Charlie Kirk: చార్లీ కిర్క్ హత్య.. హంతకుడి రైఫిల్ పోలీసులకు లభ్యం
ABN , Publish Date - Sep 11 , 2025 | 09:16 PM
ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యకు నిందితుడు వాడిన హైపవర్డ్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి ఫొటో కూడా లభించిందని, దర్యాప్తు కొనసాగుతున్నందున దాన్ని విడుదల చేయలేమని అధికారులు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, సంప్రదాయ వాది చార్లీ కిర్క్‌ను హత్య చేసిన నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుడు వాడిన హైపవర్డ్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. హంతకుడిది కాలేజీ విద్యార్థి వయసు అయ్యుండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిందితుడి ఫొటోలు కూడా తమ వద్ద ఉన్నాయని యూటా డీపీఎస్ కమిషనర్ బో మేసన్ తెలిపారు. నిందితుడి జాడను త్వరలోనే కనుక్కుంటామన్న నమ్మకం తమకుందని అన్నారు.
యూటా వ్యాలీ యూనివర్సిటీ ప్రాంగణానికి కొద్ది దూరంలో ఉన్న భవనం పైనుంచి చార్లీపై హంతకుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. కాల్పులు జరిపిన వెంటనే అతడు అక్కడి నుంచి పారిపోయాడు. అతడు వెళ్లిన మార్గంలో ఓ చోట హైపవర్డ్ రైఫిల్ లభించిందని ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ రాబర్ట్ బూల్స్ ప్రకటించారు. నిందితుడి అడుగుజాడలను కూడా గుర్తించామని తెలిపారు.
హంతకుడి ఫొటో తమ వద్ద ఉన్నప్పటికీ ఈ విషయంలో అదనపు వివరాలను ప్రస్తుతం వెల్లడించలేమని ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ అన్నారు. త్వరలో ఫొటోను విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పటికే కిర్క్ భార్యతో మాట్లాడానని, ఆమె శోకసంద్రంలో కూరుకుపోయిందని చెప్పారు. ఈ దారుణంపై అమెరికాలో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
తుపాకీ సంస్కృతి, మాస్ షూటింగ్స్‌కు సంబంధించి ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న తరుణంలో కిర్క్ హత్యకు గురైన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
చార్లీ కిర్క్ హత్య.. వైరల్ వీడియోల్లో కీలక విషయాలు వెలుగులోకి
నేపాల్ మహిళా మంత్రి జీవితం తలకిందులు.. ప్రజాగ్రహం వెల్లువెత్తితే ఇంతే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి