Paris Museum Robbery: 'ధూమ్' స్టైల్‌లో చోరీ.. క్షణాల్లో ఆభరణాలు మాయం
ABN , Publish Date - Oct 26 , 2025 | 06:10 PM
బాలీవుడ్ సినిమా 'ధూమ్' స్టైల్‌లో ఫ్రాన్స్‌లో ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో భారీ దొంగతనం సంచలనంగా మారింది. మ్యూజియంలోకి చొరబడిన దొంగలు క్షణాల్లోనే ఆభరణాలను చోరీ చేశారు. దీంతో పారిస్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
పారిస్, అక్టోబర్ 26: బాలీవుడ్ సినిమా 'ధూమ్' స్టైల్‌లో ఫ్రాన్స్‌లో ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో భారీ దొంగతనం సంచలనంగా మారింది. మ్యూజియంలోకి చొరబడిన దొంగలు క్షణాల్లోనే ఆభరణాలను చోరీ చేశారు. దీంతో పారిస్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మోసాలిసా వంటి ప్రపంచ ప్రసిద్ధి కళాఖండాలు, విలువైన వస్తువులు ఉన్న ఈ మ్యూజియంలో జరిగిన దొంగతనం పారిస్ చరిత్రలోనే ఇది అతిపెద్ద చోరీ అని చెబుతున్నారు. అత్యంత సెక్యూరిటీ నడుమ ఈ చోరీ ఎలా జరిగిందనేది ఎవరికీ అంతుచిక్కడంలేదు. ఈ భారీ దొంగతనాన్ని ఎప్పటినుంచి ప్లాన్ చేశారో తెలియదు కానీ.. కేవలం ఏడు నుంచి ఎనిమిది నిమిషాల్లోనే పని ముగించుకొని విలువైన ఆభరణాలతో పరారయ్యారు.
ప్రస్తుతం సెయిన్ నది వైపున, మ్యూజియం వెనుక భాగంలో నిర్మాణం జరుగుతుండటంతో దొంగతనం చేయడానికి అనువుగా మారిందని అక్కడివారు అనుకుంటున్నారు. దొంగలు అక్కడినుంచే క్షణాల్లో మ్యూజియంలో చొరబడి చోరీ చేసినట్లు చెబుతున్నారు. మ్యూజియంపైకి ఎక్కి, దిగేందుకు ఒక పెద్ద హైడ్రాలిక్ నిచ్చెనను దొంగలు తయారు చేయించుకున్నారని.. దీని సహాయంతో మ్యూజియం పైకి ఎక్కి క్షణాల్లో లూటీ చేసినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దొంగతనానికి గురైన ఆభరణాల విలువ దాదాపు రూ.895 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ దొంగతనం చేసింది ఎవరనేది ఇప్పటివరకు వెల్లడికాలేదు. దొంగతనాల్లో ఆరితేరిన దొంగల ముఠా పింక్ పాంథర్స్ (Pink Panther Gang) గ్యాంగ్ ఈ పని చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక సందర్శకులు వచ్చే ఈ మ్యూజియంలో దొంగతనం జరగటంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. మ్యూజియం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దొంగలు ఎలా లోపలికి చొరబడ్డారు? కిటికీలను ఎలా బద్దలు కొట్టారు? అనేదానిపై నిశితంగా ఆధారాలను సేకరిస్తున్నారు. పలు సీసీటీవీలు పరిశీలించిన పోలీసులు.. డిస్క్ కట్టర్ సాయంతో కిటికీ ఊచలను కత్తిరించి దొంగతనం చేశారని గుర్తించారు. అటు ఆభరణాల చోరీపై మ్యూజియం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అత్యవసర కారణాలతో మ్యూజియం మూసివేసినట్టు తెలిపింది. దీంతో మ్యూజియం చూసేందుకు వస్తున్న వారు ప్రకటన చూసి వెనుదిరుగుతున్నారు. అత్యంత ప్రఖ్యాతి గాంచిన ఈ మ్యూజియం సందర్శించేందుకు ప్రతీరోజూ 30 వేల మందికి పైగా వస్తుంటారని సమాచారం.
ఇవి కూడా చదవండి:
Salman Khan: సల్మాన్ ఖాన్ బలూచిస్థాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం.. టెర్రరిస్ట్ అని ప్రకటించిన పాక్..
Sanjay Jaiswal: రూ.10 కోట్లు ఇవ్వకుంటే మీ కొడుకుని చంపేస్తాం.. బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్