Donald Trump: భారత్-పాక్ యుద్ధాన్ని ఆపినందుకు నోబెల్ బహుమతి పొందలేను
ABN , Publish Date - Jun 21 , 2025 | 11:42 AM
ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ చర్చనీయాంశంగా మారే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఏర్పడిన తీవ్ర ఉద్రిక్తతలను తానే సమర్థవంతంగా తగ్గించానని ఆయన ప్రకటించారు. అలాంటి శాంతి ప్రయత్నాల వల్ల కూడా నోబెల్ శాంతి బహుమతి దక్కదేమోనని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి తన వ్యాఖ్యలతో హాట్ టాపిక్‌గా మారారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఇటీవల తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలను తాను నివారించానని మళ్లీ వ్యాఖ్యానిస్తూ, అందుకు నోబెల్ శాంతి బహుమతి రాదేమోనని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. నేను భారతదేశం, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపాను. అయినా నాకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందో రాదోనని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ వేదికగా పేర్కొన్నారు.

శాంతి ప్రయత్నాలకు కూడా..
ట్రంప్ వ్యాఖ్యల ప్రకారం, ఆయన శాంతిని నెలకొల్పడానికి చేసిన ప్రయత్నాలను ప్రపంచ మీడియా పట్టించుకోలేదని, కానీ ప్రజలకు మాత్రం ఇది తెలుసని అన్నారు. తనకు నోబెల్ శాంతి బహుమతి రాదేమోనని ప్రజలు మద్దతుగా ఉన్నారని, అది తనకు చాలంటూ ట్రంప్ పేర్కొన్నారు. దీంతోపాటు సెర్బియా-కొసోవో మధ్య ఉద్రిక్తతలు, ఈజిప్ట్-ఇథియోపియా మధ్య తలెత్తిన సమస్యలు, మిడిల్ ఈస్ట్‌లో జరిగిన అబ్రహాం ఒప్పందాలు వంటి అనేక శాంతి ప్రయత్నాలకు కూడా తనకు గుర్తింపు రాలేదని ఆయన వెల్లడించారు.
భారత్ క్లారిటీ
మరోవైపు భారత్ మాత్రం అమెరికా జోక్యం అనే మాటను పూర్తిగా ఖండిస్తోంది. ఏప్రిల్ 22న పహల్గాం టెర్రర్ అటాక్ అనంతరం భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితి వచ్చింది. ఆ క్రమంలో మే 10న పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ తన భారతీయ సహచరుడిని సంప్రదించారని, తద్వారా డైరెక్ట్ మిలిటరీ చర్చల ద్వారానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని న్యూఢిల్లీ స్పష్టం చేసింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇటీవల ట్రంప్‌తో ఫోన్ సంభాషణలో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.
పాకిస్థాన్ మాత్రం..
ఇదిలా ఉండగా, పాకిస్థాన్ ప్రభుత్వం ట్రంప్‌ను 2026 నోబెల్ శాంతి బహుమతికి అధికారికంగా సిఫారసు చేసింది. ఇటీవల భారత్-పాకిస్థాన్ మద్య తలెత్తిన సంక్షోభాన్ని నివారించడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని, ఆయన నాయకత్వాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం చెబుతోంది. ఇటీవల ట్రంప్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను వైట్ హౌస్‌లో విందుకు ఆహ్వానించడం, ఈ అంశానికి మరింత ప్రాధాన్యతనిచ్చింది.
ఇవీ చదవండి:
9వ రోజు కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ వార్..దౌత్యం ఎప్పుడు
సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి