UK F-35: మరో బ్రిటన్ ఎఫ్-35 విమానంలో సాంకేతిక సమస్య.. జపాన్‌లో అత్యవసర ల్యాండింగ్
ABN , Publish Date - Aug 10 , 2025 | 09:44 PM
బ్రిటన్‌కు చెందిన మరో ఎఫ్-35 ఫైటర్ జెట్ సాంకేతిక సమస్యల కారణంగా జపాన్‌లో అత్యవసరంగా ల్యాండవ్వాల్సి వచ్చింది. ఆదివారం కొగొషిమా ఎయిర్‌పోర్టులో విమానం దిగింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బ్రిటన్ యుద్ధ విమానం అత్యవసర ల్యాండింగ్ ఉదంతం మరువకు ముందే సరిగ్గా ఇలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. సాంకేతిక సమస్యల కారణంగా మరో బ్రిటన్ ఎఫ్-35 ఫైటర్ జెట్ జపాన్‌లో ఎమర్జెన్సీగా ల్యాండయ్యింది.
జపాన్ మీడియా ప్రకారం, ఆదివారం కొగొషిమా ఎయిర్‌పోర్టులో బ్రిటన్ విమానం అత్యవసరంగా దిగింది. బ్రిటన్ విమానం కోసం ప్రత్యేకంగా రన్ వేను కేటాయించడంతో ఇతర విమానాల రాకపోకలకు సుమారు 20 నిమిషాల పాటు అంతరాయం కలిగింది. ఉదయం 11.30 గంటల సమయంలో బ్రిటన్ విమానం అక్కడి దిగింది.
ప్రస్తుతం అక్కడ బ్రిటన్, జపాన్, అమెరికాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఆగస్టు 4న మొదలైన ఈ జాయింట్ డ్రిల్స్ వచ్చే మంగళవారం వరకూ కొనసాగుతాయి. వెస్టర్న్ పెసిఫిక్‌కు చెందిన కేరియర్ స్ట్రైక్ గ్రూప్ ఇందులో పాలుపంచుకుంటోంది.
జులైలో బ్రిటన్‌కు చెందిన ఓ ఎఫ్-35 ఫైటర్ జెట్ తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దిగిన విషయం తెలిసిందే. సాంకేతిక లోపం కారణంగా బ్రిటన్ పైలట్ ఈ ఎయిర్‌పోర్టులో విమానాన్ని ల్యాండ్ చేయాల్సి వచ్చింది.. ఆ తరువాత మరమ్మతులు ఆలస్యం కావడంతో దాదాపు నెల రోజుల పాటు విమానం భారత్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు ప్రత్యేక నిపుణుల బృందం భారత్‌కు వచ్చి మరమ్మతులు పూర్తి చేయడంతో ఎఫ్-35 మళ్లీ తిరుగుప్రయాణమైంది.
అమెరికాకు చెందిన రక్షణ రంగ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ ఈ ఫైటర్ జెట్స్‌ను రూపొందించింది. శత్రుదేశాలకు చిక్కని అత్యంత శక్తిమంతమైన విమానంగా ఎఫ్-35 పేరు గడించింది. పొడవు తక్కువగా ఉన్న రన్ వేలపై ల్యాండవడం, అవసరమనుకుంటే హెలికాఫ్టర్‌లా నిట్టనిలువుగా టేకాఫ్ చేసే సామర్థ్యం ఈ విమానాలకు ఉంది. వీటి ధర 90 మిలియన్ డాలర్ల నుంచి 110 మిలియన్ డాలర్ల వరకూ ఉంటుందని నిపునులు చెబుతున్నారు. ఈ విమానం అభివృద్ధికి అమెరికా సుమారు 1.7 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
షాకింగ్.. విమానం గాల్లో ఉండగా పవర్ బ్యాంక్‌లో మంటలు రేగడంతో..
మా యుద్ధ విమానాలకు ఏమీ కాలేదు.. భారత వాయుసేన చీఫ్ ప్రకటనపై పాక్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి