Donald Trump: భారత్‌పై 25 శాతం సుంకం
ABN , Publish Date - Jul 31 , 2025 | 03:22 AM
రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి సుంకాల రంకెలేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ఉత్పత్తులపై
రష్యా నుంచి ఆయుధాలు, చమురు కొంటున్నందుకు జరిమానా కూడా!
సుంకాల అమలు రేపటి నుంచే.. ఈసారి గడువు పొడించే ప్రసక్తే లేదు
ఇండియా మాకు మిత్రదేశమే అయినా.. భారీ సుంకాలు వేస్తోంది: ట్రంప్
తాజా సుంకాల ప్రభావాన్ని పరిశీలిస్తున్నాం: కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి
2 దేశాలకూ లాభదాయకమైన ఒప్పందం కుదురుతుందని ఆశాభావం
మోదీ, ట్రంప్ మధ్య స్నేహంతో ప్రయోజనం లేదని తేలింది: విపక్షాలు
వాషింగ్టన్, జూలై 30: రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి సుంకాల రంకెలేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ఉత్పత్తులపై 255 సుంకం విధిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. శుక్రవారం (ఆగస్టు 1) నుంచి ఈ సుంకం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. సుంకంతోనే సరిపెట్టలేదాయన.. రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకుగాను భారత్‌పై జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించారు. అమెరికా విమోచన దినం పేరుతో ఈ ఏడాది ఏప్రిల్ 2న ఆయన భారత్‌పై 265 సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే.. భారత్ సహా పలుదేశాలపై సుంకాల అమలును 90 రోజులపాటు నిలిపివేస్తున్నట్టు ఆయనే ఏప్రిల్ 9వ తేదీన మరొక ప్రకటన చేశారు. అప్పటిదాకా.. చైనా వంటి కొన్నిదేశాలు మినహా మెజారిటీ దేశాలపై 10 శాతం సుంకం వసూలు చేస్తానని చెప్పారు. భారతదేశం తమకు మిత్రదేశమే అయినప్పటికీ.. ఆ దేశంతో అమెరికా చాలా సంవత్సరాలుగా పెద్దగా వ్యాపారం చేయలేకపోయిందని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమమైన ‘ట్రూత్ సోషల్’లో పేర్కొన్నారు. ‘‘ఎందుకంటే భారత్ విధించే సుంకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. ఇతరదేశాలతో పోలిస్తే భారత్ అత్యంత కఠినమైన, గర్హనీయమైన ఆర్థికేతర పన్ను అడ్డంకులను విధించే దేశం’’ అని ఆయన ఆ పోస్టులో వివరించారు. ‘‘అంతేకాదు.. వారు (భారత్) ఎల్లప్పుడూ తమకు కావాల్సిన సైనిక పరికరాల్లో ఎక్కువ భాగం రష్యా నుంచే కొనుగోలు చేస్తారు. రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేసే అతిపెద్ద దేశాల్లో చైనాతో పాటు భారత్ కూడా ఉంది. ఇదంతా కూడా.. ఉక్రెయిన్‌లో రష్యా సాగిస్తున్న మారణకాండను నిలువరించాలని అందరూ అనుకుంటున్న వేళ జరుగుతోంది. ఇది మంచిది కాదు. అందువల్ల భారత్ ఉత్పత్తులపై 25% సుంకాలు, అదనంగా జరిమానా విధిస్తాం. ఇవి ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి.’’ అని తేల్చిచెప్పారు. ‘‘ఆగస్టు ఒకటి అంటే.. ఆగస్టు ఒకటే. ఈసారి ఆ గడువును పొడిగించే ప్రసక్తే లేదు.’’ అని హెచ్చరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. వాణిజ్యంతోపాటు.. భారత్ ‘బ్రిక్స్’లో భాగం కావడం కూడా 25% సుంకాల నిర్ణయానికి ఒక కారణమని తెలిపారు. బ్రిక్స్.. అమెరికా వ్యతిరేక కూటమి అని, అది డాలర్‌పై దాడి చేస్తోందని.. ఎవరైనా సరే, డాలర్‌పై దాడి చేయడాన్ని తాము అనుమతించబోమని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ప్రధాని మోదీ నా స్నేహితుడే. కానీ.. వాణిజ్యకోణంలో చూస్తే వారు (భారత్) మాతో పెద్ద ఎత్తున వ్యాపారం చేయట్లేదు.
