Share News

Khalistani Extremist Funding: ఖలిస్థానీ గ్రూప్స్‌కు కెనడాలో నిధులు.. కీలక నివేదికలో వెల్లడి

ABN , Publish Date - Sep 06 , 2025 | 07:52 PM

ఖలిస్థానీ గ్రూపులు కెనడాలో నిధులు సమీకరిస్తున్న విషయం అక్కడి ఆర్థిక శాఖ విడుదల చేసిన అధికారిక నివేదికలో వెల్లడైంది. ఈ గ్రూపులు రాజకీయ లక్ష్యాల కోసం హింసను ప్రోత్సహిస్తున్నాయని అక్కడి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినట్టు నివేదికలో పేర్కొన్నారు.

Khalistani Extremist Funding: ఖలిస్థానీ గ్రూప్స్‌కు కెనడాలో నిధులు.. కీలక నివేదికలో వెల్లడి
Khalistani Extremist Funding Canada

ఇంటర్నెట్ డెస్క్: కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాద గ్రూపులు చెలరేగి పోతున్నాయని భారత్ ఎప్పటి నుంచో చేస్తున్న ఆరోపణలు వాస్తవమేనని కెనడా ఎట్టకేలకు అంగీకరించింది. తమ దేశంలో ఖలిస్థానీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తూ, నిధులు పొందుతున్నాయని కెనడా ఆర్థికశాఖ విడుదల చేసిన ఓ నివేదికలో తాజాగా వెల్లడైంది. ఖలిస్థానీ గ్రూపులను ఉగ్రవాద సంస్థలుగా ఈ నివేదికలో పేర్కొన్నారు. రాజకీయ లక్ష్యాల కోసం హింసను ప్రేరేపిస్తున్నారని స్పష్టం చేశారు (khalistani extremist funding).

‘కెనడా క్రిమినల్ కోడ్‌ జాబితాలో చేర్చిన హమాస్, హెజ్బొల్లా, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్ వంటి ఖలిస్థానీ అతివాద టెర్రరిస్టు గ్రూపులు కెనడాలో నిధులు సేకరిస్తున్నట్టు ఇంటెలిజెన్స్, పోలీసు వర్గాలు గుర్తించాయి’ అని నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం, ఉగ్ర సంస్థలు గతంలో కెనడాలోని తమ భారీ నెట్‌వర్క్‌ల సాయంతో నిధులు పొందేవి. ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గింది. కొద్ది మంది వ్యక్తుల ద్వారా నిధుల సమీకరణ జరుగుతోంది (Canada finance report 2025).


ఖలిస్థానీ సంస్థలు చాలా కాలంగా విదేశాల నుంచి నిధుల సమీకరిస్తున్నాయి. ఎన్జీఓల ద్వారా నిధులు పొందుతున్నాయి. అయితే, వాటి ఆదాయ వనరుల్లో వీటి వాటా స్వల్పమే. క్రిమినల్ కార్యకలాపాలు కూడా ఈ గ్రూపులకు ఓ ఆదాయ వనరని నివేదిక తేల్చింది. బ్యాకింగ్, క్రిప్టోకరెన్సీ, ప్రభుత్వ సాయం, ఎన్జీఓలు తదితర వ్యవస్థలను ఖలిస్థానీ గ్రూపులు దుర్వినియోగ పరిచి నిధులు పొందుతున్నాయి.

కెనడాలో ఖలిస్థానీ కార్యకలాపాల గురించి భారత్ ఎప్పటి నుంచో అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది. ఒక దశలో ఇది ఇరు దేశాల మధ్య దౌత్య వివాదానికి కారణమైంది. కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత ఏజెంట్ల పాత్ర ఉందని అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఈ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

ట్రంప్ ‘ఫ్రెండ్స్’ కామెంట్స్‌పై స్పందించిన మోదీ.. ఎక్స్ వేదికగా రిప్లై

గూగుల్ కంపెనీపై భారీ ఫైన్.. ఈయూకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 06 , 2025 | 07:57 PM