Share News

Donald Trump: అక్రమ వలసదారులపై ట్రంప్‌ సర్కారు ఉక్కుపాదం

ABN , Publish Date - Jan 25 , 2025 | 04:21 AM

ట్రంప్‌ యంత్రాంగం ఒక్క జనవరి 23నే.. అమెరికాకు అక్రమంగా వలసవచ్చిన నేరగాళ్లలో 538 మందిని అరెస్టు చేసినట్టు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కారొలిన్‌ లెవిట్‌ ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు.

Donald Trump: అక్రమ వలసదారులపై ట్రంప్‌ సర్కారు ఉక్కుపాదం

538 మంది అరెస్టు.. 373 మంది నిర్బంధం

సైనిక విమానాల్లో వందల మంది డీపోర్టేషన్‌

జన్మతః పౌరసత్వ హక్కు రద్దును నిలిపివేస్తూ

కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేస్తాం: ట్రంప్‌

అమెరికా డీపోర్ట్‌ చేసే భారతీయులను వెనక్కి

తీసుకునేందుకు రెడీ: భారత విదేశాంగ శాఖ

తాను అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసదారులను దేశం నుంచి వెళ్లగొడతానంటూ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన డొనాల్డ్‌ ట్రంప్‌.. పగ్గాలు చేపట్టిన మూడోరోజునే ఆ పని మొదలుపెట్టారు! ట్రంప్‌ యంత్రాంగం ఒక్క జనవరి 23నే.. అమెరికాకు అక్రమంగా వలసవచ్చిన నేరగాళ్లలో 538 మందిని అరెస్టు చేసినట్టు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కారొలిన్‌ లెవిట్‌ ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. అరెస్ట్‌ అయినవాళ్లలో ఒక అనుమానిత ఉగ్రవాది, వెనిజులాకు చెందిన ‘ట్రెన్‌ డి అరాగ్వా’ అనే నేరగాళ్ల ముఠాలోని నలుగురు ప్రముఖ సభ్యులు, మైనర్లపై లైంగికదాడులకు పాల్పడిన పలువురు నేరగాళ్లు ఉన్నట్టు ఆమె వివరించారు. అంతేకాదు.. వందలాది మంది అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో దేశం నుంచి డీపోర్ట్‌ చేసినట్టు (దేశ బహిష్కరణ) పేర్కొన్నారు. ‘‘చరిత్రలోనే అతి పెద్ద బహిష్కరణ ప్రక్రియ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. హామీ ఇచ్చాం. హామీని నిలబెట్టుకుంటున్నాం’’ అని ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తే పర్యవసానాలను అనుభవించక తప్పదనే బలమైన, స్పష్టమైన సందేశాన్ని ట్రంప్‌ ఇస్తున్నారని వెల్లడించారు.

ఈ ఆపరేషన్‌ చేపట్టిన అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) కూడా జనవరి 23న అమెరికాలో 538మంది అక్ర మ వలసదారులను అరెస్టు చేశామని, మరో 373మందిని నిర్బంధించామని ట్వీట్‌ చేసింది. వివిధ దేశాల నుంచి పలు మార్గాల్లో అమెరికాకు వచ్చి అనుమతులు లేకుండా అక్కడ నివసిస్తున్న అక్రమ వలసదారుల సంఖ్య దాదాపు 1.1కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఇక అమెరికా డీపోర్ట్‌ చేసే మెక్సికన్లను ఆదుకోవడానికి ఆ దేశ ప్రభుత్వం ‘మెక్సికో మిమ్మల్ని ఆదుకుంటుంది’ అనే పథకం కింద తమ దేశ సరిహద్దుల్లో 9అత్యవసర షెల్టర్లను ఏర్పాటుచేసింది. అమెరికా తమ దేశానికి పంపే విదేశీయులకు సైతం తాము ఆశ్రయమిస్తామని పేర్కొంది. భారతదేశం కూడా ఈ మాస్‌ డీపోర్టేషన్‌ ఆపరేషన్‌పై స్పందించింది. ‘‘అక్రమ వలసలకు మేం వ్యతిరేకం. అమెరికాలో ఉన్న భారతీయులనే కాదు.. వారు ఏ దేశంలోనైనా ఉండాల్సిన కాలపరిమితికి మించి ఉన్నా, సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్నా వారిని వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వారు భారతీయులని నిర్ధారణ అయితే తిరిగి భారత్‌కు రావడానికి సహకారం అందిస్తాం’’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ తెలిపారు.


