Share News

Jim Jill Bang: ‘జిమ్ జిల్ బాంగ్.. సరికొత్త స్నానాలు...

ABN , Publish Date - Dec 21 , 2025 | 09:55 AM

‘అబ్బబ్బా... ఆఫీస్‌లో పని తెమలడమే లేదు, బాగా స్ట్రెస్‌గా అనిపిస్తోంది...’ అని ఎవరైనా అంటే, ‘సెలవు పెట్టు, టూర్‌కి వెళ్లు, ట్రెక్కింగ్‌ చేయి...’ అనే సలహాలు సహజం. అదే కొరియాలో అయితే... ‘జిమ్‌జిల్‌బాంగ్‌’కి వెళుతున్నారు. అంటే... అదో సామూహిక స్నానాల వేదిక. వినోదభరిత కాలక్షేపంగా, మానసిక ఉల్లాసంగా కొరియన్లు భావించే ‘జిమ్‌జిల్‌బాంగ్‌’లో అనేక విశేషాలున్నాయి...

Jim Jill Bang: ‘జిమ్ జిల్ బాంగ్.. సరికొత్త స్నానాలు...

ఈకాలపు ఉరుకుల పరుగుల జీవనంలో అనేకరకాల ఒత్తిడులు సతాయిస్తున్నాయి. దాంతో తొందరగా అలసిపోతున్నారు. అలసటను మటుమాయం చేసేవి ఎప్పుడైనా స్నానాలే. అది షవర్‌ కావొచ్చు... సముద్రం కావొచ్చు... కొలను కావొచ్చు. కొన్నిసార్లు చన్నీటి స్నానాలు... ఇంకొన్నిసార్లు వేడినీటి స్నానాలు... ఆవిరి స్నానాలు... శరీరంతో పాటు, మనసునూ సేదతీరుస్తాయి. అందుకే ఫిన్లాండ్‌ ఆవిరి స్నానాల ‘సౌనా’లు ఇళ్లల్లోకి కూడా వచ్చేశాయి. జపాన్‌, టర్కీ వేడినీటి గుండాలు, బురద స్నానాల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. తాజాగా కొరియా ‘జిమ్‌జిల్‌బాంగ్‌’లు ఈ కోవలోకే వస్తాయి. అవి ప్రస్తుతం విశేషంగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఈమధ్య కొరియన్‌ సీరియల్స్‌, సినిమాల వల్ల ‘జిమ్‌జిల్‌బాంగ్‌’ స్నానాలపై అందరికీ ఆసక్తి పెరిగింది.


కుటుంబ విహారయాత్రలాగా...

‘జిమ్‌జి’ అంటే వేడి గది అని అర్థం. అయితే జిమ్‌జిల్‌బాంగ్‌లో వేడి, చల్ల నీటి స్నానాలు, ప్రత్యేక థీమ్‌తో ఆవిరి గదులు, రిలాక్సేషన్‌ కేంద్రాలు, స్పా ట్రీట్‌మెంట్లు, ఫుడ్‌, ఎంటర్‌టైన్‌ మెంట్‌ జోన్‌లు, సామూహిక నిద్రా కేంద్రాలు ఉంటాయి. కొరియన్ల సంస్కృతిలో ఈ స్నానాలు ఓ భాగం. జోసియాన్‌ పాలనా కాలం నుంచే ఈ సామూహిక స్నానాల గురించి ప్రస్తావన ఉంది. అందుకే ఫ్యామిలీ ఎక్స్‌కర్షన్లలా, డేట్‌ నైట్‌గా, స్నేహితులతో సమయం గడిపేందుకు, వృద్ధులకు విహారయాత్రలా ‘జిమ్‌జిల్‌బాంగ్‌’లను చూస్తున్నారు. ప్రశాంతత కోసం, పునరుత్తేజం పొందేందుకు, రకరకాల ఒత్తిడుల నుంచి రిలాక్స్‌ అయ్యేందుకు ఈ తరహా స్నానాలను ఎంచుకుంటారు.


book4.jpg

మనదగ్గర ‘స్పా’ల్లాగే కొరియా దేశాల్లో ‘జిమ్‌జిల్‌బాంగ్‌’లు ప్రత్యేకంగా ఉంటాయి. ఎంట్రీ టికెట్‌ తీసుకుని లోపలికి వెళ్లాలి. మహిళలు, పురుషులకు వేర్వేరుగా స్నానాల ప్రదేశాలు... అందులోనూ చల్లటి, వేడి నీళ్లలో రెండుసార్లు స్నానాలు చేయాలి. తప్పనిసరిగా అరగంట దీని కోసం కేటాయించాలి. ఆ తరవాత వాళ్లు ఇచ్చే దుస్తులు ధరించి ఉప్పు, బొగ్గు, పచ్చరాళ్లతో ఏర్పరచిన ‘సౌనా’ గదుల్లోకి వెళ్లాలి. ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ ఉత్పత్తులను వాడతారు. ఆ తరవాత మసాజ్‌లు, ష్రబ్‌, స్కిన్‌కేర్‌ ట్రీట్‌మెంట్లు అందించే స్పాలోకి వెళ్లాలి. ఈ రిలాక్సేషన్‌ ఏరియాలలో ఎంత సేపయినా గడపొచ్చు. కుటుంబసభ్యులు, స్నేహితులు ఒకేచోట హాయిగా కూర్చుని లేదా పడుకుని రిలాక్స్‌ అవుతుంటారు. చాలామంది రాత్రంతా అక్కడే గడపడానికి ఇష్టపడతారు. జ్యూస్‌లు, గుడ్లు లాంటివి ఇస్తారు. స్పాలాగే ఆయా సర్వీస్‌లను బట్టి ఛార్జీలు ఉంటాయి.


పునరుత్తేజం...

‘జిమ్‌జిల్‌బాంగ్‌’లలో గడపడం వల్ల శరీరం పూర్తిగా డిటాక్సిఫై అవుతుంది. రక్తప్రసరణ మెరుగవుతుంది. కండరాలు రిలాక్స్‌ అవుతాయి. ఇవన్నీ శారీరకంగా కలిగే లాభాలయితే... మానసికంగా ఒత్తిళ్లు, ఆందోళనలు దూరమవు తాయి. పునరుజ్జీవనం పొందిన అనుభూతి సొంతం అవుతుంది. ప్రతి పనినీ ఎంతో ఓర్పునేర్పులతో చేసే కొరియన్లు ‘జిమ్‌జిల్‌బాంగ్‌’లను అంతే శ్రద్ధగా ఆచరిస్తారు. సంపూర్ణ ఆరోగ్యంలో ఇదొక ముఖ్య మైన భాగంగా భావిస్తారు. ఇటీవల కొరియాకు వెళ్లే టూరిస్టులూ ఈ విభిన్నమైన వెల్‌నెస్‌ స్నానాల్లో మునిగితేలుతున్నారు. పునరుత్తేజం పొందుతున్నారు .


ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు రాజ్యాంగంపై గౌరవం లేదు

చిరిగిన జీన్స్‌.. స్లీవ్‌లెస్ పై నిషేధం

Read Latest Telangana News and National News

Updated Date - Dec 21 , 2025 | 10:31 AM