Israel: భీకర యుద్ధం
ABN , Publish Date - Jun 20 , 2025 | 03:20 AM
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకరంగా మారుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం కడపటి వార్తలందేవరకు ఇరు దేశాల్లో యుద్ధ నష్టాలతో బీభత్సం కనిపించింది...
ఇజ్రాయెల్ ఆస్పత్రి, స్టాక్ ఎక్స్‌చేంజ్ భవనంపై ఇరాన్ క్షిపణులు
టెల్‌అవీవ్ శివార్లలో నష్టం.. ఒక్కరోజే 200 మందికి పైగా క్షతగాత్రులు
ఇరాన్‌లోని అరాక్ భారజల ప్లాంట్‌పై ఇజ్రాయెల్ దాడులు
నటాంజ్ అణుకేంద్రంపైనా.. ఇరాన్ క్రిప్టో కరెన్సీ ఎక్స్‌చేంజ్‌పై సైబర్ దాడి
రూ. 785 కోట్లను కొల్లగొట్టిన ఇజ్రాయెల్ హ్యాకర్లు
మిల్లీమీటర్ దూరంలో అణు విధ్వంసం.. రష్యా హెచ్చరిక
ఇరాన్ దాడి భయంతో పశ్చిమాసియాలో అమెరికా వెనక్కి: రాయిటర్స్
టెల్‌అవీవ్/టెహ్రాన్/న్యూఢిల్లీ, జూన్ 19: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకరంగా మారుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం కడపటి వార్తలందేవరకు ఇరు దేశాల్లో యుద్ధ నష్టాలతో బీభత్సం కనిపించింది. ఇజ్రాయెల్‌లోని మౌలిక సదుపాయాలే టార్గెట్‌గా ఇరాన్.. అణు కార్యక్రమాలు, క్షిపణి యూనిట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ పరస్పరం క్షిపణి దాడులు జరిపాయి. ఇరాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్‌లోని బీర్షేబాలో ఉన్న అతిపెద్ద(వెయ్యి పడకలు) ఆస్పత్రి సోరొకా దెబ్బతింది. బుధవారం ఈ ఆస్పత్రిలోని ఒక భాగం(సర్జికల్ బ్లాక్)లో ఉన్న రోగులను ఇజ్రాయెల్ ప్రభుత్వం వేరే బ్లాకుకు తరలించింది. సరిగ్గా ఖాళీ చేసిన బ్లాక్‌పై ఇరాన్ క్షిపణులు పడ్డట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) వెల్లడించింది. ఈ ఆస్పత్రిలో 45 మంది గాయాలపాలవ్వగా.. వేర్వేరు ప్రాంతాల్లో గురువారం జరిగిన దాడుల్లో క్షతగాత్రుల సంఖ్య 200లకు పైగా ఉన్నట్లు వివరించింది. ఆస్పత్రి సమీపంలోని ఓ పాఠశాల, టెల్‌అవీవ్‌లోని ఇజ్రాయెల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ భవనంపైనా ఇరాన్ దాడులు జరిగాయి. జనావాసాలను ఇరాన్ టార్గెట్‌గా చేసుకోవడంతో.. ఇజ్రాయెల్ ప్రతిదాడి చేపట్టింది. అరాక్ భారజల రియాక్టర్ ప్రాంగణంలో పనిచేసే కార్మికులు, పరిసరాల్లో ఉండే పౌరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ పర్షియా భాషలో ఐడీఎఫ్ హెచ్చరికలు జారీ చేసింది. గంట తర్వాత ఇజ్రాయెల్ వైమానికదళం భారజల రియాక్టర్‌పై విరుచుకుపడింది.
టెల్‌అవీవ్‌కు భారీ నష్టం
బుధవారం అర్ధరాత్రి నుంచి ఇరాన్ జరిపిన క్షిపణిదాడుల్లో టెల్‌అవీవ్‌కు భారీ నష్టం జరిగింది. ‘‘గురువారం ఉదయం వరకు ఇరాన్ 30 బాలిస్టిక్ క్షిపణులు, 17 యూఏవీలను ప్రయోగించింది. వాటిల్లో ఒక క్షిపణి క్లస్టర్‌బాంబులను జారవిడిచింది. టెల్‌అవీవ్‌లోని జనావాసాలనే ఇరాన్ టార్గెట్‌గా చేసుకుంటోంది. ఈ భూమ్మీద బతకడానికి ఖమేనీ ఏమాత్రం అర్హుడు కాడు’’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ వ్యాఖ్యానించారు. జనావాసాలు, ఆస్పత్రులను టార్గెట్‌గా చేసుకుంటూ.. ఇరాన్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు. ఇరాన్ క్షిపణులు గుష్‌డాన్, నెగెవ్, రామత్‌గాన్, హోలోన్, టెల్‌అవీవ్ ప్రాంతాలను తాకినట్లు ఐడీఎఫ్ తెలిపింది. ‘‘సోరొకా ఆస్పత్రి, స్టాక్ ఎక్స్‌చేంజ్ భవనాలకు భారీ నష్టం సంభవించింది. టెల్‌అవీవ్, రామత్‌గన్, హోలోన్‌లో జనావాసాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 5 వేల మంది నిరాశ్రయులయ్యారు. క్షతగాత్రుల సంఖ్య 650కి పెరిగింది’’ అని వివరించింది.
