Thyroid Problem: మీకు థైరాయిడ్ ఉందా..? అయితే ఇవి అసలు తినకండి..
ABN , Publish Date - Oct 20 , 2025 | 11:58 AM
థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు బ్రోకలి, క్యాబేజీ, కాలీఫ్లవర్.. తదితర ఆహారాలు అసలు తినకూడదని వైద్యులు చెబుతున్నారు. అలాగే థైరాయిడ్ సమస్యతో బాధపడేవాళ్లు సోయా తదితర ఆహారాలు హార్మోన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయని అంటున్నారు.
ప్రస్తుతం ఉన్న సమాజంలో థైరాయిడ్ సమస్య అధికమవుతుంది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా థైరాయిడ్ అందిరిని పట్టి వేధిస్తోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, బిజీ లైఫ్, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, పని భారం.. వల్ల థైరాయిడ్ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే మగవారితో పోల్చితే మహిళల్లో ఈ సమస్య అధికంగా ఉంటుందని చెబుతున్నారు. దీని వల్ల మహిళలు అనేక ఇబ్బందులు పడుతుంటారు. పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, బరువు పెరగడం లాంటి ఆరోగ్య సమస్యలు వారిని నిత్యం వెంటాడుతుంటాయని నిపుణులు చెప్తున్నారు.
థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు బ్రోకలి, క్యాబేజీ, కాలీఫ్లవర్.. తదితర ఆహారాలు అసలు తినకూడదని వైద్యులు చెబుతున్నారు. అలాగే థైరాయిడ్ సమస్యతో బాధపడేవాళ్లు సోయా తదితర ఆహారాలు హార్మోన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయని అంటున్నారు. సోయాలోని ఐసోఫ్లేవన్స్ థైరాయిడ్ గ్రంథి పనితీరుకు ఆటంకం కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. అలాగే.. చక్కెర మోతాదు అధికంగా ఉన్న ఆహారం తింటే థెరాయిడ్ పనితీరులో హెచ్చుతగ్గులు జరిగి ఈ సమస్య అధికం అవుతుందని వైద్యులు వివరిస్తున్నారు.
థైరాయిడ్‌తో బాధపడేవాళ్లు మద్యం సేవించడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్.. థైరాయిడ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని సమస్య మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే.. టీ, కాఫీలు అధికంగా తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. ఫ్యాట్ అధికంగా ఉన్న ఆహారం కారణంగా థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడుతున్నవారిపై ప్రభావం ఉంటుందని వైద్యులు అంటున్నారు. అయితే.. గుడ్లు, బాదం, సన్ ఫ్లవర్ గింజలు, వేరుసెనగలు, పండ్లు, తాజా కూరగాయలు, మిల్లెట్స్, గోధుమ రొట్టెలు తినొచ్చని వైద్యులు వివరించారు. అలాగే ప్రతిరోజూ సరిపడా నీరు తాగడం, వ్యాయామం చేయడం ద్వారా థైరాయిడ్ సమస్య నియంత్రణలోకి వస్తుందని వైద్యులు వెల్లడించారు.