అప్పీలు చేస్తాం

జన్మతః పౌరసత్వ హక్కును రద్దుచేస్తూ తాను ఇచ్చిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఫెడరల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. దానిపై తమ యంత్రాంగం అప్పీలు చేస్తుందని గురువారం వైట్‌హౌ్‌సలో మీడియాతో అన్నారు. తన ఉత్తర్వుపై డెమొక్రాట్‌ పాలిత రాష్ట్రాల అటార్నీ జనరళ్లు సియాటెల్‌లో ఒక నిర్ణీత జడ్జి వద్దకు వచ్చేలా వ్యాజ్యం వేసి ఉంటారని, ఆ జడ్జి విషయంలో తనకు ఎలాంటి ఆశ్చర్యమూ లేదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ నెరవేర్చే దిశగా కూడా ట్రంప్‌ నిర్ణ యం తీసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌.కెన్నెడీ, ఆయన సోదరుడు, సెనెటర్‌ రాబర్ట్‌ ఎఫ్‌.కెన్నెడీ, పౌర హక్కుల ఉద్యమనేత మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ హత్యలకు సంబంధించిన ఫైళ్లను బయటపెట్టాల్సిందిగా జాతీ య నిఘా సంస్థ డైరెక్టర్‌, అటార్నీ జనరల్‌ను ఆదేశిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు. దాని ప్రకారం 15రోజుల్లోగా జాన్‌ ఎఫ్‌.కెన్నెడీ హత్యకు సంబంధించిన పత్రాల విడుదలకు సంబంధించిన ప్రణాళికను రూపొందించాలి. 45రోజుల్లోగా మిగతా ఇద్దరి హత్యలకు సంబంధించిన పత్రాల విడుదల ప్రణాళికను రూపొందించాలి. ఈ పత్రాల కోసం ఎంతోమంది ప్రజలు ఎన్నో ఏళ్లుగా, దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారని ట్రంప్‌ పేర్కొన్నారు. ఉత్తర్వుపై సంతకం చేశాఖ ఆ పెన్నును రాబర్ట్‌ ఎఫ్‌.కెన్నెడీ కుమారుడు రాబర్ట్‌ ఎఫ్‌.కెన్నెడీ జూనియర్‌కు జ్ఞాపికగా ఇచ్చారు.

ట్రంపే అధ్యక్షుడై ఉంటే..

‘‘డొనాల్డ్‌ ట్రంపే గనక 2020ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడై ఉంటే.. అప్పట్లో మోసపూరితంగా ఆయన్నుంచి విజయాన్ని లాగేసుకోకుండా ఉండి ఉంటే.. ఉక్రెయిన్‌లో బహుశా 2022లో సంక్షోభం తలెత్తి ఉండేది కాదు’’ అని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తాజాగా వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో చర్చలకు తానెప్పుడూ సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. రష్యన్‌ ప్రభుత్వ రంగ మీడియాతో మాట్లాడిన పుతిన్‌.. అమెరికాకు కొత్తగా అధ్యక్షుడైన ట్రంప్‌ను తెలివైనవాడు, కార్యసాధకుడుగా అభివర్ణించారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించే ఒప్పందం కుదుర్చుకోకుంటే రష్యాపై అధిక పన్నులు, సుంకాలు, ఆంక్షలు విధిస్తానంటూ బుధవారం ట్రంప్‌ హెచ్చరించిన నేపథ్యంలో పుతిన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు.. ఉత్తర అమెరికా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ను కలిసే ఆలోచన ఉన్నట్టు ట్రంప్‌ గురువారం వెల్లడించారు. 2019లో ట్రంప్‌ ఉత్తరకొరియాకు వెళ్లి మరీ కిమ్‌ను కలిసిన సంగతి తెలిసిందే.


ట్రంప్‌ ఈవెంట్‌లో పన్నూ

డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకారం సందర్భంగా నిర్వహించిన ‘ద లిబర్టీ బాల్‌’ ఈవెంట్‌కు ఖలిస్థానీ ఉగ్రవాది గుర్‌పత్వంత్‌సింగ్‌ పన్నూ హాజరు కావడం సంచలనం సృష్టించింది. ఆ కార్యక్రమానికి హాజరైనవారంతా ‘యూఎ్‌సఏ యూఎ్‌సఏ’ అంటూ నినాదాలు చేస్తుండగా.. పన్నూ మాత్రం కెమెరా వైపు తిరిగి ‘ఖలిస్థాన్‌ జిందాబాద్‌’ అంటూ నినదించిన వీడియో వైరల్‌ అవుతోంది. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ స్పందిస్తూ.. భారత వ్యతిరేక కార్యకలాపాలు ఏవి జరిగినా ఆ విషయాన్ని తాము అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. భారత వ్యతిరేక ఎజెండాతో సాగించే కార్యకలాపాలకు సంబంధించిన, దేశభద్రతపై ప్రభావం చూపే అంశాలను అమెరికా వద్ద లేవెనెత్తడాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.

వంద లక్షల కోట్లు!

ట్రంప్‌ సర్కారు చేపట్టిన అక్రమ వలసదారుల మాస్‌ డీపోర్టేషన్‌ భారీ ఖర్చుతో కూడుకున్న పని అని ‘అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ కౌన్సిల్‌’ 2022లో ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం 2022లోనే అందుకు అయ్యే ఖర్చు 1.1 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 1.7 ట్రిలియన్‌ డాలర్ల దాకా ఉంటుందని అందులో పేర్కొంది. ఇప్పటి లెక్కల ప్రకారం ఆ మొత్తం.. దాదాపు రూ.వంద లక్షల కోట్లకు సమానం.


ఇవి కూడా చదవండి..

Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా

Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..

Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 25 , 2025 | 04:21 AM