Share News

Steve Bannon: మస్క్ ఒక ఏలియన్, అమెరికా నుంచి పంపించేయాలి: ట్రంప్ సన్నిహితుడి డిమాండ్

ABN , Publish Date - Jun 06 , 2025 | 07:12 PM

మస్క్ అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని ట్రంప్ సన్నిహితుడు స్టీవ్ బ్యానన్ అన్నారు. ప్రభుత్వం వెంటనే మస్క్‌పై విచారణ ప్రారంభించాలని అన్నారు.

Steve Bannon: మస్క్ ఒక ఏలియన్, అమెరికా నుంచి పంపించేయాలి: ట్రంప్ సన్నిహితుడి డిమాండ్
Steve Bannon Elon Musk

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఇద్దరూ పరస్పరం బహిరంగ విమర్శలకు దిగారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సన్నిహితుడు, వైట్ హౌస్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బ్యానన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మస్క్ ఇల్లీగల్ ఏలియన్ అని అన్నారు. ఆయన అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని ఆరోపించారు. ఆయనను సొంత దేశానికి వెంటనే డిపోర్ట్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొదటి నుంచి మస్క్‌ను వ్యతిరేకించే స్టీవ్ బ్యానన్ తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్యానన్ ఈ కామెంట్స్ చేశారు. ‘మస్క్ ఏ అనుమతితో అమెరికాలో ఉంటున్నారో తెలుసుకునేందుకు ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించాలి. వెంటనే దేశం నుంచి పంపించేయాలి’ అని పేర్కొన్నారు.


తన స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కార్యక్రమాన్ని మూసేస్తానంటూ మస్క్ ఇటీవల హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే స్టీవ్ బ్యానన్ మస్క్‌పై విరుచుకుపడ్డారు. ఇలాంటి హెచ్చరికలతో అమెరికా భద్రతకు ముప్పు పొంచి ఉందన్నారు. స్పేస్ ఎక్స్ కార్యకలాపాలను ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చేందుకు డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ కింద ట్రంప్ వెంటనే కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేయాలని సూచించారు.

ఏమిటీ డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్

కొరియా యుద్ధం సందర్భంగా ఈ చట్టాన్ని అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం, దేశ అవసరాల కోసం ఆయుధాలు, మెడికల్ ఉత్పత్తుల తయారీకి ప్రైవేటు కంపెనీలు ప్రాధాన్యత ఇచ్చేలా అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయొచ్చు.


ఈ దిశగా ట్రంప్ తక్షణం చర్యలు తీసుకోవాలని బ్యానన్ అన్నారు. మస్క్ ఇలాంటి హెచ్చరికలు జారీ చేసినప్పుడు ట్రంప్ వెంటనే డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ కింద ఆదేశాలు జారీ చేయాలని అన్నారు. మస్క్ మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. పెంటాగాన్ నుంచి చైనాకు సంబంధించిన సీక్రెట్ సమాచారాన్ని సేకరించేందుకు కూడా మస్క్ ప్రయత్నించారని స్టీవ్ బ్యానన్ ఆరోపించారు.

ఇవీ చదవండి:

పుతిన్ సాయం కోరిన పాక్.. మీ ఇన్‌ఫ్లుయెన్స్ వాడండని విజ్ఞప్తి

మస్క్‌పై తొలిసారిగా ట్రంప్ బహిరంగ విమర్శలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 06 , 2025 | 08:47 PM