భారత్ మాకు అనేక ఉత్పత్తులను విక్రయిస్తోందిగానీ మేం వారి దగ్గర కొనదల్చుకోలేదు. ఎందుకంటే వారి సుంకాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు వారు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు వారు ఆ సుంకాలను గణనీయంగా తగ్గించడానికి సిద్ధంగా ఉన్నారు. చర్చలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.ఈ వారాంతానికి ఏ విషయమూ తేలుతుంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా ఇరు దేశాల మధ్య.. వాణిజ్య ఒప్పందంపై ఐదుసార్లు చర్చలు జరిగాయిగానీ అవి ఒక కొలిక్కి రాలేదు. ఆరో దశ చర్చలు ఆగస్టులో జరగాల్సి ఉంది. ఇందుకోసం అమెరికా నుంచి ఒక బృందం ఆగస్టు 25న భారత్‌కు రానున్నట్టు ప్రభుత్వ వర్గాలు ఇటీవలే వెల్లడించాయి. ఇంతలోనే.. ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
పరిశీలిస్తున్నాం..
ట్రంప్ టారి్‌ఫల ప్రభావం ఎంతమేరకు ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్రప్రభుత్వం తెలిపింది. సముచితమైన, సంతులిత, పరస్పర ప్రయోజనకారిగా, ఇరు దేశాలకూ లాభదాయకంగా ఉండే వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్న ఆశ తమకు ఉందని.. ఆ దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. మరోవైపు.. భారత ఉత్పత్తులపై 25ు సుంకం, రష్యా చమురు కొన్నందుకు జరిమానా విధిస్తామంటూ ట్రంప్ చేసిన ప్రకటన నేపథ్యంలో విపక్షాలు కేంద్రంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. ప్రధాని మోదీకి ట్రంప్‌తో ఉన్న స్నేహం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని దీంతో తేటతెల్లమైందని ఎద్దేవా చేశాయి. హౌడీ మోదీకి, ట్రంప్‌కు మధ్య ఉన్న ‘తారిఫ్ (పరస్పర పొగడ్తలు)’ పనికిరాలేదని.. ట్రంప్ మనపై టారిఫ్ (సుంకం), పెనాల్టీ (జరిమానా) వేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘టారిఫ్’.. ‘తారిఫ్’ అనే పదాలు ఉపయోగించి చురక వేశారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకుని.. అమెరికా అధ్యక్షుడికి ఎదురుగా ధైర్యంగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. ట్రంప్ చేసిన ఎన్నో అవమానాలను మౌనంగా భరిస్తే భారత్‌కు ప్రయోజనాలు ఉంటాయని ప్రధాని మోదీ భావించారని.. కానీ అలా జరగలేదని జైరామ్ రమేశ్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ అసహనం.. అందుకే..
భారత్‌పై 25% సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ చేసిన ప్రకటన వెనుక కారణం ఏంటో వైట్‌హౌస్ ఆర్థిక సలహాదారు, అమెరికా నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హాసెట్ బయటపెట్టారు. ఏప్రిల్‌లో ట్రంప్ సుంకాల ప్రకటన చేసిన నాటి నుంచీ.. ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి జరుగుతున్న చర్చలు ఎటూ తెగట్లేదు. దీనిపై ట్రంప్ అసహనంతో ఉన్నారని.. 25ు సుంకాల విధింపును ఆయన ఒక పరిష్కారంగా చూస్తున్నారని.. ఈ టారిఫ్ ద్వారా భారత్‌పై ఒత్తిడి పెంచి అమెరికా ప్రజలకు మేలు చేసేలా ఒప్పందం కుదుర్చుకోవచ్చని ఆయన భావిస్తున్నట్టు హాసెట్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..
For More International News And Telugu News