Share News

Elephant Mosquitoes: చైనాలో దోమలకు దోమలతోనే చెక్‌..

ABN , Publish Date - Aug 07 , 2025 | 04:23 AM

ముల్లును ముల్లుతోనే తీయాలి.. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి.. అనే మాటలను బాగా వంటబట్టించుకున్నా,.

Elephant Mosquitoes: చైనాలో దోమలకు దోమలతోనే చెక్‌..

  • చికున్‌గున్యా కట్టడికి ఏనుగు దోమల ప్రయోగం

బీజింగ్‌, ఆగస్టు 6: ‘‘ముల్లును ముల్లుతోనే తీయాలి’’.. ‘‘వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి’’.. అనే మాటలను బాగా వంటబట్టించుకున్నారేమో చైనా వాళ్లు..! అందుకే ఇప్పుడు దోమల బెడదను దోమలతోనే అరికడుతున్నారు. విషయం ఏంటంటే..? చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని ఫోషన్‌ నగరంలో చికున్‌గున్యా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు అధికారికంగా 8 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో.. సర్కారు కొవిడ్‌ కాలంలో తరహా కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. అదే సమయంలో చికున్‌గున్యా వైర్‌సకు కారణమయ్యే దోమలకు చెక్‌ పెట్టేందుకు ఏనుగు దోమల(ఎలిఫెంట్‌ మస్కిటోలు)ను రంగంలోకి దింపింది. టెక్సోరెంకైటిస్‌ అనే రకం దోమలను ఏనుగు దోమలు అంటారు. ఇవి ప్రపంచంలోనే అతి పెద్ద దోమజాతికి చెందినవి. ఇవి 18 మిల్లీమీటర్ల(1.8సెంటీమీటర్లు) నుంచి 24 మిల్లీమీటర్ల వరకు పెరుగుతాయి. ఈ దోమలు మనుషులను కుట్టవు. చెట్లలోని రసాలను పీల్చి బతుకుతాయి. ఏనుగు దోమలు కూడా సాధారణ దోమల్లాగే మురికి నీళ్లు, నిల్వ ఉన్న నీటిలో గుడ్లను పెడతాయి. అయితే.. వీటి గుడ్ల నుంచి 40-60 గంటల్లోనే లార్వాలు బయటకు వస్తాయి. అవి సాధారణ దోమల గుడ్లను తిని, పెరుగుతాయి. లార్వా దశ ముగిసేలోగా ఒక్కో ఏనుగు దోమ కనీసం 100 దోమల గుడ్లను తింటుంది. దీని వల్ల ఇతర దోమల సంతానం పెరగదు. ఇప్పుడు చైనా సర్కారు కాలువలు, రోడ్లపై నిల్వ ఉన్న నీటిలో ఈ తరహాలో 5 వేల దాకా ఏనుగు దోమల లార్వాలను వదిలింది. కాగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కూడా ప్రపంచ దేశాలకు గున్యా వ్యాప్తిపై హెచ్చరికలు జారీ చేయగా.. అమెరికాకు సీడీసీ తమ పౌరులకు చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌కి వెళ్లకుండా ట్రావెల్‌ అడ్వయిజరీ జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఊటీలో పర్యాటక ప్రాంతాల మూసివేత.. కారణం ఏంటంటే..

అమిత్‌షాపై పరువునష్టం వ్యాఖ్యలు.. రాహుల్‌కు బెయిల్

Read Latest Telangana News and National News

Updated Date - Aug 07 , 2025 | 04:23 AM