టెహ్రాన్‌పై భీకర దాడులు
యుద్ధం ఏడోరోజైన గురువారం ఇరాన్‌లో అరాక్‌లోని భారజల రియాక్టర్ కేంద్రాన్ని, మధ్య, పశ్చిమ టెహ్రాన్‌లలోని ఆయుధ డిపోలు, క్షిపణి లాంచర్లు, ఇతర సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. కరాజ్‌లో వైమానిక స్థావరాలపైనా దాడులు జరిగినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇక ఇజ్రాయెల్ అనుకూల హ్యాకర్ల బృందం ‘ప్రిడేటరీ స్పారో’ ఇరాన్‌లోని అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్‌చేంజ్ ‘నోబిటెక్స్’పై పంజా విసిరి.. రూ.785 కోట్లను కొల్లగొట్టింది. కాగా ఇరాన్‌లో 639 మంది మరణించారని, 1,329 మంది క్షతగాత్రులయ్యారని మానవ హక్కుల సంఘాలు వెల్లడించాయి. ఇరాన్‌లో మూడో రోజూ ఇంటర్నెట్ పనిచేయలేదు. యుద్ధాన్ని కవర్ చేస్తున్న జర్నలిస్టులు సైతం వెబ్ ఎడిషన్లకు అప్‌డేట్స్ ఇవ్వలేకపోయారని తెలుస్తోంది.
బుషెహర్‌లో దాడులను ఆపండి: రష్యా
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో సైనికపరంగా జోక్యం చేసుకోవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రష్యా డిమాండ్ చేసింది. ఇరాన్-ఇజ్రాయెల్ నడుమ మధ్యవర్తిత్వానికి తాను సిద్ధంగా ఉన్నానని పుతిన్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ దీనిపై స్పందిస్తూ.. ముందు రష్యా, ఉక్రెయిన్‌తో మధ్యవర్తిత్వం జరుపుకోవాలని.. తర్వాత దీని గురించి ఆలోచిద్దామని పుతిన్ కు చెప్పినట్టు పేర్కొన్నారు. ఇక ఇరాన్‌పై తమ మిలటరీ దాడికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగా ఆమోదం తెలిపారు. అయితే.. తుది ఉత్తర్వులను ఇంకా విడుదల చేయాల్సి ఉంది. కాగా.. బుషెహర్‌లోని ఇరాన్ అణు విద్యుత్తు కేంద్రంలో రష్యా నిపుణులు, కార్మికులు పనిచేస్తున్నారని, అక్కడ దాడులు వద్దని ఇజ్రాయెల్‌ను రష్యా డిమాండ్ చేసింది. మరోవైపు ఇరాన్ దాడి చేయవచ్చన్న అంచనాల నేపథ్యంలో అమెరికా పశ్చిమాసియాలోని తన బేస్‌లను ఇతర ప్రాంతాలకు తరలిస్తోందంటూ రాయిటర్స్ వార్తాసంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. కాగా, ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్‌కు చెందిన 18 మంది ఏజెంట్లను అరెస్టు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.
టెహ్రాన్ నుంచి భారత్‌కు చేరిన విద్యార్థులు
ఇరాన్‌లో 10వేల మందిదాకా భారత విద్యార్థులు ఉండగా తొలివిడతలో ‘ఆపరేషన్ సింధూ’లో భాగంగా 110 మంది భారత్ చేరుకున్నారు. ఇరాన్ నుంచి రోడ్డు మార్గంలో ఆర్మేనియాకు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ‘‘గగనతలం లో క్షిపణుల వర్షం.. సైరన్ల మోత.. బాంబు పేలుళ్లు..! కళ్ల ముందే దారుణాలు జరిగాయి’’ అని విద్యార్థులు పేర్కొన్నారు.