Georgia Shooter: కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావంతోనే కాల్పులు జరిపా : జార్జియా షూటర్ వింత వివరణ
ABN , Publish Date - Aug 10 , 2025 | 03:44 PM
అమెరికా జార్జియాలో అనేక రౌండ్లు కాల్పులు జరిపి ఒక పోలీస్ అధికారి చావుకు కారణమైన కిరాతకుడు ఇప్పుడు వింత వాదన చేస్తున్నాడు. తన మానసిక స్థితి ఇలా అవ్వడానికి కొవిడ్-19 వ్యాక్సిన్ కారణమంటూ...
ఇంటర్నెట్ డెస్క్ : అమెరికాలోని జార్జియాలో ఉన్న 'యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' ప్రధాన కార్యాలయం పై అనేక రౌండ్లు కాల్పులు జరిపిన కిరాతకుడు ఇప్పుడు వింత వాదన చేస్తున్నాడు. తన మానసిక స్థితి ఇలా అవ్వడానికి కొవిడ్-19 వ్యాక్సిన్ కారణమంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. సదరు షూటర్, కోవిడ్-19 వ్యాక్సిన్ తనను తీవ్ర నిరాశకు, ఆత్మహత్యకు ఉసి గొల్పిందని చెబుతున్నాడని స్థానిక అసోసియేటెడ్ ప్రెస్‌కు ఒక లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి తెలిపారు.
ఇలా ఉండగా, 30 ఏళ్ల పాట్రిక్ జోసెఫ్ వైట్ అనే షూటర్ తుపాకులు చేతపట్టి శుక్రవారం సాయంత్రం అట్లాంటాలోని సిడిసి ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. గార్డులు అతన్ని ఆపివేసే ప్రయత్నం చేశారు. దీంతో అతను ఎదురుగా ఉన్న ఒక ఫార్మసీలోకి ప్రవేశించి చాలా రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో అట్లాంటాలోని డిసీజ్ కంట్రోల్ కార్యాలయంలో ఉన్న ఒక పోలీస్ అధికారి ఈ కాల్పుల్లో చనిపోగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సదరు షూటర్ దగ్గర ఒక పొడవాటి తుపాకీతో పాటు, మరో నాలుగు షార్ట్ గన్స్ ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.

కాగా, కాల్పులకు తెగబడ్డ వ్యక్తి పేరు పాట్రిక్ జోసెఫ్ వైట్. కెన్నెసా నివాసి. జార్జియా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ వ్యక్తిని గుర్తించింది. అతడ్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టింది. తన చర్యలకు కోవిడ్-19 వ్యాక్సిన్‌తో సంబంధం ఉందని దుండగుడు ఆరోపిస్తున్నప్పటికీ ఈ వాదనలపై అధికారిక ధ్రువీకరణ లేదు. ఇంకా ఈ ఘటన వెనుకున్న కచ్చితమైన ఉద్దేశాలు ఇంకా తెలియరాలేదు. అయితే, ఈ ఘటన స్థానికుల్ని షాక్‌కు గురిచేసింది. కొవిడ్ వ్యాక్సిన్‌లపై ఉన్న వివాదాస్పద వ్యాఖ్యలకు మరింత ఊతమిచ్చినట్టైంది.
ఇప్పటికే వ్యాక్సిన్‌ల పై ఉన్న అపోహల నేపథ్యంలో, ఈ రకమైన ఘటనలకు వ్యాక్సిన్లు ఎలా దోహదం చేస్తాయనే దానిపై చర్చలు మరింత విస్తృతమయ్యాయి. దీంతో అధికారులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇది.. సమాజంలో భద్రత, మానసిక ఆరోగ్యం గురించిన ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఈ ఘటన వ్యాక్సిన్‌లపై ప్రజల విశ్వాసాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఇలాంటి మాటలు నమ్మవద్దని అధికారులు సలహా ఇస్తున్నారు. ప్రజలు వ్యాక్సిన్ల విషయంలో నమ్మదగిన సమాచార వనరులపై మాత్రమే ఆధారపడమని కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పలు రైళ్లు రద్దు.. గమ్యాల కుదింపు
డాలర్ డ్రీమ్స్‌తోపాటు జీవన నైపుణ్యాలు అవసరం
For More AP News and Telugu News