Share News

Trump-Nobel Prize: అతిగా లాబీయింగ్ చేయొద్దు.. ట్రంప్‌కు నోబెల్ కమిటీ పరోక్ష హెచ్చరిక

ABN , Publish Date - Sep 27 , 2025 | 09:22 AM

నోబెల్ ప్రైజ్ కోసం డొనాల్డ్ ట్రంప్ తెగ ఆశపడుతున్న నేపథ్యంలో నోబెల్ కమిటీ కీలక వ్యాఖ్యలు చేసింది. లాబీయింగ్‌కు దూరంగా నోబెల్ బహుమతి గ్రహీతల ఎంపిక కోసం ప్రయత్నిస్తామని వ్యాఖ్యానించింది.

Trump-Nobel Prize:  అతిగా లాబీయింగ్ చేయొద్దు.. ట్రంప్‌కు నోబెల్ కమిటీ  పరోక్ష హెచ్చరిక
Trump Nobel Peace Prize 2025 Chances

ఇంటర్నెట్ డెస్క్: నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతగా ఆరాటపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు యుద్ధాలను ఆపిన తను కచ్చితంగా నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినని విశ్వసిస్తున్నారు. శాంతి స్థాపన కోసం తను చేసిన కృషి గురించి ఇటీవల ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. అయితే, నోబెల్ ప్రైజ్ కోసం ఇంతగా ఆరాట పడటం చివరకు వికటించే అవకాశం ఉందని నోబెల్ కమిటీ కూడా ఇటీవల అభిప్రాయపడింది. ట్రంప్ పేరెత్తకుండా ఈ హెచ్చరికలు చేసింది (Trump Nobel Peace Prize 2025).

ఇటీవల ట్రంప్ ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో మాట్లాడుతూ తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. ‘నేను ఏడు యుద్ధాలను ఆపాను. ఆయా దేశాధినేతలతో నేను స్వయంగా మాట్లాడాను. రోజంతా శ్రమించాను. ఐక్యరాజ్య సమితి నుంచి నాకు ఎలాంటి సాయం అందలేదు. పని చేయని ఎస్కలేటర్, టెలీప్రాంమ్టర్ మాత్రమే యూఎన్ నుంచి నాకు వచ్చాయి’ అని ట్రంప్ అన్నారు (Nobel committee comments Trump).


ఈ నేపథ్యంలో నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ ఆశ్లే టోయే స్పందించారు. ‘కొందరు నోబెల్ బహుమతి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. మా నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు తీవ్రంగా లాబీయింగ్ చేస్తుంటారు. కానీ మేము నాలుగు గోడల మధ్య బయటి ప్రభావాలు లేకుండా పనిచేసేందుకు ప్రయత్నిస్తుంటాము. అసలు మా మధ్య ఏకాభిప్రాయం కుదరడమే చాలా కష్టం’ అని స్పష్టం చేశారు (peace prize speculation Trump).

ఇక డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ బహుమతి వచ్చే అవకాశమే లేదని చరిత్రకారుడు ఆస్లే స్వీన్ అన్నారు. గాజా యుద్ధంలో ఆయన ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచారని, రష్యా ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తున్న సమయంలో పుతిన్‌కు అనుకూలంగా వ్యవహరించారని గుర్తు చేశారు. దీంతో, ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చే అవకాశం లేదని అన్నారు.

‘ట్రంప్ కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా తప్పుకుంది. పారిస్ ఒప్పందం నుంచి కూడా వైదొలగింది. ఇలాంటి వాళ్లకు నోబెల్ ప్రైజ్ రావాలని ఎవరూ కోరుకోరు కదా’ అని ఓస్లాలోని పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నీనా గ్రేగర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

ఐరోపా గగనతలంలో ప్రయాణించని ఇజ్రాయెల్ ప్రధాని..అరెస్టు భయమే కారణమా..

చైనా కన్నెర్ర చేస్తే అమెరికాలో టాయిలెట్ పేపర్ కూడా ఉండదు: ఫైనాన్షియల్ ప్లానర్ కామెంట్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 27 , 2025 | 09:59 AM