Share News

Xinjiang Tibet Railway: వాస్తవాధీన రేఖకు సమీపంలో భారీ రైల్వే ట్రాక్‌ నిర్మాణానికి చైనా ప్లాన్

ABN , Publish Date - Aug 11 , 2025 | 07:36 PM

జింజియాంగ్ ప్రావిన్స్‌ను టిబెట్‌తో కలుపుతూ చైనా మరో భారీ రైల్వే ప్రాజెక్టుకు సిద్ధమైంది. దాదాపు 5 వేల కిలోమీటర్ల మేర ఉండే ఈ రైల్వే ట్రాక్‌లో కొంత భాగాన్ని వాస్తవాధీన రేఖకు సమీపంలో నిర్మించనున్నారు.

Xinjiang Tibet Railway: వాస్తవాధీన రేఖకు సమీపంలో భారీ రైల్వే ట్రాక్‌ నిర్మాణానికి చైనా ప్లాన్
China Xinjiang Tibet Railway Plan

ఇంటర్నెట్ డెస్క్: చైనాలో జింజియాంగ్ ప్రావిన్స్, టిబెట్‌‌లను అనుసంధానించేందుకు 5 వేల కిలోమీటర్ల మేర భారీ రైల్వే ట్రాక్ నిర్మాణానికి అక్కడి రైల్వే శాఖ సిద్ధమైంది. ఇందులో కొంత భాగాన్ని వాస్తవాధీన రేఖకు సమీపంలో నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జింజియాంగ్‌లోని హోటాన్ నగరం నుంచి టిబెట్‌లోని లాసా వరకూ ఈ రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఈ నిర్మాణపనుల పర్యవేక్షించేందుకు చైనా స్టేట్ రైల్వే గ్రూప్ సంస్థ జింజియాంగ్-టిబెట్ రైల్వే కంపెనీని కూడా ఇటీవలే ఏర్పాటు చేసింది. 13.2 బిలియన్ డాలర్ల మూలధనంతో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. అయితే, ఇది ప్రాజెక్టు పూర్తి ఖర్చు కాదని చైనా మీడియా పేర్కొంది. 2035 కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రైల్వే మార్గంలో కొంత భాగాన్ని వాస్తవాధీన రేఖకు సమీపంలో నిర్మిస్తుండటంతో దీనికి రక్షణ రంగ అవసరాల పరంగా ప్రాధాన్యం ఏర్పడింది.


ఇక జింజియాంగ్ టిబెట్‌ను కలుపుతూ చైనా గతంలో జీ219 పేరిట మెగా హైవేను కూడా నిర్మించింది. భారత భూభాగమైన ఆక్సాయ్‌చిన్‌ మీదుగా ఈ హైవేను నిర్మించారు. 1962 నాటి భారత్ చైనా యుద్ధానికి ఈ హైవే కూడా ఓ కారణమని చరిత్రకారులు చెబుతారు. అప్పట్లో చైనా ఆయుధాల తరలింపునకు ఈ హైవే ఉపయోగపడింది. ఆక్సాయ్‌చిన్‌పై చైనా ఆధిపత్యానికి ఈ హైవే పునాదులు వేసింది.

టిబెట్‌ను చైనాలోని ఇతర ప్రావిన్సులకు కలిపేందుకు అక్కడి ప్రభుత్వం మొత్తం నాలుగు ప్రాజెక్టులను ప్లాన్ చేసింది. టిబెట్‌ను జింజియాంగ్‌తో పాటు కింఘాయ్, సిచువాన్, యున్నన్ ప్రావిన్స్‌లతో ఈ మార్గాల ద్వారా అనుసంధానం చేయాలనేది ప్లాన్. ఇప్పటికే కింఘాయ్-టిబెట్ మార్గం అందుబాటులోకి వచ్చింది. మిగతా రెండు ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి.

ఇటీవల భారత్, చైనా మధ్య సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో కమ్యూనిస్టు దేశం ఈ కొత్త రైలు ట్రాక్ ప్రాజెక్టును ప్రకటించడం కొసమెరుపు. ఇదిలా ఉంటే ఆగస్టు 31 నుంచి ప్రారంభం కానున్న షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని మోదీ కూడా పాల్గొననున్నారు.


ఇవి కూడా చదవండి:

మరో బ్రిటన్ ఎఫ్-35 విమానంలో సాంకేతిక సమస్య.. జపాన్‌‌‌లో అత్యవసర ల్యాండింగ్

షాకింగ్.. విమానం గాల్లో ఉండగా పవర్ బ్యాంక్‌లో మంటలు రేగడంతో..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 11 , 2025 | 07:57 PM