US Travel Ban: గ్రీన్ కార్డు జారీ మరింత కఠినతరం.. నిషేధిత జాబితాలోని వారి కోసం త్వరలో కొత్త రూల్స్?
ABN , Publish Date - Nov 16 , 2025 | 08:16 PM
అమెరికా నిషేధిత జాబితాలోని 12 దేశాల జనాలపై మరిన్ని ఆంక్షలకు ట్రంప్ సర్కారు సిద్ధమవుతోంది. నిషేధానికి ముందే అమెరికాకు వచ్చిన ఆయా దేశాల వారికి గ్రీన్ కార్డులు, ఇతర వీసాల జారీ మరింత కష్టతరంగా మార్చేలా కొత్త విధానంపై కసరత్తు చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: పన్నెండు దేశాల వారిపై అమెరికాకు రాకుండా నిషేధం విధించిన ట్రంప్ సర్కారు.. మరిన్ని ఆంక్షలకు సిద్ధమవుతోంది. నిషేధానికి ముందే అమెరికాకు వచ్చిన ఆయా దేశాల వారికి గ్రీన్ కార్డులు, ఇతర అనుమతుల జారీని మరింత కఠినతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది (US Stricter Visa Rules- Travel Ban Countries).
అఫ్గానిస్తాన్, ఛాడ్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎరీట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, మయాన్మార్, సొమాలీయా, సుడాన్, యెమన్ దేశాల వారు అమెరికాకు రాకుండా జూన్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిషేధం విధించారు. ఇక బురుండీ, క్యూబా, లావోస్, సియెరా లియోన్, టోగో, తుర్క్‌మెనిస్థాన్, వెనిజువేలా, దేశాలపై పాక్షిక ఆంక్షలు విధించారు (Travel Ban on 12 Countries). ఆయా దేశాల వారికి గ్రీన్ కార్డుతో పాటు కొన్ని రకాల ఇతర వీసాలు జారీ చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. నిషేధిత దేశాల్లో పాస్‌పోర్టు, ఇతర డాక్యుమెంట్స్ విశ్వసనీయత సందేహాస్పదంగా ఉందంటూ ఈ ఆంక్షలు విధించింది. అయితే, కొన్ని మినహాయింపులు కూడా ప్రకటించింది. అప్పటికే వీసాలతో అమెరికాలో ఉంటున్న నిషేధిత దేశాల వారికి, గ్రీన్ కార్డు ఉన్న వారికి, ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు రానున్న క్రీడాకారులకు ఈ నిషేధం వర్తించదని పేర్కొంది.
వలసలను మరింత తగ్గించే క్రమంలో తాజాగా ట్రంప్ సర్కారు నిషేధిత దేశాల ప్రజలపై దృష్టి సారించింది. ఇప్పటికే అమెరికాలో ఉంటున్న ఆయా దేశాల జనాలకు గ్రీన్ కార్డులు, ఇతర వీసా సంబంధిత అనుమతులు జారీపై మరిన్ని పరిమితులకు సిద్ధమైంది. వీసా జారీ విషయంలో ఆయా దేశాల్లోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు జారీ చేయాలని ట్రంప్ సర్కారు యోచిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఈ విధానంపై విమర్శలు మొదలయ్యాయి. చట్టబద్ధంగా దేశంలోకి వచ్చిన వారిని కూడా చిక్కుల్లోకి నెట్టేలా తాజా నిబంధనలు ఉన్నాయని నిపుణులు విమర్శిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ట్రంప్ కటాక్షం కోసం లాబీయింగ్.. పాక్ ఎంత ఖర్చు పెట్టిందో తెలిస్తే..
చైనాలో నేపాల్ కరెన్సీ నోట్ల ప్రింటింగ్.. 17 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి