US Official Language English: అమెరికా అధికారిక భాషగా ఇంగ్లిష్‌ను ప్రకటించిన ట్రంప్
ABN , Publish Date - Mar 02 , 2025 | 10:15 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లిష్‌ను అమెరికా అధికారిక భాషగా గుర్తిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: సంచలన నిర్ణయాలకు కేరాఫ్‌గా మారిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లిష్‌ను అమెరికా అధికారిక భాషగా ప్రకటిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులు పొందే ప్రభుత్వ సంస్థలు, శాఖలు.. ఇతర భాషల్లో కూడా సేవలను తప్పనిసరిగా అందించాలన్న గత ప్రభుత్వ ఉత్తర్వులను కూడా ట్రంప్ ఉపసంహరించుకున్నారు. బిల్‌క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో, ఇతర భాషల్లో సేవలు, ఉత్తరప్రత్యుత్తరాలను కొనసాగించాలా వద్దా అన్నది ఆయా సంస్థల విచక్షణాధికారానికి వదిలిపెట్టినట్టైంది (USA Official Language English).
ట్రంప్ ఇచ్చిన షాక్ నుంచి రిలీఫ్.. జెలెన్‌స్కీకి మద్దతుగా యూకే
ఈ నిర్ణయంతో ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర సమాఖ్య ప్రభుత్వం మధ్య సమాచార మార్పిడి మరింత సులభతరం అవుతుందని అమెరికా అధ్యక్షుడు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జాతీయ విలువలు పెంపొంది, అమెరికా సమాజంలో ఐక్యత, సామర్థ్యాలు పెరుగతాయని అన్నారు. ఇంగ్లిష్ వల్ల ఆర్థిక అవకాశాలు అందుబాటులోకి రావడంతో పాటు కొత్త వారు అమెరికా సమాజంలో ఇమిడిపోయేలా చేస్తుందని పేర్కొన్నారు.
ఇప్పటివరకూ అమెరికాకు అధికారిక భాష అంటూ లేదు. విభిన్న సంస్కృతులు, భాషలు, నేపథ్యాలు కలిగిన వ్యక్తుల సమ్మేళనమైన అమెరికాకు ఓ ప్రత్యేక అధికారిక భాష ఉండటం సబబు కాదని అప్పట్లో రాజ్యాంగ నిర్మాతలు భావించారు. అంతేకాకుండా, వ్యక్తిగత స్వేచ్ఛకు అమిత ప్రాధాన్యమిచ్చే అమెరికా సమాజంపై అధికారిక భాషను రుద్దడం హక్కుల ఉల్లంఘనగా భావించారు. సమాఖ్య స్థాయిలో అమెరికాకు అధికారిక భాష లేకపోయినప్పటికీ వివిధ రాష్ట్రాలు ఇప్పటికే ఇంగ్లిష్‌ను తమ అధికారిక భాషగా గుర్తించాయి. మొత్తం 30 రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉంది. ఇక సమాఖ్య స్థాయిలో ఇంగ్లి్ష్‌ను అధికారిక భాషగా ప్రవేశపెట్టేందుకు అమెరికా చట్టసభల్లో పలుమార్లు ప్రయత్నాలు జరిగినా పలు సందర్భాల్లో విఫలమయ్యాయి.
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి