Trump Sues NYT: న్యూయార్క్ టైమ్స్‌పై ట్రంప్ గుస్సా.. రూ.1.32 లక్షల కోట్లకు పరువు నష్టం దావా
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:20 PM
జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించి తనపై న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఏళ్లతరబడి దుష్ప్రచారం చేస్తోందని డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆరోపించారు. సంస్థపై రూ.1.32 లక్షల కోట్లకు పరువునష్టం కేసు వేసినట్టు వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: తన పరువుకు నష్టం కలిగించేలా ఏళ్ల తరబడి తప్పుడు కథనాలు వండి వారుస్తోందంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. సంస్థపై రూ.1.32 లక్షల కోట్లకు పరువు నష్టం దావా వేసినట్టు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో తాజాగా వెల్లడించారు. లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించి కూడా న్యూయార్క్ టైమ్స్ తనపై తప్పుడు కథనాలను ప్రచురించిందని ట్రంప్ ఆరోపించారు (Trump sues NYT).
ఈ సందర్భంగా న్యూయార్క్ టైమ్స్‌పై ట్రంప్ సోషల్ మీడియాలో అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అమెరికా చరిత్రలో అత్యంత దిగజారిన, చెత్త పత్రికల్లో న్యూయార్క్ టైమ్స్ ఒకటని వ్యాఖ్యానించారు. వామపక్ష డెమాక్రటిక్ పార్టీకి కరపత్రంగా మారిపోయిందని అన్నారు. మునుపటి ఎన్నికల్లో కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మొదటి పేజీలో ప్రకటించారని, ఇలాంటిది మునుపెన్నడూ చూడలేదని తెలిపారు. తనపై అవాకులు చవాకులు మాట్లాడేందుకు న్యూయార్క్ టైమ్స్‌కు చాలా కాలంపాటు అవకాశం లభించిందని కామెంట్ చేశారు. ఇక్కడితో ఈ ఒరవడి ముగిసినట్టేనని అన్నారు. తనపైనా, తన కుటుంబం, వ్యాపారాలు, తన మద్దతుదారులుపైనా ఈ పత్రిక దశాబ్దాలుగా అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు (Trump vs New York Times).
ఏమిటీ జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసు
లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసు అమెరికాలో కొన్నేళ్లుగా కలకలం రేపుతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువతులకు, మైనర్ బాలికలకు డబ్బు ఎరగా వేసి ఫ్లోరిడా, వర్జిన్ ఐల్యాండ్స్, తదితర ప్రాంతాల్లోని నివాసాల్లో వారిపై అఘాయిత్యాలకు పాల్పడేవాడు. బాధితుల సాయంతో మరికొంత మందిని ట్రాప్ చేసేవాడు. అతడికి అమెరికా ప్రముఖులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవని అక్కడి మీడియా చెబుతోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తావన కూడా అమెరికాలో కలకలం రేపుతోంది. ఎప్‌స్టీన్‌తో కలిసి ట్రంప్ దిగిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక లైంగిక ఆరోపణలకు సంబంధించి 2008 ఓసారి అరెస్టయ్యి జైలు శిక్ష తరువాత జెఫ్రీ విడుదలయ్యాడు. ఆ తరువాత 2019లో మీటూ ఉద్యమం సందర్భంగా మరోసారి జైలుపాలయ్యాడు. 2019లో అతడు జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ టైమ్స్‌పై కేసు వేశారు.
ఇవి కూడా చదవండి:
భారత్‌పై సుంకాలు విధించడం అంత ఈజీ కాదు.. అయినా చేశా: డొనాల్డ్ ట్రంప్
సుచిర్ బాలాజీది హత్యే.. ఓపెన్‌ఏఐ సీఈఓకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఎలాన్ మస్క్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం