Malaysia Flu Cases: 6 వేల మంది చిన్నారులకు ఫ్లూ తరహా ఇన్ఫెక్షన్.. మలేషియాలో స్కూళ్ల మూసివేత
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:39 PM
మలేషియాలో చిన్నారులు పెద్ద సంఖ్యలో ఫ్లూ తరహా ఇన్‌ఫ్లేక్షన్ల బారిన పడుతున్నారు. ఏకంగా 6 వేల కేసులు వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం పలు స్కూళ్లకు సెలవులు ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: మలేషియాలో వేల మంది చిన్నారులు ఫ్లూ తరహా వ్యాధి బారినపడటం కలకలానికి దారి తీసింది. కొవిడ్ సంక్షోభం తొలి రోజులను గుర్తుకు తెస్తున్న ఈ పరిణామంతో అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే పలు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. అయితే, ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేందుకు తగిన అనుభవం వైద్య సిబ్బందికి ఉందని అక్కడి వైద్య శాఖ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ ఆజమ్ అహ్మద్ తెలిపారు. ఇన్‌ఫ్లెక్షన్ల వ్యాప్తి నిరోధానికి సంబంధించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా ఫాలో కావాలని స్కూల్ యాజమాన్యాలకు సూచించారు. ఎన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు (Mysterious Flu Cases Rise in Malaysia).
దేశ వైద్య శాఖ సమాచారం ప్రకారం, పలు ప్రాంతాల్లో చిన్నారులు ఫ్లూ తరహా ఇన్‌ఫెక్షన్ల బారిన పడ్డారు. 97 ప్రాంతాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉంది. అంతకుముందుకు 14 ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండగా కేవలం వారం రోజుల్లో ఇన్‌ఫెక్షన్ క్లస్టర్ల సంఖ్య 97కు చేరుకుంది. ఇది చాలదన్నట్టు దేశంలో ఎక్స్‌ఎఫ్‌జీ అనే కొత్త కొవిడ్ వేరియంట్‌ను గుర్తించడంతో జనాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రస్తుత కేసుల్లో 8.2 శాతానికి ఈ వేరియంట్ కారణమని అక్కడి అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ వేరియంట్ వ్యాప్తిని నిశితంగా గమనించాలని డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే ప్రకటించింది. దీన్ని వేరియంట్ ఆఫ్ మానిటరింగ్‌గా వర్గీకరించింది. ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అక్కడ తాజాగా కేసులు పెరగడానికి కారణం తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు
మలేషియాలో ఈ ఏడాది ఇప్పటివరకూ 43 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం తక్కువ. కానీ కొత్త వేరియంట్లు బయటపడుతున్న నేపథ్యంలో మలేషియా ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ల జన్యు క్రమంలో మార్పులను తెలుసుకునేందుకు జీనోమిక్ సర్వేలెన్స్‌ను పెంచింది.
ఇవి కూడా చదవండి:
స్టార్‌షిప్ ప్రయోగం విజయవంతం.. వీడియో వైరల్
మా పాత్ర ఏమీ లేదు.. అప్ఘాన్ ప్రెస్ మీట్‌పై కేంద్రం వివరణ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి