Share News

Trump: మీ ఇంగ్లిష్‌ యాస అర్థం కావడం లేదు

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:29 AM

భాష అర్థం కావడం లేదంటూ సమాధానాలు దాటవేశారు. అమెరికా గడ్డ మీద భారత్‌కు వ్యతిరేకంగా గళమెత్తుతున్న వర్గాలను దేశంలో కొనసాగనిస్తారా? అని విలేకరి ప్రశ్నించారు.

Trump: మీ ఇంగ్లిష్‌ యాస అర్థం కావడం లేదు

భారతీయ విలేకర్ల ప్రశ్నలు దాటేసిన ట్రంప్‌

అనువాదకులతో సాఫీగా సాగిన మోదీ ప్రసంగం

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 14: ప్రధాని మోదీతో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో భారతీయ విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ట్రంప్‌.. భాష అర్థం కావడం లేదంటూ సమాధానాలు దాటవేశారు. అమెరికా గడ్డ మీద భారత్‌కు వ్యతిరేకంగా గళమెత్తుతున్న వర్గాలను దేశంలో కొనసాగనిస్తారా? అని విలేకరి ప్రశ్నించారు. ఉగ్రవాది తహావుర్‌ రాణాను భారత్‌ పంపించాలన్న ట్రంప్‌ నిర్ణయాన్ని భారతీయులు స్వాగతిస్తారని కూడా విలేకరి చెప్పారు. కాస్త గట్టిగా మాట్లాడాలని ట్రంప్‌ సదరు విలేకరిని కోరారు. విలేకరి మరోసారి అదే ప్రశ్నను అడుగుతుండగా ట్రంప్‌ మధ్యలో కలుగజేసుకున్నారు. ఆయన చెప్పేది ఒక్క ముక్క అర్థం కావడం లేదన్నారు. విలేకరి యాస అర్థం చేసుకోవడం కాస్త కష్టంగా ఉందని చెప్పారు. ఖలిస్థానీ ఉగ్రవాదుల అణచివేతలో అమెరికా భారత్‌కు ఎలా సహకరించబోతోందో చెప్పాలని మరో విలేకరి అడిగారు. భారతదేశంలో వందకు పైగా కేసులను ఎదుర్కొంటున్న ఉగవ్రాది పన్నున్‌ను దృష్టిలో పెట్టుకొని విలేకరి ఈ ప్రశ్న అడిగారు.


బైడెన్‌ ప్రభుత్వంలో భారత నిఘా సంస్థలపై పలు ఆరోపణలు చేశారని, ఇప్పుడు తులసీ గబ్బార్డ్‌ నేతృత్వంలోని అమెరికా నిఘా విభాగం దీన్ని ఎలా చూస్తుందని అదే విలేకరి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకూ ట్రంప్‌ సమాధానం దాటేశారు. రాణాను అప్పగించడంపై ట్రంప్‌ స్పందిస్తూ, అత్యంత హింసాత్మక వ్యక్తిని తక్షణమే భారత్‌కు అప్పగిస్తున్నామని తెలిపారు. ఇంకా చాలామంది ఉగ్రవాదులను దేశం నుంచి పంపించనున్నామని, ఈ మేరకు భారత్‌ నుంచి పలు విజ్ఞప్తులు వచ్చాయని వివరించారు. ట్రంప్‌ సమాధానాలు దాటవేసిన వ్యవహారంపై సోషల్‌ మీడియా సరదాగా స్పందించింది. ఉత్తర భారతీయ జర్నలిస్టు ఇంగ్లిష్‌ అర్థం కాక ట్రంప్‌ దుబాసీని పెట్టుకుంటే దక్షిణ భారతదేశంలో మూడో తరగతి పిల్లాడికి కూడా అర్థమయ్యే ట్రంప్‌ ఇంగ్లిష్‌ అర్థం కాక ప్రధాని మోదీ మరో దుబాసీని పెట్టుకున్నారని ఒక నెటిజన్‌ వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశంలో ప్రధాని మోదీకి భాషా సమస్య ఎదురవలేదు. హిందీలో, ఇంగ్లి్‌షలో అనువాదం చేయడానికి ఆయన ఇద్దరు ట్రాన్స్‌లేటర్లను పక్కనే పెట్టుకోవడంతో ఇబ్బంది లేకుండా మాట్లాడారు.


ఇవి కూడా చదవండి...

PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు

CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ

Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2025 | 05:29 AM