Share News

Pak Minister Khwaja Asif: ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలకు అమెరికా కారణం.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - May 25 , 2025 | 09:54 AM

ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ప్రేరేపిస్తూ అమెరికా లాభపడుతోందని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

Pak Minister Khwaja Asif: ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలకు అమెరికా కారణం.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Pakistan Defence Minister US wars

ఇంటర్నెట్ డెస్క్: పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మరో కాంట్రవర్సీకి తెరతీశారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను రెచ్చగొడుతూ అమెరికా లాభాలను ఆర్జిస్తోందని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

గత శతాబ్దంలో జరిగిన యుద్ధాలన్నిటికీ అమెరికానే కారణమని పాక్ మంత్రి అన్నారు. ‘‘గత 100 ఏళ్లల్లో అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధాలను సృష్టించింది. వాళ్లు 260 యుద్ధాల్లో పాల్గొన్నారు. చైనా కేవలం మూడు యుద్ధాలను మాత్రమే చేసింది. ఈ యుద్ధాలతో అమెరికా లాభపడుతోంది. ధనం ఆర్జిస్తోంది. అక్కడి ఆయుధ తయారీ పరిశ్రమ చాలా శక్తిమంతమైనది. వేళ్లూనుకుపోయి ఉన్నది. అమెరికా జీడీపీలో అధిక శాతం ఆయుధ పరిశ్రమ నుంచే సమకూరుతోంది. అందుకే వారు యుద్ధాలను రెచ్చగొడుతుంటారు’’ అని కామెంట్ చేశారు.

సిరియా, ఆఫ్ఘనిస్థాన్, లిబియా వంటి దేశాలు ఒకప్పుడు సుసంపన్నమైనవని, సుదీర్ఘ యుద్ధాల కారణంగా సర్వనాశనమైపోయాయని అన్నారు. దివాలా తీశాయని తెలిపారు. అమెరికా వల్లే ఈ దేశాలు పతనమయ్యాయని పరోక్షంగా చెప్పుకొచ్చారు.


ప్రత్యర్థి దేశాలు రెండిటితోనూ అమెరికా ఆటలు ఆడుతుంటుందని పాక్ మంత్రి అన్నారు. అస్థిరత వివాదాలపైనే అమెరికా యుద్ధ పరిశ్రమ బతుకుతుంటుందని ఆగ్రహించారు.

ఈ కామెంట్స్‌ నెట్టింట పెద్ద చర్చకు దారి తీశాయి. కొందరు మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. పాక్ మిలిటరీ కూడా అమెరికా నిధులు, ఆయుధాలను తీసుకుంటూ ఉంటుందని చెప్పుకొచ్చారు. ‘‘పాక్‌కు సాయం కావాల్సి వచ్చినప్పుడు అమెరికా ముందు సాగిలపడుతుంది. ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది కాబట్టి మళ్లీ అమెరికాను తిట్టిపోస్తోంది’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు.


పొరుగు దేశంపై ద్వేషం చిమ్మడమే విదేశాంగ విధానంగా పెట్టుకున్న ఓ దేశ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచిత్రమే అని కొందరు అన్నారు. మరికొందరు మాత్రం పాక్ మంత్రి వ్యాఖ్యలను సమర్థించారు. అమెరికా నిజస్వరూపం ఇదేనని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Also Read:

ఎస్-400 లాంటి ఫవర్‌ఫుల్ గగనతల రక్షణ వ్యవస్థలు ఇవే..

RBI: పాకిస్థాన్, గల్ఫ్ దేశాలకు సాయం చేసిన ఆర్బీఐ.. ఎందుకంటే..

Read Latest and International News

Updated Date - May 25 , 2025 | 11:02 AM