా చూద్దాం.
ఆఫీసులో సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొల్పడం కీలకమే. అయితే, వారిని గుడ్డిగా నమ్మకూడదనేది ఆర్గనైజేషనల్ సైకాలజిస్టులు చేసే సూచన. రెండింటి మధ్య సమతౌల్యం పాటించేందుకు నేర్పుగా వ్యవహరించాలి.
వ్యక్తిగత విషయాలను కోలీగ్స్‌తో అనవసరంగా పంచుకోవద్దు. వ్యక్తిగత, వృత్తిగత జీవితాల మధ్య స్పష్టమైన విభజన రేఖ ఏర్పాటు చేసుకోవాలి. దీంతో, పనికి సంబంధించిన వ్యవహారాలపై దృష్టిపెట్టగలగుతాము. అనవసరంగా ఇతరులు మన జీవితాల్లోకి చొచ్చుకొచ్చి ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉండదు.
ఆఫీసులో గాసిప్‌లు వ్యాప్తి చేయడం కూడా కోలీగ్స్‌తో బంధాలను బలహీనం చేస్తుంది. సహోద్యోగుల మధ్య అపనమ్మకం పెరుగుతుంది. కలిసి పనిచేసేందుకు విముఖత ఏర్పడుతుంది. అంతిమంగా ఇది టీమ్ ఉత్పాదకతను దెబ్బతీస్తుంది.
కార్యాలయాల్లో ఎవరి చర్యలకు వారే బాధ్యత తీసుకోవాలి. ఇతరులపై నెపం నెట్టకూడదు. దీంతో, టీమ్ సభ్యుల మధ్య పరస్పర గౌరవం, బాధ్యతాయుత వైఖరి పెరుగుతాయి.
పనిపై ఇష్టత అనురక్తి ఉండటం సహజమే. కానీ అదనపు పని నెత్తిన వేసుకోవడం ఎంత మాత్రం సబబు కాదు. దీంతో, పనిపై క్రమంగా నిరాసక్తత పెరిగి పనిలో నాణ్యత తగ్గిపోతుంది.
పని ప్రదేశాల్లో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులకు అనుగూణంగా ఉద్యోగులు తమని తాము మలుచుకోవాలి. మార్పు స్వాగతించలేని పక్షంలో వెనకబడి పోవాల్సి వస్తుంది. టీమ్‌తో పాటు మర్పు చెందితే అంతిమంగా జట్టు ఉత్పాదకత పెరుగుతుంది.
సహోద్యోగులతో పనిలో పోటి పడటం ఎంత మాత్రం తప్పు కాదు. అలాగని ప్రతి చిన్న విషయంలో నువ్వా నేనా అన్నట్టు ఉంటే చివరకు తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ అనారోగ్యకర పోటీతో కార్యాలయంలో అందరి మీదా ఒత్తిడి పెరుగుతుంది.
కార్యాలయాల్లో సానుకూల వాతావరణం ఏర్పడాలంటే సహోద్యోగులతో గొడవలకు దిగకపోవడమే మంచిది. ఈ అనవసర తగాదాలతో పనికి అంతరాయాలు ఏర్పడాయి. చివరకు లక్ష్యాలు చేరుకోలేక వెనకబడిపోవాల్సి వస్తుంది. ఎలాంటి అరమరికలు లేకుండా చర్చించుకుంటే అభిప్రాయభేదాలు తొలగిపోతాయి.
ఇవి కూడా చదవండి:
అమెరికాలో షాకింగ్.. మహిళపై జాత్యాహంకారపూరిత వ్యాఖ్యలు
వింత రేసు.. వీర్య కణాల మధ్య పరుగుపందెం.. భారీ స్థాయిలో ఏర్పాట్లు
జాబ్‌లో మజా లేదని యువతి రాజీనామా.. షాక్‌లో సంస్థ యజమాని
Read Latest and Lifestyle News