Withdrawl from NATO: నాటో కూటమి నుంచి అమెరికా తప్పుకునేందుకు ఇదే సరైన సమయం: ఎలాన్ మస్క్
ABN , Publish Date - Mar 03 , 2025 | 10:59 AM
నాటో, ఐక్యరాజ్యసమితి నుంచి అమెరికా తప్పుకోవాలని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు ఆయన ఈ మేరకు మద్దతు తెలిపారు.

ఇంటర్నెట్ డెస్క్: నాటో కూటమి, ఐక్యరాజ్య సమితి నుంచి అమెరికా తప్పుకోవాలని డోజ్ శాఖ చీఫ్ తాజాగా పేర్కొన్నారు. ఈ కూటముల నుంచి అమెరికా తప్పుకోవాలంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు ఆయన మద్దతు తెలిపారు. అమెరికా ఈ కూటముల నుంచి వైదొలగాలంటూ ఇప్పటికే యూటా సెనటర్ మైక్ లీ పలుమార్లు పేర్కొన్నారు. తాజా వ్యాఖ్యలతో మస్క్ కూడా ఆయనతో గళం కలిపినట్టైంది (US Withdrawl From NATO Elon Musk).
రిపబ్లికన్ పార్టీకి చెందిన పలువురు నేతలు పలుమార్లు అమెరికా నాటో నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. తాజాగా ఈ జాబితాలోకి మస్క్ కూడా వచ్చి చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇక రిపబ్లికన్ నేత లీ ఇప్పటికే పలుమార్లు నాటోపై విమర్శలు గుప్పించారు. నాటో వల్ల ఐరోపా దేశాలకే ఉపయోగం కానీ అమెరికాకు వీసమెత్తు ప్రయోజనం కూడా లేదని అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. అమెరికా నిధులతో ఐరోపాకు రక్షణ కలిగించడం మినహా నాటోతో అమెరికాకు ఎటువంటి రక్షణ లేదని అన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన వెంటనే మనం నాటో నుంచి వైదొలగాలి అని కామెంట్ చేశారు.
US Official Language English: అమెరికా అధికారిక భాషగా ఇంగ్లిష్‌ను ప్రకటించిన ట్రంప్
నాటో నుంచి వైదొలగడానికి అనుకూలంగా అమెరికా అధికార పక్షంలో అనేక గళాలు వినిపిస్తుండటంతో ఐరోపాలో తీవ్ర చర్చ మొదలైంది. మరోవైపు, నాటోకోసం ఐరోపా దేశాలు అధిక మొత్తంలో నిధులు సమకూర్చాలని ట్రంప్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఆర్థిక భారం మొత్తం అమెరికా భరించాలని కోరడం సబబు కాదని కుండబద్దలు కొట్టారు.
అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశాక ట్రంప్ తన తొలి ప్రసంగంలోనే నాటోపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ కూటమిని ఆమెరికా కాపాడుతున్నా అమెరికాకు వారు అండగా ఉండట్లేదని అన్నారు. ఐరోపా దేశాలు తమ జీడీపీలో కనీసం 5 శాతాన్ని నాటోకు ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం వారు ఖర్చు చేస్తున్న 2 శాతం నిధులు అసలు ఎంత మాత్రం సరిపోదని అన్నారు. గతేడాది మరో సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ నాటోకు నిధులు సమకూర్చని దేశాలను రష్యా ఏమైనా చేసుకోవచ్చని మరో షాకింగ్ వ్యాఖ్య చేశారు.
ట్రంప్ ఇచ్చిన షాక్ నుంచి రిలీఫ్.. జెలెన్‌స్కీకి మద్దతుగా యూకే
ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ నోట కూడా ఇదేమాట వినబడటంతో అమెరికా నాటో నుంచి వైదొలగుతుందన్న భయాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం నాటోలో 30 ఐరోపా దేశాలతో పాటు అమెరికా కెనడా ఉన్నాయి.
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి