White House On Nobel Prize: ట్రంప్‌కు శాంతి బహుమతి దక్కకపోవడంపై స్పందించిన వైట్ హౌస్
ABN , Publish Date - Oct 10 , 2025 | 06:34 PM
నోబెల్ శాంతి బహుమతి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశ పడ్డారు. కానీ ఈ బహుమతికి వెనెజుల ప్రతిపక్ష నేతను ఎంపిక చేశారు. దీంతో ట్రంప్ ఆశలపై నార్వేజియన్ నోబెల్ కమిటీ నీళ్లు పోసినట్లు అయింది. దీంతో వైట్ హౌస్ స్పందించింది.
వాషింగ్టన్, అక్టోబర్ 10: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వెనెజులా ప్రతిపక్ష నేత మారియా కొరినా మచాడోకు దక్కడంతో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కాస్త ఘాటుగా స్పందించింది. ఈ బహుమతి రాకున్నా అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్ మాత్రం శాంతి సంప్రదింపులు, యుద్ధాలు నివరించడంతోపాటు ప్రజల ప్రాణాలు కాపాడటాన్ని కొనసాగిస్తారని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మానవతా వాది అని అభివర్ణించింది. ఆయనకు హృదయం సైతం ఉందని గుర్తు చేసింది. ఆయన తన సంకల్ప శక్తితో పర్వతాలను సైతం కదిలించగలరని తెలిపింది. అలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఉండరంటూ చెప్పుకొచ్చింది.
ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ శుక్రవారం తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. ఈ బహుమతి అధ్యక్షుడు ట్రంప్‌కి కాకుండా.. మరొకరికి ఇస్తూ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సైతం ఈ సందర్భంగా స్టీవెన్ చియుంగ్ విమర్శించారు. ఈ బహుమతి ఎంపిక విషయంలో శాంతి స్థానంలో రాజకీయాలు చేశారంటూ నోబెల్ కమిటీ నిరూపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2025 సంవత్సరానికిగాను నోబెల్ శాంతి బహుమతికి వెనెజులా ప్రతిపక్ష నేత మారినా కొరినా మచాడో ఎంపిక చేశారు. ఆమె పేరు నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రతినిధి జోర్గెన్ వాట్నే ఫ్రైడ్నెస్ శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా వెనెజులా దేశంలో పలు విపత్కర పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం నిలబెట్టడంలో ప్రతిపక్ష నేతగా మచాడో కీలకంగా వ్యవహరించారంటూ ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు.
1967, అక్టోబర్ 7వ తేదీ మచాడో జన్మించారు. అయితే దేశంలో మానవ హక్కులను కాలరాయడంపై వెనెజుల ప్రభుత్వంపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. దేశంలో శాంతి, ప్రజాస్వామ్యం పరిరక్షించడంలో ఆమె అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో నోబెల్ శాంతి బహుమతికి మచాడో పేరును ఆ కమిటీ ఎంపిక చేసి ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మరియా కొరినాను వరించిన నోబెల్ శాంతి బహుమతి
మమ్మల్ని టెస్ట్ చేయొద్దు.. భారత్ గడ్డపై నుంచి పాక్‌కు అప్ఘాన్ మంత్రి వార్నింగ్
Read Latest International News and Telugu News