Trump-Modi: భారత్‌ను బెదిరించలేమని గుర్తించిన ట్రంప్ చివరకు.. సింగపూర్ మాజీ మంత్రి ఆసక్తికర కామెంట్
ABN , Publish Date - Oct 05 , 2025 | 08:50 PM
భారత్‌ను బెదిరించలేమని డొనాల్డ్ ట్రంప్ గుర్తించారని సింగపూర్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. చివరకు మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారని సెటైర్లు పేల్చారు. బహుళ ధ్రువ ప్రపంచానికి ఇది నిదర్శనమని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సింగపూర్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి జార్జ్ ఇయో సెటైర్లు పేల్చారు. భారత్‌పై ఒత్తిడి పెంచడంలో విఫలమై చివరకు ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారని అన్నారు. జాగ్రెబ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన ఈ కామెంట్స్ చేశారు.
‘చైనాకు వ్యతిరేకంగా అమెరికాను ప్రయోగించొచ్చని భారత్ అనుకుంది. చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను దింపుదామని అమెరికా అనుకుంది. ఇక ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక రష్యాను వదులుకునేందుకు భారత్ సిద్ధపడలేదు. ఆ తరువాత పాక్‌తో జరిగిన ఘర్షణల్లో అమెరికా మద్దతు తనకు లేదని భారత్‌కు అర్థమైంది. ఆ మాటకొస్తే.. ట్రంప్ స్వయంగా పాక్ ఆర్మీ చీఫ్‌ను శ్వేత సౌధానికి ఆహ్వానించారు. పాక్ ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించింది’
‘కానీ భారత్ మాత్రం దృఢంగా ఒత్తిడులను ఎదుర్కొంది. దీంతో, భారత్‌ను బెదిరించలేమని ట్రంప్‌కు అర్థమైంది. చివరకు ట్రంప్ మోదీకి పుట్టిన రోజుశుభాకాంక్షలు తెలిపారు. థ్యాంక్యూ మై ఫ్రెండ్ అంటూ మోదీ రిప్లై ఇచ్చారు. అంటే.. ప్రస్తుతం మనముందు పూర్తి స్థాయి బహుళ ధ్రువ ప్రపంచం క్రమంగా ఆవిష్కృతం అవుతోంది’ అని ఆయన ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులను విడమరిచి చెప్పారు.
సింగపూర్ మాజీ మంత్రి గతంలో కూడా అమెరికా చర్యలను తప్పుపట్టారు. దశాబ్దాల పాటు కొనసాగిన స్వేచ్ఛా వాణిజ్యానికి ట్రంప్ సుంకాలు ముప్పుగా మారాయని అన్నారు. ప్రధాన సప్లై చెయిన్లు ధ్వంసమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. డబ్ల్యూటీఓ, ఎమ్ఎఫ్ఎన్ గుర్తింపులు లేని ఒకప్పటి ప్రపంచంవైపు ట్రంప్ మళ్లుతున్నారని అన్నారు. రాజకీయ లక్ష్య సాధనకు వాణిజ్యం ఓ ట్రంప్ కార్డుగా మారిందని అన్నారు. అమెరికాకు తనపై తనకు నమ్మకం సన్నగిల్లిందని అన్నారు. ఒకప్పుడు ప్రపంచవాణిజ్యంలో అమెరికా వాటా 40 శాతంగా ఉండేదని గుర్తు చేశారు. డబ్ల్యూహెచ్ఓ నిబంధనలను ఒంటి చేత్తో ప్రభావితం చేయగలిగిందని, ఇదంతా గత వైభవమని వ్యాఖ్యానించారు. ఇక గతేడాది సింగపూర్, ఇండియాలు తమ మధ్య దౌత్య బంధాన్ని సమగ్ర వ్యూహాత్మక భాగస్వా్మ్యంగా అప్‌గ్రేడ్ చేసుకున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
నేను చెప్పినట్టు చేయకపోతే.. హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ వార్నింగ్
అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో తగ్గుదల.. దాదాపు సగానికి పడిపోయిన వైనం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి