India China Relations: భారత్, చైనా కలిసి పనిచేయాలి
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:46 AM
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచాలంటే భారత్, చైనా కలిసి పనిచేయడం అవసరమని ప్రధాని మోదీ చెప్పారు. పరస్పర గౌరవం, ప్రయోజనం, సున్నితత్వం ఆధారంగా ...
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు ఇది అవసరం
జపాన్ మీడియాతో ఇంటర్వ్యూలో మోదీ వ్యాఖ్యలు
మేకిన్ ఇండియా కోసం రండి.. ప్రపంచం కోసం
తయారు చేయండి.. పెట్టుబడులకు గమ్యం భారత్
భారత్-జపాన్ ఆర్థిక సదస్సులో ప్రధాని మోదీ
భారత్‌లో పదేళ్లలో రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులే
జపాన్ లక్ష్యం.. ఇరుదేశాల కీలక ఒప్పందాలు
టోక్యో, ఆగస్టు 29: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచాలంటే భారత్, చైనా కలిసి పనిచేయడం అవసరమని ప్రధాని మోదీ చెప్పారు. పరస్పర గౌరవం, ప్రయోజనం, సున్నితత్వం ఆధారంగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, దీర్ఘకాలిక సంబంధాలను పెంపొందించుకునేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ వెళ్లిన మోదీ.. శుక్రవారం స్థానిక పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్, చైనాలు ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలని గుర్తుచేశారు. రెండు దేశాల మధ్య స్థిరమైన, బలమైన బంధాలు ఉండాలని.. ఆ ప్రభావం ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, సౌభ్రాతృత్వంపైనా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చైనాతో సంబంధాలు మెరుగుపర్చుకోవడంపై అడిగిన ప్రశ్నకు మోదీ స్పందిస్తూ..
‘‘చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు షాంఘై సహకారం సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనడానికి తియాంజిన్ వెళ్తున్నా. గత ఏడాది కజాన్‌లో జిన్‌పింగ్‌తో సమావేశం అయ్యాను. అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాల్లో స్థిరమైన, సానుకూల పురోగతి ఉంది’’ అని చెప్పారు. ఇరుదేశాల మధ్య దృఢమైన బంధం ఆసియాకే గాక యావత్ ప్రపంచానికే కీలకమని వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అస్థిరంగా ఉందని.. ఈ పరిస్థితుల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారత్, చైనా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. జపాన్ ప్రభుత్వ ‘స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో-పసిఫిక్’ విధానంపై స్పందిస్తూ.. ఈ విధానానికి, భారత్ ‘విజన్ మహాసాగర్’కు సారూప్యత ఉందని మోదీ చెప్పారు.

ప్రపంచం కోసం తయారు చేయండి..
ప్రధాని మోదీ భారత్-జపాన్ సంయుక్త ఆర్థిక సదస్సులో ప్రసంగిస్తూ.. మేకిన్ ఇండియా కోసం రావాలని, ప్రపంచం కోసం తయారీ చేపట్టాలని వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు. సెమీ కండక్టర్ పరిశ్రమల నుంచి స్టార్ట్‌పల వరకూ భారత్‌కు జపాన్ అత్యంత కీలక భాగస్వామిగా ఉందని చెప్పారు. జపాన్ సంస్థలు భారత్‌లో రూ.3.50 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టాయని గుర్తుచేశారు. ‘‘ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది’’ అని మోదీ పేర్కొన్నారు. జపాన్ సాంకేతికత, భారతీయుల ప్రతిభ కలిస్తే ఈ శతాబ్దపు సాంకేతిక విప్లవాన్ని ముందుకు నడిపించగలవని అన్నారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు భారత్, జపాన్‌ల మధ్య ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అని ప్రధాని మోదీ చెప్పారు. మరికొన్ని ఏళ్లలోనే రైలు సేవలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. మరోవైపు, చంద్రుడిపై పరిశోధనల కోసం చేపడుతున్న చంద్రయాన్-5 మిషన్ కోసం జపాన్‌తో కలిసి పనిచేయనున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఇందుకోసం ఇరుదేశాల అంతరిక్ష సంస్థలు ఇస్రో, జాక్సాల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిపారు.
పదేళ్లలో రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు..
భారత్‌లో రాబోయే పదేళ్లలో దాదాపు రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని జపాన్ లక్ష్యంగా పెట్టుకుంది. కీలక గనులు, రక్షణ, సాంకేతిక రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మోదీ తెలిపారు. ఏఐ, సెమీ కండక్టర్లు, బుల్లెట్ రైలు, స్వచ్ఛ ఇంధనం, టెలికం, ఫార్మా, సరికొత్త, అధునాతన సాంకేతికత తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య 13 ఒప్పందాలు జరిగాయి.

చైనాలో జిన్‌పింగ్, పుతిన్‌తో భేటీ
జపాన్ పర్యటనను ముగించుకొని మోదీ చైనా వెళ్లనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబరు 1న తియాంజిన్‌లో జరిగే ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొంటారు. అక్కడ జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత మోదీ చైనా పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి. మరోవైపు, రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం మోదీతో సమావేశమనున్నట్లు క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. అలాగే, డిసెంబరులో పుతిన్ భారత్‌లో పర్యటించనున్నారు. రష్యా చమురును కొంటున్నందుకే ట్రంప్ భారత్‌పై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..