China On Lipulekh Dispute: భారత్‌పై నేపాల్ అభ్యంతరం.. ఊహించని సమాధానమిచ్చిన చైనా
ABN , Publish Date - Sep 06 , 2025 | 09:09 PM
సరిహద్దు ప్రాంతమైన లిపూలేఖ్ పాస్ మీదుగా భారత్‌తో వాణిజ్యం ప్రారంభించడంపై నేపాల్ లేవనెత్తిన అభ్యంతరాలను చైనా తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. ఇది భారత్, నేపాల్‌కు చెందిన ద్వైపాక్షిక అంశమని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పేర్కొన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్, నేపాల్ సరిహద్దులో ఉన్న లిపూలేఖ్ ప్రాంతంపై వివాదం ద్వైపాక్షిక అంశమని చైనా తేల్చి చెప్పింది. అది ఇరు దేశాలు చర్చించి తేల్చుకోవాల్సిన అంశమని స్పష్టం చేసింది. ఈ మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీకి స్పష్టం చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి (China rejects Nepal border complaint).
షాంఘాయ్ సహకార సదస్సులో పాల్గొనేందుకు నేపాల్ ప్రధాని ఇటీవల చైనాకు వెళ్లారు. ఈ సందర్భంగా శనివారం చైనా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చల్లో కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన లిపూలేఖ్ ప్రస్తావన తెచ్చారు. లిపూలేఖ్ మీదుగా భారత్‌తో చైనా వాణిజ్యం ప్రారంభించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. లిపూలేఖ్ ప్రాంతం తమ భూభాగమని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, జిన్‌పింగ్ మాత్రం నేపాల్ ప్రధాని వాదనలను తోసి పుచ్చారట. ఇది నేపాల్, భారత్‌కు సంబంధించిన ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేశారట.
అయితే, ఈ విషయమై బీజింగ్‌లోని నేపాల్ ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది. లిపూలేఖ్ పాస్ మీదుగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడంపై తమ అభ్యంతరాలను ప్రధాని ఓలీ చైనా అధ్యక్షుడితో ప్రస్తావించారని పేర్కొంది. గతనెలలో చైనా విదేశాంగ శాఖ మంత్రి భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాలు సరిహద్దు మీదుగా వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే.
లిపూలేఖ్ ప్రాంతం తమదని నేపాల్ చెబుతోంది. ఈ భూభాగాన్ని తమ ప్రాంతంగా చూపిస్తూ ఇటీవల పార్లమెంటులో కొత్త మ్యాపును ఆవిష్కరించి దౌత్య వివాదాన్ని రాజేసింది. అయితే, భారత్ మాత్రం నేపాల్ చర్యలను తప్పుబట్టింది. కృత్రిమ చర్యలతో వాస్తవాన్ని మార్చలేరని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
ట్రంప్ ‘ఫ్రెండ్స్’ కామెంట్స్‌పై స్పందించిన మోదీ.. ఎక్స్ వేదికగా రిప్లై
ఖలిస్థానీ గ్రూప్స్‌కు కెనడాలో నిధులు.. కీలక నివేదికలో వెల్లడి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి