పిల్లల కంటి ఆరోగ్యానికి ఏ ఆహారం ఇవ్వాలి..
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:18 AM
పదేళ్లలోపు పిల్లల్లో కంటి ఆరోగ్యం చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ వయసులోనే చూపు బలంగా ఉండేందుకు పునాది ఏర్పడుతుంది. సరైన ఆహారం ద్వారా కంటి ఆరోగ్యాన్ని బలోపేతం చేయవచ్చు. విటమిన్ ఎ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు ఇవ్వాలి, ఇవి చూపును కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
పదేళ్లలోపు పిల్లల కంటి ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహార పదార్థాలు ఇస్తే మంచిది?
- విజయదుర్గ
పదేళ్లలోపు పిల్లల్లో కంటి ఆరోగ్యం చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ వయసులోనే చూపు బలంగా ఉండేందుకు పునాది ఏర్పడుతుంది. సరైన ఆహారం ద్వారా కంటి ఆరోగ్యాన్ని బలోపేతం చేయవచ్చు. విటమిన్ ఎ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు ఇవ్వాలి, ఇవి చూపును కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. క్యారెట్, గుమ్మడికాయ, బీట్‌రూట్, పాలకూర, గోంగూర, బచ్చలి లాంటి ఆకుకూరలు, టమాటా, మామిడి, బొప్పాయి, ఆరెంజ్, కర్బుజా లాంటి పసుపు, నారింజ, ఎరుపు రంగు పండ్లలో విటమిన్ ఏ అధికం. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. అక్రోట్,చియా సీడ్స్, అవిసె గింజలు, బాదం, పల్లీలు లాంటి విత్తనాలు, గింజల్లో లభిస్తాయి.
ఇవి కంటి పొడిబారడాన్ని తగ్గించి చూపును స్పష్టంగా ఉంచుతాయి. అదేవిధంగా విటమిన్ సి, ఈ కూడా కంటికి రక్షణ కల్పిస్తాయి. వీటి కోసం నిమ్మకాయ, ఆరెంజ్, జామ, ఉసిరి, ద్రాక్ష, స్ట్రాబెర్రీ లాంటి పళ్ళు, గింజలలో బాదం, పొద్దు తిరుగుడు విత్తనాలు ఇవ్వడం మంచిది. కంటికి సంబంధించిన కణజాల బలం కోసం ప్రొటీన్ అవసరం. కాబట్టి పప్పులు, శనగలు, రాజ్మా, కిడ్నీ బీన్స్, పాలు, పెరుగు, పనీర్ లాంటివి ఆహారంలో చేర్చాలి. తగినంత నీరు తాగడం వల్ల కంటి తేమను కాపాడవచ్చు. కేవలం ఆహారమే కాక కనీసం రోజుకు అరగంట వ్యాయామం చేస్తే రక్త ప్రసరణ బాగా జరిగి, కంటికి చేరే రక్తంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
వాతావరణ మార్పుల వలన దగ్గు, జలుబులు తగ్గినట్లుగా తగ్గి మళ్ళీ వస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- సతీష్, సికింద్రాబాద్
వర్షాలు పడడం మొదలవగానే ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణంలో తేమ పెరగడం వల్ల రకరకాల వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి సూక్ష్మజీవులు త్వరగా వ్యాపిస్తాయి. అందుకే వర్షాలు మొదలవగానే పిల్లల్లో కూడా జలుబులు, జ్వరాలు లాంటి అనారోగ్యాలు తరచుగా వస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు కొంతవరకు ఈ అనారోగ్యాల నుండి రక్షణ పొందవచ్చు. నిమ్మ, నారింజ, ఆపిల్, జామలాంటి తాజా పండ్లన్నింటిలో అధికంగా ఉండే విటమిన్ సి; బాదం, పిస్తా, ఆక్రోట్, పొద్దుతిరుగుడు లాంటి గింజల్లో విటమిన్ ఈ; అరటి పండ్లు, ఉడికించిన దుంపలు, ఉడికించిన సెనగల్లో విటమిన్ బీ 6; క్యారెట్, బొప్పాయి, గుమ్మడి మొదలైన వాటిల్లో విటమిన్ ఏ; ఆకుకూరల్లో,
పప్పు ధాన్యాల్లో ఫోలేట్; సూర్యరశ్మి నుంచి విటమిన్ డీ, మాంసాహారం, ఆకుకూరల నుంచి ఐరన్; పెరుగు,మజ్జిగ నుంచి వచ్చే ప్రోబయాటిక్స్ ఇవన్నీ కూడా రోగనిరోధక శక్తికి ఎంతో అవసరం. ఈ విటమిన్లు, మినరల్స్‌ను టాబ్లెట్‌రూపంలో కాకుండా ఆహారంగా తీసుకుంటే వాటి ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. సరైన ఆహారం తీసుకోవడమే కాకుండా ఈ సూక్ష్మజీవుల బారిన పడకుండా ఉండాలంటే శుచి శుభ్రత ముఖ్యం. ఎప్పుడు బయటికి వెళ్లి వచ్చినాకాళ్ళు, చేతులు, ముఖం సబ్బుతో కడుక్కోవడం, వేడిగా ఉండే ఆహారం మాత్రమే తినడం, మంచినీళ్లు కాచి చల్లార్చి తాగడం, ఇంట్లో తేమ లేకుండా చూసుకోవడం, వర్షంలో తడిసినప్పుడు వెంటనే పొడి బట్టలు మార్చుకోవడం మొదలైన జాగ్రత్తలు పాటిస్తే ఈ జలుబులు, జ్వరాలు వచ్చే అవకాశం తగ్గుతుంది.
వర్షాకాలంలో పండ్లు, సలాడ్లు తినాలని అనిపించదు. ఇలా చేయడం వల్ల పరవాలేదా?
- హన్సిక, వరంగల్

వర్షాకాలంలో తేమ అధికంగా ఉండటంతో జీర్ణక్రియ కొంత మందగిస్తుంది. ఈ కారణంగా చాలా మందికి చల్లటి ఆహారాలైన పండ్లు, సలాడ్లు తినాలని అంతగా అనిపించదు. ఇది సహజమే అయినా, పండ్లు, సలాడ్లను పూర్తిగా మానేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌ను అందించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వర్షాకాలంలో తరచుగా జలుబు, దగ్గు, జ్వరాలు,
ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో పండ్లు, సలాడ్లలో ఉండే పోషకాలు శరీర రక్షణకు తోడ్పడతాయి. అయితే ఈ సీజన్‌లో బయట దొరికే కట్‌ఫ్రూట్స్ లేదా సలాడ్లు తినకపోవడం మంచిది, ఎందుకంటే వర్షకాలంలో పరిశుభ్రత లోపిస్తే బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఇంట్లోనే బాగా కడిగి, తాజాగా తయారు చేసిన పండ్లు లేదా సలాడ్లు మాత్రమే తినాలి. నేరుగా పండ్లు లేదా సలాడ్లు తినాలని అనిపించకపోతే వాటిని వేరే రూపంలో తీసుకోవచ్చు. ఉదాహరణకు పండ్లను చిన్న ముక్కలుగా కోసి ఫ్రూట్ బౌల్‌గా, కూరగాయలను ఉడకబెట్టి సూప్‌గా లేదా పెరుగు కలిపి చట్నీ లేదా రైతా రూపంలో తినవచ్చు.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్