Howard Lutnick: భారత్‌ను చక్కదిద్దాలి.. మళ్లీ రెచ్చిపోయిన అమెరికా కామర్స్ మంత్రి
ABN , Publish Date - Sep 28 , 2025 | 04:41 PM
భారత్, బ్రెజిల్ దేశాలు అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేయొద్దని అమెరికా కామర్స్ మంత్రి అన్నారు. ఓ ఇంటర్య్వూ సందర్భంగా భారత్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హావర్డ్ లట్నిక్ మరోమారు భారత్‌ను టార్గెట్ చేసుకున్నారు. భారత్‌ను సరిదిద్దాల్సిన అవసరం ఉందని సంచలన కామెంట్ చేశారు. అమెరికా కస్టమర్లకు భారత్ తన వస్తువులు విక్రయించాలనుకుంటే అధ్యక్షుడి అభిమతానికి అనుగుణంగా సహకరించాలని అన్నారు. అమెరికా కంపెనీలను భారత్, బ్రెజిల్ తమ మార్కెట్‌లోకి అనుమతించేందుకు మరింత కృషి చేయాలని అన్నారు. అమెరికా ప్రయోజనాలకు నష్టం వాటిల్లే పనులు మానుకోవాలని హెచ్చరించారు.
‘స్విట్జర్లాండ్, బ్రెజిల్, భారత్ లాంటి దేశాలు కొన్ని ఉన్నాయి. అమెరికా విషయంలో ఇవి సరిగా వ్యవహరించాలి. వాళ్ల మార్కెట్లను తెరవాలి. అమెరికా ప్రయోజనాలకు నష్టం కలిగించే చర్యలను మానుకోవాలి. అందుకే ఆయా దేశాలతో ప్రస్తుతం చిక్కులు నెలకున్నాయి. అమెరికా ఉత్పత్తులకు ఈ దేశాలు తమ వస్తువులను విక్రయించాలంటే అధ్యక్షుడు ట్రంప్ అభిమతానికి అనుగుణంగా నడుచుకోవాలి. అధ్యక్షుడితో డీలింగ్ వేరుగా ఉంటుంది. ఆయనతో మొదటి డీల్ అత్యుత్తమమైనది. ఆ తరువాత డీల్స్ మరింత సంక్లిష్టంగా మారతాయి’ అని లట్‌నిక్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కామెంట్ చేశారు.
ప్రస్తుతానికి చాలా వాణిజ్య ఒప్పందాలు చర్చల దశలో ఉన్నాయని, అయితే భారత్, బ్రెజిల్‌తో డీల్సే ప్రముఖమైనవని అన్నారు. ‘ఇంకా తైవాన్ కూడా ఉంది. త్వరలో ఒప్పందం కుదరొచ్చు. త్వరలో వాళ్లతో నేను మాట్లాడతాను. సమస్యను ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తాను. కానీ ఇంకా కొన్ని దేశాలు మిగిలిపోయాయి. భారత్, బ్రెజిల్ వీటిల్లో ముఖ్యమైనవి’ అని తెలిపారు.
భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరే దిశగా చర్చలు సాగిస్తున్నాయి. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సారథ్యంలో భారత బృందం సెప్టెంబర్ 22 - 24 మధ్య అమెరికాలో అక్కడి అధికారులతో చర్చలు జరిపింది. తమ మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆ తరువాత ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి:
అతిగా లాబీయింగ్ చేయొద్దు.. ట్రంప్‌కు నోబెల్ కమిటీ పరోక్ష హెచ్చరిక
ఐరోపా గగనతలంలో ప్రయాణించని ఇజ్రాయెల్ ప్రధాని..అరెస్టు భయమే కారణమా..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి