James Fishback: ఆ రోజు సూర్యుడు అస్తమించే లోపు హెచ్-1బీ ఉద్యోగులందరినీ తొలగిస్తా: అమెరికన్ ఇన్వెస్టర్ జేమ్స్ ఫిష్‌బ్యాక్
ABN , Publish Date - Nov 18 , 2025 | 04:34 PM
తాను గవర్నర్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజు సాయంత్రానికల్లా ఫ్లోరిడా ప్రభుత్వ శాఖల్లో పని చేస్తు్న్న హెచ్-1బీ వీసాదారులందరినీ తొలగిస్తానని అమెరికన్ ఇన్వెస్టర్ జేమ్స్ ఫిష్‌బర్న్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట సంచలనంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో హెచ్-1బీ వీసా వ్యవస్థపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో డోజ్ శాఖ మాజీ ఉద్యోగి, ఇన్వెస్టర్ జేమ్స్ ఫిష్‌బ్యాక్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఫ్లోరిడా గవర్నర్ అయితే ప్రభుత్వంలో పని చేస్తున్న హెచ్-1బీ వీసాదారులందరినీ తొలగిస్తానని అన్నారు. తను పదవి చేపట్టిన తొలి రోజు సూర్యాస్తమయంలోపు ప్రతి ఒక్క హెచ్-1బీ వీసాదారుడినీ తొలగిస్తానని ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు (James Fishback on H-1b Firing).
సంప్రదాయ రాజకీయ వాదిగా పేరున్న ఫిష్‌బ్యాక్ వచ్చే ఏడాది ఫ్లోరిడా గవర్నర్ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో హెచ్-1బీ వీసా విధానంపై ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికా కంపెనీలకు విదేశీ నిపుణుల అవసరం లేదని చెప్పారు. ఓవైపు లక్షల కొద్దీ అమెరికన్లు నిరుద్యోగులుగా ఉంటున్నా.. అమెరికన్ కంపెనీలు మాత్రం తమ వద్ద ఉద్యోగ ఖాళీలను దాచిపెడుతున్నాయని ఆరోపించారు. అమెరికా చరిత్రలో తదుపరి అధ్యాయాన్ని అమెరికా పౌరులే లిఖించాలని వ్యాఖ్యానించారు. అమెరికాకు విదేశీ నిపుణుల అవసరం ఉందని ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్ చేసిన నేపథ్యంలో ఫిష్‌బ్యాక్ వైఖరి చర్చనీయాంశంగా మారింది (Florida Governor Elections).
1995లో జన్మించిన ఫిష్‌బ్యాక్ జార్జి టౌన్ యూనివర్సిటీకి చెందిన వాల్ష్ స్కూల్ ఆఫ్ ఫారిన్ సర్వీస్‌లో ఇంటర్నేషనల్ ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశారు. 2023లో మరో వ్యక్తితో కలిసి ఆరిజోనా పార్ట్‌నర్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ట్రంప్ నివాసం మార్-ఏ-లాగోలో ఈ సంస్థ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏకంగా ట్రంప్ కూడా పాల్గొనడంతో ఫిష్‌బ్యాక్ పాప్యులారిటీ అమాంతం పెరిగిపోయింది. అమెరికాలో విదేశీ ఉద్యుగులపై నిత్యం విమర్శలు గుప్పించే జేమ్స్.. ట్రంప్ మద్దతుదారుల్లో క్రమంగా పాప్యులారిటీ పెంచుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
గ్రీన్ కార్డు జారీ మరింత కఠినతరం.. నిషేధిత జాబితాలోని వారి కోసం త్వరలో కొత్త రూల్స్?
ట్రంప్ కటాక్షం కోసం లాబీయింగ్.. పాక్ ఎంత ఖర్చు పెట్టిందో తెలిస్తే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి