Share News

Trump-Zelensky Clash: ట్రంప్, జెలెన్‌స్కీ మాటల యుద్ధం.. చూసి తట్టుకోలేక తలపట్టుకున్న ఉక్రెయిన దౌత్యవేత్త

ABN , Publish Date - Mar 01 , 2025 | 12:06 PM

శ్వేతసౌధంలో పబ్లిక్‌గా డొనాల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ వాదులాడుకోవడం చూసి తట్టుకోలేకపోయిన ఉక్రెయిన్ దౌత్యవేత్త వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను శ్వేతసౌధం డిప్యుటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్వయంగా షేర్ చేశారు.

Trump-Zelensky Clash: ట్రంప్, జెలెన్‌స్కీ మాటల యుద్ధం.. చూసి తట్టుకోలేక తలపట్టుకున్న ఉక్రెయిన దౌత్యవేత్త

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో ఎన్నడూ చూడని షాకింగ్ దృశ్యం.. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం శ్వేత సౌధంలో అంతర్జాతీయ మీడియా సమక్షంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర స్థాయిలో వాగ్వాదాలాడుకున్నారు. నువ్వు మాట్లాడింది చాలు అంటూ ఒకానొక దశలో ట్రంప్ జెలెన్‌స్కీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు జెలెన్‌స్కీ ట్రంప్‌తో అధికారిక విందులో పాల్గొనకుండానే అవమాన భారంతో వెనుదిరగాల్సి వచ్చింది (Ukraine Envoys hides her face in hands).

ఈ దృశ్యాలు తట్టుకోలేకపోయిన ఓ ఉక్రెయిన్ దౌత్యవేత్త షాక్‌లో తలపట్టుకున్నారు. ట్రంప్, జెలెన్‌స్కీ చర్చలు చివరకు వాగ్వాదానికి దిగడాన్ని తట్టుకోలేక వారిపై వైపు చూడలేక చేతుల్లో ముఖం దాచుకున్నారు. ఆమె ఎదుర్కొంటున్న అవమాన భారం, పరిస్థితులు చేయి దాటిపోతున్నా ఏం చేయలేక నిస్సహాయంగా మిగిలిపోయిన వైనం నెట్టింట వైరల్‌గా మారింది.


Trump-Zelensky Clash: నీ ఆట ముగిసింది.. జెలెన్‌స్కీకి ట్రంప్ మాస్ వార్నింగ్

ఈ వీడియోను స్వయంగా శ్వేతసౌధం డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావీనో షేర్ చేశారు. జెలెన్‌స్కీ దౌత్యంలో చాలా దారుణంగా విఫలమయ్యారన్న విషయం ఉక్రెయిన్ దౌత్యవేత్తకు స్పష్టంగా అర్థమైందని కామెంట్ చేశారు. ఇక జెలెన్‌స్కీ పరిస్తితి చూసి రష్యా తెగ సంబర పడిపోయింది. ట్రంప్, వాన్స్ జెలెన్‌స్కీ చెంప ఛెళ్లుమనిపిస్తారని అనుకున్నామంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. వాళ్లు అంత నిగ్రహం పాటించారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తోందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి కామెంట్ చేశారు.


ఈయూపై 25% సుంకం విధిస్తాం: డొనాల్డ్ ట్రంప్

మరోవైపు, పలు ఐరోపా దేశాల నేతలు జెలెన్‌స్కీకి మద్దతుగా నిలిచారు. దాడి చేసింది రష్యా.. బాధితులుగా మిగిలింది ఉక్రెయిన్ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. ఇతర దేశాల నేతలు కూడా జెలెన్‌స్కీకి మద్దతుగా పోస్టులు పెట్టారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ ఒంటరి కాదని భరోసా ఇచ్చారు. ట్రంప్‌ను నేరుగా విమర్శించకపోయినప్పటికీ అమెరికాకు ఐరోపా దేశాలు దూరమవుతున్న వైనం ఈ ఉదంతంలో స్పష్టంగా కనిపించింది.

ఇక, జెలెన్‌స్కీతో సమావేశం అనంతరం ట్రంప్ కూడా సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన చేశారు. శాంతి నెలకొల్పేందుకు జెలెన్‌స్కీ సిద్ధమైతేనే శ్వేత సౌధానికి మళ్లి రావాలని తేల్చి చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 01 , 2025 | 12:15 PM