PM Modi in Ethiopian Parliament: సింహాల గడ్డపై ఉన్ననూ సొంతింట్లో ఉన్నంత గర్వంగా ఉంది: మోదీ
ABN , Publish Date - Dec 17 , 2025 | 03:58 PM
ఇథియోపియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ దేశాన్ని సింహాల గడ్డగా అభివర్ణించారు. అక్కడ ఉన్ననూ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో ఉన్నట్టుందని చెప్పుకొచ్చారు మోదీ.
ఇంటర్నెట్ డెస్క్: ఇథియోపియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సింహాల దేశంలో అడుగుపెట్టడం పట్ల తన సొంత గడ్డపైనే ఉందన్న భావన కలుగుతోందన్నారు. తన స్వస్థలమైన గుజరాత్ కూడా సింహాలకు నిలయం కావడమే ఇందుకు కారణమని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. ఇథియోపియా ప్రజాస్వామ్య ప్రయాణాన్ని ప్రశంసించిన ఆయన.. 140 కోట్ల భారతీయ ప్రజల తరఫున స్నేహపూర్వక సోదరభావ శుక్షాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల జాతీయ గీతాలు.. ప్రజల్లో మాతృభూమి పట్ల గర్వాన్నీ, దేశభక్తినీ ప్రేరేపిస్తాయని కొనియాడారు. ప్రధాని మోదీ ప్రసంగించిన పార్లమెంట్లలో ఇది 18వది కావడం విశేషం.
భారత జాతీయ గేయమైన 'వందేమాతరం', ఇథియోపియా జాతీయ గేయం రెండూ మాతృభూమిని తల్లిగా సూచిస్తాయని మోదీ అభివర్ణించారు. మన వారసత్వం, సంస్కృతి, ప్రకృతి అందాల పట్ల గర్వపడటమే కాకుండా.. దేశాన్ని పరిరక్షించేందుకు అవి మనల్ని ప్రేరేపిస్తాయని మోదీ పేర్కొన్నారు. తనకు లభించిన ఇథియోపియా అత్యున్నత పౌర పురస్కారాన్ని వినయంతో స్వీకరిస్తున్నట్టు తెలిపారు. భారతీయుల తరఫున ఈ గౌరవాన్ని చేతులు జోడించి దేశ గౌరవాన్ని చాటుకున్నారాయన. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సారూప్యతలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు.
ఇథియోపియాలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారులలో భారతీయ కంపెనీలూ ఉన్నాయని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఇరు దేశాలూ అభివృద్ధి చెందుతున్న దేశాలు కాబట్టి పరస్పర సహకారం అందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ద్వైపాక్షిక సంబంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా వృద్ధి చేయాలని తాము నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. ఈ రెండు దేశాలు వాతావరణంతో పాటు స్ఫూర్తినీ పంచుకుంటాయని ఈ సందర్భంగా మోదీ తెలిపారు.
ఇవీ చదవండి: