Share News

Donald Trump: బ్రిక్స్‌కు మద్దతిస్తే 10% అదనపు సుంకం

ABN , Publish Date - Jul 08 , 2025 | 05:22 AM

ఒక పక్క బ్రిక్స్‌ దేశాల సదస్సు బ్రెజిల్‌లో జరుగుతుంటే మరోపక్క అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ వాణిజ్య కూటమి పట్ల విషం కక్కారు.

Donald Trump: బ్రిక్స్‌కు మద్దతిస్తే 10% అదనపు సుంకం

  • దానివి అమెరికాకు వ్యతిరేక విధానాలు.. ప్రపంచ దేశాలకు ట్రంప్‌ హెచ్చరిక

వాషింగ్టన్‌/రియో డీ జనేరో: ఒక పక్క బ్రిక్స్‌ దేశాల సదస్సు బ్రెజిల్‌లో జరుగుతుంటే మరోపక్క అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ వాణిజ్య కూటమి పట్ల విషం కక్కారు. బ్రిక్స్‌ అనుసరిస్తున్న అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతుగా నిలిచిన దేశాలపై మరో పదిశాతం అదనపు సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండబోదని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టారు. బ్రిక్స్‌ అనుసరిస్తున్న అమెరికా వ్యతిరేక విధానాలేంటో చెప్పలేదు. ప్రపంచ దేశాలకు వాణిజ్య విధివిధానాలు అధికారికంగా లేఖల రూపంలో పంపిస్తున్నట్లు తెలిపారు. 2009లో బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనాలతో ఏర్పడి, తర్వాత దక్షిణాఫ్రికాను కలుపుకొని, ఇప్పుడు ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేసియా, ఇరాన్‌, సౌదీ అరేబియా, యూఏఈలకు విస్తరించిన వాణిజ్య కూటమి బ్రిక్స్‌. ట్రంప్‌ అడ్డగోలు సుంకాలను పరోక్షంగా తప్పుబడుతూ బ్రిక్స్‌ ప్రకటన చేయగానే ట్రంప్‌ తాజా ప్రకటనతో బదులిచ్చారు. బ్రిక్స్‌ ప్రకటనలో ప్రపంచ వాణిజ్య సంస్ధ మద్దతు కలిగిన నిబంధనలతో కూడుకున్న, పారదర్శకమైన, అందరినీ కలుపుకొనిపోయే, సమానత్వంతో కూడిన బహుళ వాణిజ్య వ్యవస్థకు మద్దతు తెలుపుతామని చెప్పింది. ట్రంప్‌ ప్రకటించిన భారీ సుంకాల అమలుకు 90 రోజుల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. అది బుధవారంతో ముగిసిపోతోంది. ఆలోపు భారత్‌ అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలి. అందుకు సంబంధించిన చర్చలు ముగిశాయి. ట్రంప్‌ తాజా ప్రకటన ఇరు దేశాల మధ్య కుదరనున్న వాణిజ్య ఒప్పందం మీద ఎలాంటి ప్రభావం చూపబోదని అధికారులు అంటున్నారు. ట్రంప్‌ ప్రకటన మీద చైనా స్పందించింది. మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకొని బ్రిక్స్‌ పని చేయదని స్పష్టం చేసింది. వాణిజ్యంలో విజేతలు ఉండరని, రక్షణాత్మక వాణిజ్యం ముందుకు తీసుకెళ్లదని వ్యాఖ్యానించింది.


పహల్గాంపై ఖండన

బ్రిక్స్‌ సభ్య దేశాలు కశ్మీరులోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండించాయి. ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి రాజీ ఉండరాదని పిలుపునిచ్చాయి. ఉగ్రవాదంపై కొన్ని దేశాల ద్వంద్వ ప్రమాణాలను తప్పుబట్టాయి. ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడాల్సిన అవసరాన్ని గుర్తు చేశాయి. మరోపక్క ప్రధాని మోదీ నిరుపేద దేశాల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా బ్రిక్స్‌ దేశాలు పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ క్యూబా అధ్యక్షుడు మైగల్‌ డియాజ్‌ కెనాల్‌ బెర్ముడెజ్‌తో సమావేశం అయ్యారు. ఫార్మా, యూపీఐ అమలు వంటి అంశాలపై చర్చించారు. మలేసియా ప్రధాని, బొలీవియా, ఉరుగ్వే అధ్యక్షులతోనూ భేటీ అయ్యారు.


ఇవి కూడా చదవండి

జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 08 , 2025 | 07:43 AM