Trump Govt Appeal: సుప్రీం కోర్టులో అమెరికా ప్రభుత్వ పిటిషన్.. భారత్ ప్రస్తావన
ABN , Publish Date - Sep 04 , 2025 | 08:58 PM
సుంకాల విధింపు చట్టప్రకారం చెల్లదంటూ యూఎస్ అప్పీల్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ట్రంప్ సర్కారు సుప్రీం కోర్టులో తాజాగా సవాలు చేసింది. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్‌పై సుంకాలు విధించడం అవసరమని తన పిటిషన్‌లో పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: సుంకాల విధింపునకు చట్టపరమైన చిక్కులు ఎదురు కావడంతో అమెరికా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ట్రంప్ సర్కారు విధించిన సుంకాలు చట్టప్రకారం చెల్లుబాటు కావని ఫెడరల్ అప్పీల్స్ కోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శాంతి స్థాపనకు సుంకాల విధింపు కీలకమని పిటిషన్‌లో పేర్కొంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శాంతి స్థాపనకు భారత్‌పై సుంకాలు విధించామని అమెరికా ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై సుంకాలు విధించినట్టు చెప్పుకొచ్చింది. ఇది యుద్ధం ముగింపు కోసం తీసుకున్న ముఖ్యమైన చర్య అని సమర్థించుకుంది. సుంకాల విధింపునకు ముందు అమెరికా పతనావస్థలో ఉండేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. అమెరికా విధానాలను ఇతర దేశాలు దుర్వినియోగం చేశాయని అన్నారు. సుంకాల విధింపు తరువాత ఆయా దేశాలు వేల కోట్ల డాలర్లను అమెరికాకు చెల్లిస్తున్నాయని చెప్పారు. అమెరికా మరింత శక్తిమంతంగా, ఆర్థికంగా గొప్ప స్థితిలోకి వచ్చిందని, అంతర్జాతీయంగా గౌరవం పెరిగిందని చెప్పారు.
ట్రంప్ విధించిన సుంకాలను ఇటీవల అమెరికా అప్పీల్స్ కోర్టు తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. సుంకాల కారణంగా ప్రపంచ వాణిజ్యం అస్తవ్యస్తంగా మారిందని వ్యాఖ్యానించింది. ఈ సుంకాలు చట్టవ్యతిరేకమని తేల్చి చెప్పింది. సుంకాల ఎత్తివేతకు అక్టోబర్ వరకూ సమయం ఇచ్చింది. ఈ లోపు సుప్రీం కోర్టులో సవాలు చేసుకోవచ్చని కూడా పేర్కొంది. అత్యవసర ఆర్థిక అధికారాల కింద ట్రంప్ ఈ సుంకాలను విధించారు. ఇది చట్టవ్యతిరేకంటూ కింది కోర్టు అంతకుముందు ఇచ్చిన తీర్పును అప్పీల్స్ కోర్టు తన తీర్పులో సమర్థించింది.
ఈ తీర్పుపై ట్రంప్ మండిపడ్డారు. ఇది సరికాదని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ తీర్పునకు వ్యతిరేకంగా పోరాడతానని అన్నారు. అప్పీల్స్ కోర్టు తీర్పును అమెరికా సర్వోన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తానని అన్నారు. అంతిమ విజయం అమెరికాదేనని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
భారత్ ఇప్పటికే చాలా ఆలస్యం చేసింది: డొనాల్డ్ ట్రంప్
భారత పర్యటనను ట్రంప్ రద్దు చేసుకున్నారా.. న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి