Share News

Zero Tariff: అమెరికా వస్తువులపై భారత్ సున్నా టారిఫ్..ట్రంప్ సంచలన ప్రకటన

ABN , Publish Date - May 15 , 2025 | 04:31 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాల వివాదం ఇంకా తగ్గడం లేదు. ఎందుకంటే తాజాగా మళ్లీ భారత సుంకాల విషయంలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు ఇండియాలో ఆపిల్ ఉత్పత్తుల విస్తరణ గురించి కూడా ప్రస్తావించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Zero Tariff: అమెరికా వస్తువులపై భారత్ సున్నా టారిఫ్..ట్రంప్ సంచలన ప్రకటన
Zero Tariff US Goods

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం గురించి సుంకాల విషయంలో సంచలన ప్రకటన చేశారు. భారతదేశం అమెరికాకు జీరో టారిఫ్ (Zero Tariff) ట్రేడ్ ఒప్పందాన్ని అందిస్తుందని ఆయన అన్నారు. కానీ ఈ విషయంలో భారతదేశం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ట్రంప్ ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాల పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో ఖతార్ రాజధాని దోహాలో వ్యాపారవేత్తల ప్రతినిధి బృందంతో జరిగిన చర్చలో ఈ విషయాన్ని తెలిపారు. అమెరికా వస్తువులపై సుంకాలను తొలగించడానికి భారతదేశం ముందుకొచ్చిందని ట్రంప్ అన్నారు. ఈ క్రమంలో భారతదేశంలో ఏదైనా అమ్మడం చాలా కష్టమని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు.


రెండు దేశాల మధ్య..

ఇదే సమయంలో భారతదేశం, పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ గురించి కూడా ప్రస్తావించారు. విరమణ లేకుంటే రెండు దేశాలతో వాణిజ్యాన్ని నిలిపివేస్తామన్నామని, ఆ తర్వాత వారు కాల్పుల విరమణకు అంగీకరించారని పేర్కొన్నారు. దీంతోపాటు ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో మాట్లాడానని, భారతదేశంలో ఆపిల్ ఉత్పత్తిని విస్తరించవద్దని కోరానని ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలతో భారత పెట్టుబడిదారులు, ప్రజలు నిరాశ చెందారు. భారతదేశం, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటనతో ఈ నిరాశ మరింత పెరిగింది. రెండు దేశాల మధ్య సైనిక సంఘర్షణను నివారించడానికి రాజీ మార్గంగా వాణిజ్యాన్ని ఉపయోగించడం భారతదేశంలో ఎవరికీ ఇష్టం లేదు.


భారతదేశంలో ఆపిల్ పరిస్థితి

అమెరికా సుంకాలపై పలు దేశాలతో ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆపిల్ భారతదేశంలో తన తయారీ సామర్థ్యాన్ని క్రమంగా విస్తరిస్తోంది. ఆ కంపెనీ ఫాక్స్‌కాన్, విస్ట్రాన్ వంటి తయారీదారుల ద్వారా దేశంలో ఐఫోన్‌లను తయారు చేస్తుంది. ఈ ప్రయత్నాలు ఎలక్ట్రానిక్స్‌లో మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. కానీ ట్రంప్ తాజా ప్రకటనలు దీనిపై సంక్షోభం ఏర్పడేలా చేస్తున్నాయి.


చర్చల కోసం..

ఈ క్రమంలోనే భారత వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ మే 17 నుంచి 20 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో భారత్ సుంకాల విషయంపై చర్చించనున్నారు. ఏప్రిల్ 2న ట్రంప్ దాదాపు 60 దేశాలపై సుంకాలు విధించారు. ఇందులో భారతదేశం కూడా ఉంది, ఇండియాపై 26 శాతం సుంకం విధించారు. అయితే, ఏప్రిల్ 10న ట్రంప్ చైనా మినహా అన్ని దేశాలపై సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేశారు. భారతదేశం ఇప్పుడు అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రయత్నాలలో నిమగ్నమై ఉంది. ఈ సుంకాల వివాదం అలాగే కొనసాగితే వాణిజ్య యుద్ధం వచ్చే ఛాన్సుంది.


Also Read:

ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్..ఏ ఎగ్జామ్ ఎప్పుడుందో తెలుసా..

చైనాకు బుద్ధి చెప్పిన భారత్

గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 15 , 2025 | 04:34 PM