Trump Tesla Car: తన టెస్లా కారు విక్రయించే యోచనలో ట్రంప్
ABN , Publish Date - Jun 06 , 2025 | 11:35 PM
మస్క్‌తో విభేదాల కారణంగా ఆగ్రహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తన టెస్లా కారును విక్రయించే యోచనలో ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఎలాన్ మస్క్‌తో వివాదం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తన టెస్లా కారును వదిలించుకునే యోచనలో ఉన్నట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ కారును విక్రయించడం లేదా ఎవరికైనా ఉచితంగా ఇచ్చేయడంపై ట్రంప్ యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కారు శ్వేత సౌధంలోని వెస్ట్ వింగ్‌కు పక్కనే నిలిపి ఉంచారు.
టెస్లా కార్ల అమ్మకాలు పడిపోయిన నేపథ్యంలో మస్క్‌కు మద్దతుగా ట్రంప్ కొంత కాలం క్రితం టెస్లా కారును కొనుగోలు చేశారు. ఎర్రని రంగులో ఉన్న ఈ కారుతో ఆయన వైట్ హౌస్ ముందు ఫొటోలు కూడా దిగారు. టెస్లా కారు అద్భుతమంటూ ప్రశంసలు కురిపించారు.
అయితే, ట్రంప్ తన తాజా బిల్లులో తయారీ రంగంలోని పరిశ్రమలకు భారీగా పన్ను రాయతీలు ప్రకటించడం ఎలాన్ మస్క్‌కు అస్సలు రుచించలేదు. దీంతో, డోజ్ శాఖ నుంచి తప్పుకున్న వెంటనే మస్క్ బిల్లుపై విమర్శలు గుప్పించారు. ఈ బిల్లుతో అమెరికా ప్రజల నెత్తిన అప్పుల భారం పెరుగుతుందన్నారు. ప్రస్తుతం అమెరికా నేషనల్ డెట్ 36.2 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఇక సోషల్ మీడియా వేదికగా కూడా మస్క్, ట్రంప్ పరస్పరం విమర్శలకు దిగడంతో ఈ వివాం మరింత వేడెక్కింది.
ట్రంప్‌పై అభిశంసన ప్రవేశపెట్టి పదవి నుంచి తొలగించాలని కూడా మస్క్ పేర్కొన్నారు. ఆయన స్థానంలో జేడీ వ్యాన్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలన్నారు. ఈ పోస్టు వైరల్ అయిన వెంటనే వాన్స్ కూడా స్పందించారు. ట్రంప్‌కు మించి దేశ సేవ కోసం శ్రమించిన వారిని తాను ఇంతవరకూ చూడలేదని అన్నారు. తన మద్దతు ఎప్పటికీ ట్రంప్‌కే అంటూ విస్పష్ట ప్రకటన చేశారు.
ఇక ట్రంప్ సన్నిహితుడు, వైట్ హౌస్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బ్యానన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మస్క్ ఇల్లీగల్ ఏలియన్ అని అన్నారు. ఆయన అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని ఆరోపించారు. ఆయనను సొంత దేశానికి వెంటనే డిపోర్ట్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొదటి నుంచి మస్క్‌ను వ్యతిరేకించే స్టీవ్ బ్యానన్ తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇవీ చదవండి:
మస్క్ ఒక ఏలియన్, అమెరికా నుంచి పంపించేయాలి: ట్రంప్ సన్నిహితుడి డిమాండ్
సిమ్లా ఒప్పందం అమల్లోనే ఉంది: పాక్ క్లారిటీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి