Trump Pic In Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ ఫొటో మళ్లీ ప్రత్యక్షం
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:49 PM
అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇందులో తొలుత ట్రంప్ ఫొటో మాయమవ్వగా.. మరలా ఇప్పుడు ప్రత్యక్షమైంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ఎప్‌స్టీన్ ఫైళ్లలో(Epstein Files) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) చిత్రాలు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. ఎప్‌స్టీన్ కుంభకోణానికి సంబంధించి సుమారు 16 ఫైళ్ల వరకూ అదృశ్యమయ్యాయని ఇటీవల పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. వీటిలో న్యాయశాఖ వెబ్ పేజీ నుంచి డొనాల్డ్ ట్రంప్ సహా కొన్ని ఫొటోలు, డాక్యుమెంట్లు అదృశ్యమయ్యాయి. ముఖ్యంగా ట్రంప్ సతీమణి మెలానియా(Melania).. ఎప్‌స్టీన్, ఆయన సహాయకురాలు గిస్లేన్ మ్యాక్స్‌వెల్‌తో దిగిన చిత్రం, ట్రంప్.. కొందరు అమ్మాయిలతో దిగిన ఫొటోలు మాయమయ్యాయి.
దీంతో డెమోక్రటిక్ పార్టీ(Democratic Party) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ట్రంప్‌ను రక్షించే ప్రయత్నంలో భాగంగానే ఈ రకంగా చేశారని డెమోక్రాట్లు ఆరోపించారు. అటు హౌస్ మైనారిటీ లీడర్ హకీమ్ జెఫ్రీన్ కూడా ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఫొటోను పున: ప్రత్యక్షమయ్యేలా చేసింది న్యాయ విభాగం.
అయితే.. ఆ పిక్ తొలగింపు వెనుక ఎవరి ప్రమేయమూ లేదని న్యాయశాఖ తెలిపింది. కేవలం రివ్యూ కోసమే తాత్కాలికంగా ట్రంప్ ఫొటోను తొలగించినట్టు పేర్కొంది. సమీక్ష అనంతరం ఆ ఫొటోల్లో ఎప్‌స్టీన్ బాధితులెవరూ లేరని తేలడంతో మరలా జోడించినట్టు వివరించింది. ఈ కేసులో బాధితులను రక్షించేందుకు మాత్రమే చట్టం ప్రకారం.. తాము ఫైళ్లలో సవరణలు చేస్తున్నట్టు, ఇందులో రాజకీయ నాయకులకు సంబంధించిన ఎవరి పేర్లనూ తొలిగించడం లేదని స్పష్టం చేసింది.
ఏంటీ ఎప్‌స్టీన్ స్టోరీ.?
ప్రముఖ ఇన్వెస్టర్‌గా గుర్తింపు పొందిన జెఫ్రీ ఎప్‌స్టీన్(Jeffrey Epstein)కు డొనాల్డ్ ట్రంప్, బిల్‌గేట్స్(Bill gates), బిల్‌క్లింటన్(Bill Clinton), మైకేల్ జాక్సన్(Micheal Jackson) సహా పలువురు ప్రముఖులతో మంచి సంబంధాలుండేవి. అయితే.. వారిలో కొందరికి ఎప్‌స్టీన్.. అమ్మాయిలను సరఫరా చేస్తుండేవారని అప్పట్లో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. మీటూ ఉద్యమ సమయంలో ఆయన అరెస్ట్ అయ్యారు. దాంతో అప్పుడు సంచలన విషయాలు బయటపడే అవకాశముందని అందరూ భావించారు. కానీ, 2019 ఆయన జైల్లో అనుమానాస్పదంగా మృతిచెందడంతో.. ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం యూఎస్ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
ట్రంప్ హయాంలోనే ఈ ఫైళ్లు బయటకు వస్తాయని భావించినా.. అలా జరగలేదు. అయితే.. ఈ విషయంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, ఇటీవల ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు ఆ ఫైల్స్ విడుదలయ్యాయి. వీటిలో ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫొటోలు, ఇంటర్వ్యూ డాక్యుమెంట్లు, కోర్ట్ పత్రాలు మొదలగునవి ఉన్నాయి. అయితే.. ఈ ఫైళ్లకు సంబంధించి ఇంకా సుమారు లక్ష పేజీలు పెండింగ్‌లో ఉన్నాయని.. సమీక్ష ముగిశాక అన్ని వివరాలను యథాతథంగా ప్రచురిస్తామని న్యాయ శాఖ వెల్లడించింది.
ఇవీ చదవండి: